ఇండియన్ పికాసో

- April 29, 2024 , by Maagulf
ఇండియన్ పికాసో

రాజా రవివర్మ భారతీయ ప్రముఖ చిత్రకారుడు. తనదైన శైలి లో రామాయణ, మహా భారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందారు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా చిత్రించడంలో అతనికి అతనే సాటి.  నేడు ఇండియన్ పికాసో గా ప్రసిద్ధి గాంచిన  రాజా రవివర్మ జయంతి.

రాజా రవివర్మ కేరళలోని తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదంలో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు 1848 ఏప్రిల్ 29న జన్మించారు. చిన్నతనంలోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద రవివర్మ  శిష్యరికం చేశారు . తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నారు. పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.

1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించారు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవాడు. ముఖ్యంగా మహాభారతంలోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు.

1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించాడు. అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు.

1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.

చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వము ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారము ప్రతి ఏటా కళలు,సంస్కృతి అభ్యున్నతికై, విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది.రాజా రవివర్మ గారి పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను కూడా నెలకొల్పారు.

భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించారు. ఇతను మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు. 

                                   --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com