దళితోద్ధారకుడు..!
- April 05, 2024
"బాబూజీ" అని పిలుచుకునే జగ్జీవన్ రామ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అణగారిన సమాజం ఉద్ధరణ గురించి మాట్లాడినా, దళితుల హక్కుల కోసం పోరాడాలనే మాట వచ్చినా.. సువర్ణాక్షరాలతో గుర్తుపెట్టుకునే పేరు.అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం. నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని షాహాబాద్(ఇప్పుడు భోజ్‌పూర్) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన పాఠశాలలోనే మొదటిసారిగా వివక్షను అనుభవించాడు. పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ రెండు కడవలపై ‘హిందూ పానీ’, ‘ముస్లిం పానీ’ అని రాసి ఉంచేవారు. అయితే జగ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు.
ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కలు ముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ‘హరిజన పానీ’ అనే మరో కుండను ఏర్పాటు చేశాడు. జగ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగులకొట్టాడు. ఇక చేసేదేమీ లేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటు చేశారు.ఈ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగడానికి ప్రేరణనిచ్చాయి.
తండ్రి జీవన తాత్విక బాటలో అహింసా తత్వాన్ని పుణికి పుచ్చుకొని, గాంధీ స్ఫూర్తితో జగ్జీవన్ రామ్ జాతీయోద్యమంలో పాల్గొని,బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు.
1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా జగ్జీవన్ రామ్ ప్రపంచ రికార్డు సాధించారు. నెహ్రూ,శాస్త్రి,ఇందిరా,మొరార్జీ దేశాయ్ మంత్రివర్గాల్లో కీలకమైన మంత్రి పదవులను అధిరోహించారు.అత్యంత గౌరవనీయమైన దళిత నాయకుల్లో ఒకరైన రామ్ దేశంలో హరిత విప్లవం విజయవంతం కావడంలో కీలకమైన పాత్ర పోషించారు.
జగ్జీవన్ రామ్ కార్మిక పక్షపాతి. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిషన్లను ఏర్పాటు చేసి నివేదికల ఆధారంగా కార్మిక ప్రజా ప్రయోజనాల కోసం కనీస వేతనాల చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం, ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సవరణ) చట్టం, బోనస్ చెల్లింపుల చట్టం వంటి వివిధ కార్మిక ప్రజోపయోగ చట్టాలను రూపొందించారు.
దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలుచేయడానికి జగ్జీవన్‌రామ్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. భారతదేశ ప్రజల చేత ‘బాబూజీ’ అన్న పిలుపు పొందిన గౌరవం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే దక్కింది. ఒకరు మహాత్మాగాంధీ కాగా, మరొకరు బాబూ జగ్జీవన్ రామ్.సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!