'లెజెండ్‌' కు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

- June 09, 2016 , by Maagulf
'లెజెండ్‌' కు పుట్టిన రోజు శుభాకాంక్షలు..

మాటల్లో నిర్మొహమాటత్వం.. అభిప్రాయాలు, ఆలోచనల్లో ఖచ్చితత్వం.. చేసే పనిలో అంకిత భావం.. క్రమశిక్షణ, ముక్కుసూటితనం, నిజాయితీ. నందమూరి నట వారసుడిగా.. అభిమానుల ఆరాధ్య నటుడిగా తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్రవేశారు బాలకృష్ణ. ఆయన ఏ ఒక్క జోనర్‌ సినిమాలకో.. పాత్రలకో పరిమితం కాలేదు. నట వారసత్వానికి కొత్త అర్థం చెపుతూ ఎప్పటికప్పుడు అభిమానులు మెచ్చే చిత్రాలను తీస్తున్నారు. అంతేకాదు జయాపజయాలు దైవాధీనం అంటారు. 'తాతమ్మ కల'తో మొదలైన బాలయ్య సినీ ప్రస్థానం.. ఈ ఏడాది అరుదైన మైలురాయిని అందుకుంది. తన కెరీర్‌లో 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'గా ఆయన అలరించబోతున్నారు.
శుక్రవారం 'లెజెండ్‌' పుట్టిన రోజు సందర్భంగా 'బసవతారకరామ పుత్ర'కి జన్మదిన శుభాకాంక్షలు చెపుతూ..
  
తెరపై తొలి అడుగులు..! చిన్నప్పటి నుంచి తన తండ్రి ఎన్టీఆర్‌ చిత్రాలను చూస్తూ పెరగడం వల్ల ఆ ప్రభావం తనపై కూడా పడిందట. ఓ రోజు 'తాతమ్మ కల'లో మనుమడి పాత్ర కోసం నేరుగా తీసుకొచ్చి కెమేరా ముందు నిలబెట్టేశారట. తొలిసారి కెమేరా ముందు మీ తొలి షాట్‌ గురించి చెప్పమంటే.. 'భర్తపేరు తన మనువడికి పెట్టుకున్న నాయనమ్మ పాత్రను భానుమతిగారు చేస్తున్నారు. వారేరీ? ఆయనెక్కడా? ఇంకా రాలేదా? అంటారు. దాంతో నేను చేతిలో పుస్తకాలు కళ్లజోడుతో నడుచుకుంటూ రావాలి. దీనికి రిహార్సల్‌ ఎందుకు డైరెక్టు టేక్‌ చేసేద్దాం! అని దర్శకులైన నాన్నగారు అన్నారు. నాకేమో కొత్త. అద్దాలు లేకుండా ఫ్రేమ్‌ మాత్రమే ఉండే సినిమా కళ్లజోడు పెట్టుకోవడం కూడా విచిత్రంగా అనిపించింది. నడుచుకుంటూ నేను రావాలి. నాన్నగారి 'నిండు మనసులు' చిత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చా. అందులో ఆయన వేసింది రౌడీ పాత్ర. ఇందులో నాది విద్యార్థి పాత్ర. ఆ నడకను అనుకరించే సరికి ''ఆ నడకేమిట్రా? వెధవ'' అని తిట్టారు. అప్పుడు నాకు పాత్రను బట్టి.. నడక, మాట తీరు మారిపోతాయన్న తొలి పాఠం తెలిసింది'' అంటూ చెప్పుకొస్తారు బాలయ్యబాబు.
 
అన్నింటిలో అందెవేసిన చేయి! తొలి నాళ్లలో ఎన్టీఆర్‌ మార్గ'దర్శకత్వం'లో చిత్రాలు చేసినా ఆ తర్వాత తనదైన ముద్రవేస్తూ బాలకృష్ణ కెరీర్‌ ముందుకు సాగించారు. ఈ తరం హీరోల్లో ఆయన ఒక్కరే అన్ని తరహా చిత్రాల్లో నటించిన కథానాయకుడు అనడంలో అతిశయోక్తి లేదేమో. తొలినాళ్లలో 'మంగమ్మ గారి మనుమడు' నుంచి ఈ ఏడాది విడుదలైన డిక్టేటర్‌ వరకు విభిన్న పాత్రలు పోషించారు. కథల ఎంపికలో కొత్తదనం కోరుకుంటూ.. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిత్రాలు చేస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్‌ వారసుడిగా కెరీర్‌ ఆరంభంలోనే దాన వీర శూర కర్ణ, శ్రీమద్విరాట్‌పర్వం లాంటి పౌరాణిక చిత్రాలు చేసిన బాలకృష్ణ అగ్ర కథానాయకుడిగా 'శ్రీకృష్ణార్జున విజయం', శ్రీరామరాజ్యంతో వాటిని కొనసాగించారు.
 
చారిత్రకం 'భళా' అనిపిస్తే.. జానపదం 'బహు బాగున్నదనిపించారు' ఇటీవల విడుదలైన సూర్య '24' గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ, కాలంలో ప్రయాణించే కథాంశంతో కూడిన 'ఆదిత్య 369'లో ఎప్పుడో నటించారు బాలకృష్ణ. సింగితం దర్శకత్వ ప్రతిభకు కృష్ణ కుమారుడిగా, శ్రీకృష్ణదేవరాయులుగా ఆయన నటన అద్భుతం. 'మేకకొక తోక..' అంటూ పద్యం అందుకుని రాయలవారితో 'భళా' అనిపించుకున్నారు. ఇక జానపదంలోనూ బాలయ్య కత్తికి పదునెక్కువే. 'మీరన్నది బాగున్నది.. నేననేది బహు బాగున్నది అనిపించమంటారా? అంటూ 'భైరవ ద్వీపం'లో బాలకృష్ణ అంటుంటే.. పాతాళ భైరవిలో 'నిజం చెప్పమన్నారా.. అబద్ధం చెప్పమన్నారా?' అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగే గుర్తొస్తుంది. పాత్ర కోసం ఎంతైనా కష్టపడతారు అనేందుకు ఉదాహరణ ఆ చిత్రంలో కురూపి వేషం. అంతలా తన నటనతో ఆకట్టుకున్నారు బాలకృష్ణ.
 
ఫ్యాక్షన్‌ హీరో.. యాక్షన్‌ హీరో.. అప్పటి వరకు బాలకృష్ణకు ఉన్న మాస్‌ ఇమేజ్‌ను అమాంతం పెంచేశాయి ఫ్యాక్షన్‌ కథాంశంతో కూడిన చిత్రాలు. బి.గోపాల్‌ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రాలకు బాలకృష్ణ కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యారు. అంతేకాదు ఆ చిత్రాల కు ఒక రకంగా ఆయన ట్రెండ్‌ సెట్టర్‌ అయ్యారు. ఇటీవల కాలంలో వచ్చిన సింహా, లెజెండ్‌ చిత్రాలు బాలకృష్ణలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. అప్పటి వరకు నటించిన చిత్రాల్లోని డైలాగ్‌ డెలివరీకి భిన్నంగా ఈ చిత్రంలో బాలయ్య చెప్పిన డైలాగ్‌లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇలా ఏ జోనర్‌ చిత్రాలు తీసుకున్నా.. బాలకృష్ణ తనదైన శైలిలో మెప్పించారు. ఈ ఏడాది తన సినీ కెరీర్‌లో 100వ చిత్రం మైలురాయికి చేరుకున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' చేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రం కావాలని కోరుకుంటూ మరోసారి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం!
* అత్యధికంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 13 చిత్రాల్లో నటించగా, ఎన్టీఆర్‌, కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఏడేసి చిత్రాల్లో నటించారు. * బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఆయనకు అమితంగా నచ్చినవి మంగమ్మగారి మనువడు, ఆదిత్య 369, భైరవద్వీపం, బొబ్బలిసింహం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, శ్రీరామరాజ్యం, లెజెండ్‌. * స్వతహాగా లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన బాలకృష్ణ 'సింహం' పేరు ఉన్న ఎనిమిది(లయన్‌తో కలిపి) చిత్రాల్లో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com