పింగళి జయంతికి పరిపూర్ణ నివాళి

- December 31, 2023 , by Maagulf
పింగళి జయంతికి పరిపూర్ణ నివాళి

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అలనాటి మాటల మాంత్రికునిగా పేరుగాంచిన ప్రఖ్యాత సినీ రచయిత పింగళి నాగేంద్ర రావు  122వ జయంతి సందర్భంగా, శుక్రవారం అంతర్జాల మాధ్యమంగా "పింగళి మాటా పాటా" కార్యక్రమాన్ని అద్వితీయంగా నిర్వహించారు. 

మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ, గుండమ్మ కథ, జగదేకవీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, అప్పుచేసి పప్పుకూడు, గుణసుందరి కథ, పెళ్లి చేసి చూడు, మొదలైన అద్భుతమైన తెలుగు సినీ రత్నాలకు పాటలు, మాటలు అందించిన పింగళి రచనా వైశిష్యం, సామర్థ్యం ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ప్రముఖ సినీగేయకవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసూరావు పాల్గొని పింగళి జీవిత విశేషాలను గురించి, వారి సినీ ప్రస్థానం గూర్చి ఎన్నో విశేషాలను పంచుకున్నారు.  

ప్రముఖ గాయకులు తాతా బాలకామేశ్వరరావు, చింతలపాటి సురేష్, వైఎస్ రామకృష్ణ, శాంతిశ్రీ, డా. స్రవంతి, భవ్య తుములూరు పింగళి గారు రచించిన అనేక ఆణిముత్యాలు అయిన పాటలను ఆలపించి అలరించారు. 

రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, అమెరికా నుండి ప్రముఖ గాయని శారదా ఆకునూరి, ఖతార్ నుండి వెంకప్ప భాగవతుల, సాహిత్య జ్యోత్స్న, మలేషియా నుండి సత్య దేవి మల్లుల తదితరులు అంతర్జాల మాధ్యమంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సభకు అభినందనలు తెలియజేశారు. 

గింబళి, డింభకా, డింగరి, వీరతాడు, అస్మదీయులు వంటి ఎన్నో నూతనపద ప్రయోగాలను తెలుగువారింట ఊత పదాలుగా మార్చేసిన పింగళి సంభాషణా చాతుర్యం గురించి, ప్రణయ పూరిత, హాస్య భరిత ఆలోచనత్మక, తాత్విక,వ్యంగ్యభరిత, విషాదయుక్త మొదలైన వైవిధ్యభరితమైన కోణాల నుండి పింగళి అందించిన అలనాటి పాటలను వాటిలోని రచనా చమత్కృతి అలంకార విశేషాలను గురించి సవివరంగా విశ్లేషించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

కల్చర్ టీవీ సాంకేతిక నిర్వహణలో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడి అభిమానుల మన్ననలు అందుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com