అయోధ్య రామమందిరంలో ఐదు మండపాలు.. ఆలయ ప్రధాన విశేషాలు ఇవే..

- January 04, 2024 , by Maagulf
అయోధ్య రామమందిరంలో ఐదు మండపాలు.. ఆలయ ప్రధాన విశేషాలు ఇవే..

అయోధ్య రామమందిరంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రామ మందిరం ప్రారంభ మహోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా లక్ష మందికి పైగా భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే రామమందిర ప్రారంభ మహాత్సవం కోసం ఎంతో మంది భక్తులు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రామ మందిరం విశేషాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్య రామ మందిర విశేషాలను వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని ప్రాంతాల నుండి శ్రీరాముని గర్భగుడి వరకు ఆలయ వైభవం గురించి ట్రస్ట్ సమాచారాన్ని పంచుకుంది.

ఆ వివరాలు చూస్తే.. మూడు అంతస్తుల రామ మందిరం సాంప్రదాయ నాగర్ శైలిలో నిర్మించబడింది. రామందిరం 380 అడుగుల పొడవు (తూర్పు-పడమర), 250 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో శ్రీ రామ్ లాలా విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది.

రామమందిరంలో 5 మండపాలు (హాళ్లు) ఉంటాయి.. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఆలయ గోడలు, స్తంభాలు.. దేవతల శిల్పాలతో చెక్కబడి ఉంటాయి. ఆలయ ప్రవేశం తూర్పు దిక్కు నుంచి ఉంటుంది. సింహ ద్వారం నుండి భక్తులు 32 మెట్లు ఎక్కి లోనికి ప్రవేశించాలి. ఆలయం వద్ద వికలాంగులు, వృద్ధ యాత్రికుల సౌకర్యార్థం ర్యాంపులు, లిఫ్టుల ఏర్పాటు ఉంది.

ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార గోడ ఉంటుంది. ఇది 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో ఆలయం చుట్టూ ఉంది. ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం (PFC) నిర్మించబడుతోంది. ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాన్ని అందించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com