నట తపస్వి

- April 27, 2024 , by Maagulf
నట తపస్వి

తెలుగు ప్రేక్షక హృదయాల్లో విలక్షణమైన పాత్రలకు పేరుగాంచిన సుప్రసిద్ధ నటులు ఆయన. రంగస్థలంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన వెండితెరపైనా, బుల్లితెరపైనా మెరిసి ప్రేక్షకులను అలరించారు. ఆయనే శంకరాభరణం శంకరశాస్త్రి గా ప్రసిద్ధి గాంచిన సోమయాజులు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు. నేడు సోమయాజులు వర్థంతి.

సోమయాజులు 30-6-1928న శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు శారదాంబ, వెంకటశివరావు లు. ఈయన సోదరుడు జె.వి.రమణమూర్తి  ప్రసిద్ధ నటుడు. నటన పట్ల ఆసక్తితో చదువుకునే  నుంచి నాటకాలు వేసేవారు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్ప పంతులు" పాత్రకు కేరాఫ్ గా నిలిచారు.

సోమయాజులు ఒకవైపు నాటకాల్లో నటిస్తూనే  విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే  కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో "శంకరాభరణం" చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. శంకరాభరణం సినిమాలోని శంకరశాస్త్రి పాత్ర ద్వారా  ఆయన ఎంతో పేరు, ప్రఖ్యాతులు గడించారు. దీనితర్వాత 150 సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ, ఇప్పటికీ సోమయాజులు గారికి చిరస్థాయిగా మిగిలిన చిత్రం 'శంకరాభరణం'. శంకరాభరణం విజయవంతమైన తర్వాత, రెవెన్యూ సర్వీసులో డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తూ ప్రభుత్వ అనుమతి లేకుండా సినిమాల్లో నటిస్తున్నారని, ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిర్యాదు చేశారు. అతను పరిశీలించి, సాంస్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా సోమయాజులును నియమించారు.

రాష్ట్ర సాంస్కృతిక డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవించింది. అనంతరం పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నాటక శాఖకు సోమయాజులను ఎన్టీఆర్ ప్రభుత్వం నియమించింది . ఈ క్రమంలోనే 1993 మార్చి 8వ తేదీన రసరంజని నాటక  సంస్థను నెలకొల్పారు. ప్రతిరోజూ నాటకాన్ని ప్రదర్శించాలనీ, టికెట్‌ కొని నాటకాన్ని చూసే ఆదర్శాన్ని పెంపొందించాలనే సదాశయంతో రసరంజని స్థాపన జరిగింది. హైదరాబాద్‌లో నాటకరంగ వికాసానికి ఈ సంస్థ ఎంతో కృషి చేసింది. ఈ క్రమంలో జెవి సోమయాజులు అందించిన కంట్రిబ్యూషన్‌ చెప్పుకోదగింది.

నాటక, సినిమా, టివి రంగాలకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఘనుడు సోమయాజులు గారు. 150 సినిమాల్లో నటించినా, టివి సీరియల్స్‌లో కూడా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను సోమయాజులు ధరించారు. సోమయాజులు చివరి శ్వాస వరకు నటన మీద గౌరవంతో ఆరాధనాభావంతో జీవించారు.ఏప్రిల్‌ 27, 2004లో హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. 

                                     --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com