పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్.. కనీసం 100 మందికి పైగా మృతి

- January 03, 2024 , by Maagulf
పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్.. కనీసం 100 మందికి పైగా మృతి

టెహ్రాన్: జనవరి 3, 2020లో అమెరికా వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసీం సులేమానీ వర్ధంతి కార్యక్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు పేలుళ్లకు తెగబడ్డారు. ఆయన సమాధి వద్ద జరిగిన ఈ జంట పేలుళ్లలో కనీసం 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. . మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. ఈ పేలుళ్లను ఉగ్రవాద చర్యగా ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. అయితే, గాజాలోని హమాస్‌ అంతమే లక్ష్యంగా ఇజ్రాయేల్ గత మూడు నెలలుగా చేస్తున్న యుద్ధంతో మధ్యప్రాచ్యంలో (మిడ్ ఈస్ట్) ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పేలుళ్లు చోటుచేసుకోవడం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

ఈ ఘాతుకం వెనుక ఎవరున్నారనేది మాత్రం తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు. మొదటి పేలుడు సంభవించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నట్టు ఇరాన్ అధికారిక టెలివిజన్ తెలిపింది. కెర్మాన్ అమరుల శ్మశానానికి వెళ్లే మార్గంలో రెండు పేలుడు సామాగ్రిని అమర్చి డిటోనేటర్లను రిమోట్ సాయంతో ఉగ్రవాదులు పేల్చారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి అన్నారు.

ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధి బబక్ బాబాక్ యెక్తపరస్త్ మాట్లాడుతూ.. బాంబు పేలుళ్లలో కనీసం 70 మంది చనిపోయారని, మరో 170 మంది గాయపడ్డారని తెలిపారు. అయితే, కొద్ది సేపటికి అధికారిక మీడియా మృతుల సంఖ్య 100 దాటినట్టు వెల్లడించింది. రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన ఎలైట్ ఖుడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులేమానీ హత్య జరిగి నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఆయన నాలుగో వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి.

జనవరి 2020లో ఇరాక్‌ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా డ్రోన్ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అప్పట్లో శపథం చేసింది. కాగా, పేలుళ్ల అనంతరం ఆ ప్రాంతంలో బీతావాహన వాతావరణం నెలకుంది. జనాలు చెల్లాచెదురుగా పారిపోగా.. ఆ క్రమంలో చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తర్వాత రెండో పేలుడు సంభవించినట్లు వీడియో ఫుటేజీ ప్రకారం గుర్తించారు.

తొలి పేలుడు తర్వాత వెంటనే ప్రతిస్పందించే ఎమర్జెన్సీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని రెండో పేలుడుకు తెగబడ్డారు. ఎక్కువ ప్రాణనష్టాన్ని కలిగించడానికి తీవ్రవాదులు తరచుగా ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. బాధితుల ఆర్తనాదాలు, అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com