సీఎం జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం..
- April 15, 2024
అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునః ప్రారంభం కానుంది. బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డిపై రాయిదాడి చేసిన విషయం తెలిసిందే. రాయిదాడితో జగన్ కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు జగన్ కు చికిత్స నిర్వహించి గాయమైన చోట కుట్లు వేశారు. ఆదివారం విశ్రాంతి తీసుకున్న జగన్.. సోమవారం తిరిగి బస్సు యాత్రను పునః ప్రారంభించనున్నారు.
జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సోమవారం కేసరపల్లి దగ్గర నుంచి ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట మీదుగా జొన్నపాడు వద్దకు బస్సు యాత్ర చేసుకుంటుంది. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు, జనార్దనపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర చేరుకుంటుంది. గుడివాడలో బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 8గంటల సమయానికి కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నుండి ఏలూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. బొమ్మలూరు, కలపర్రు, ఏలూరు బైపాస్ మీదుగా దెందులూరు, గుండుగొలను, భీమడోలు, కైకరం, నారాయణపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. నారాయణపురంలో రాత్రి బస శిబిరానికి జగన్ చేరుకుంటారు.
విజయవాడలో సీఎం పై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి నేతృత్వంలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భద్రత పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అయితే, బస్సు యాత్రలో రాయిదాడి ఘటనపై జగన్ మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?