పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్‌ జోషి

- May 12, 2024 , by Maagulf
పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్‌ జోషి

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కోసం రాచకొండ కమిషనరేట్‌లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కమిషనరేట్‌లోని 5 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ సమయం పెంచడంతో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 3 వేల396 పోలింగ్‌ స్టేషన్‌లు ఉన్నాయి. ఇందులో 533 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 188 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పోలింగ్‌ కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 11 కోట్ల9 లక్షల రూపాయల నగదు, 75లక్షల78 వేల రూపాయల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కోటి 95 వేల రూపాయల విలువైన గంజాయి, OPM, MDMA, హెరాయిన్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. 10 లక్షల రూపాయల విలువైన కుక్కర్లు, ఇతర గృహోపకరణాలు సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌ పరిధిలో 8 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉండగా... 29 ఫ్లయింగ్‌ స్వ్కాడ్లు, 25 స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందాలు విధులు నిర్వర్తిస్తున్నట్లు CP తరుణ్‌ జోషి తెలిపారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటివరకు 114 కవాతు ప్రదర్శనలు నిర్వహించారు. లైసెన్స్‌ కలిగి ఉన్న వెయ్యి 114 తుపాకులను పోలీసులు డిపాజిట్‌ చేసుకున్నారు. రౌడీషీటర్లు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారు, అనుమానితులు మొత్తం 4వేల892 మందిని పోలీసులు బైండోవర్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన వారిపై 14 కేసులు నమోదు చేశారు. కమిషనరేట్‌లోని 8వేల మందికి పైగా పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్‌లను జియో ట్యాగింగ్‌ చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి వెల్లడించారు. ఈనెల 13 న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని... ప్రతి ఒక్కరు ఓటు వేయాలని సీపీ తరుణ్‌ జోషి కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com