దర్శకేంద్రుడు
- May 23, 2024
తెలుగు సినిమాకు కమర్షియల్ హంగులు అద్దిన అతి కొద్ది మంది దర్శకుల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు.. భక్తి, రక్తి, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ఆయన తెలుగు తెరమీద ఆవిష్కరించని జోనర్ సినిమానే లేదు.. ఎంత సాదించినా ఎంతటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినా ఎప్పుడూ మౌన ముద్రలో కనిపించే సినీ ముని ఆయన.. ఆయనే ప్రముఖ దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్రరావు. నేడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు.
కోవెలమూడి రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. ఆయన తండ్రి కె.యస్.ప్రకాశరావు ఆ రోజుల్లోనే దర్శకనిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన బాణీ పలికించారు. తండ్రి వద్దనే పలు చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన రాఘవేంద్రరావు. డిగ్రీ కాగానే కమలాకర కామేశ్వరరావు వద్ద ‘పాండవవనవాసము’ చిత్రానికి అసోసియేట్ గా చేరారు. ఆపై వి.మధుసూదనరావు వద్ద కూడా అసోసియేట్ గా పనిచేశారు.
1975లో ‘బాబు’ చిత్రం ద్వారా రాఘవేంద్రరావు దర్శకుడయ్యారు. ఆ చిత్రంలోనే పాటల చిత్రీకరణలో తనదైన బాణీ పలికించారాయన.“అందరు దర్శకులు సీన్ తీయడానికి సినేరియో రాసుకుంటే, రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ కోసమే ఓ స్క్రిప్ట్ రాసుకుంటారు” అని ఆయన సమకాలికులు దాసరి నారాయణరావు సైతం కితాబునిచ్చారు. ఆ సినిమా తర్వాత ‘జ్యోతి’ చిత్రం తెరకెక్కించి, దర్శకునిగా మంచి పేరు సంపాదించారు. అటుపై శోభన్ బాబు, జయసుధ జంటగా ‘రాజా’ చిత్రం రూపొందించారు. ఈ మూడు సినిమాల వయసు కలిగిన రాఘవేంద్రరావు తరువాతి చిత్రంతోనే ఎన్టీఆర్ తో ‘అడవిరాముడు’ వంటి భారీ సినిమాస్కోప్ తీసే స్థాయికి ఎదిగారు.
1977లో ఎన్టీఆర్ హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘అడవిరాముడు’ అనేక రికార్డులు సృష్టించింది. స్టూడియో అవసరం లేకుండా రూపొందిన తొలి చిత్రంగా ‘అడవిరాముడు’ నిలచింది. తెలుగునాట 30 కేంద్రాలకు పైగా ఏకకాలంలో శతదినోత్సవం చూసిన తొలి చిత్రంగా ‘అడవిరాముడు’ నిలచింది. ఇక తెలుగు సినిమాకు ప్రధాన వ్యాపార ప్రాంతాలైన ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఉత్తరాంధ్రలో స్వర్ణోత్సవం చూసిన ఏకైక చిత్రంగా ఈ నాటికీ ‘అడవిరాముడు’ నిలచే ఉంది.
‘అడవిరాముడు’ తరువాత ఎన్టీఆర్ తో భారీ జానపద చిత్రంగా ‘సింహబలుడు’ రూపొందించారు రాఘవేంద్రరావు. హాలీవుడ్ సినిమా ‘స్పార్టకస్’ తరహాలో సాగే ఈ కథ రిపీట్ రన్స్ లో భలేగా జనాన్ని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ తో రాఘవేంద్రుని మూడో చిత్రం హిందీ ‘దస్ నంబరీ’ ఆధారంగా తెరకెక్కిన ‘కేడీ నంబర్ వన్’. ఈ సినిమా జనాన్ని భలేగా మురిపించింది. ఆ పై ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు ‘డ్రైవర్ రాముడు’ తెరకెక్కించగా ఆ సినిమా రజతోత్సవం జరుపుకుంది. ఈ సినిమా తర్వాత వెనువెంటనే ఎన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన చిత్రం ‘వేటగాడు’. ఈ చిత్రం సంచలన విజయం సాధించి వజ్రోత్సవం జరుపుకుంది.
ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన 12 చిత్రాలలో రెండు సినిమాలు (అడవిరాముడు, వేటగాడు) స్వర్ణోత్సవాలు చూశాయి. ‘వేటగాడు’ వజ్రోత్సవం కూడా జరుపుకుంది. “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి” రజతోత్సవాలు చూశాయి. వీటిలో ‘కొండవీటి సింహం’ 300 రోజులకు పైగా, ‘జస్టిస్ చౌదరి’ 250 రోజులు ప్రదర్శితమయ్యాయి. ఇక ఎన్టీఆర్ చివరి సారి నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ను కూడా బ్లాక్ బస్టర్ గా నిలిపారు రాఘవేంద్రరావు. ఇంత సక్సెస్ ఉన్న హీరో-డైరెక్టర్ కాంబినేషన్ తెలుగునాట మరోటి కానరాదు.
సూపర్ స్టార్ కృష్ణని సరికొత్త కోణంలో చూపించిన దర్శకుడు కూడా రాఘవేంద్ర రావే. వీరి కాంబినేషన్లో వచ్చిన అగ్ని పర్వతం సూపర్ స్టార్ పాపులారిటీని రెట్టింపు చేసింది.హీరో కృష్ణను వెండితెరపై ప్రజెంట్ చేయటంలో రాఘవేంద్రరావుది విలక్షణ శైలి. 'అగ్ని, జమదగ్ని.. అగ్గిపెట్టె ఉందా' అని అడిగే డైలాగ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఎన్టీఆర్ తర్వాత ఎక్కువగా కృష్ణ తోనే సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు రాఘవేంద్రరావు.
ఇక బాలయ్య- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన 'రౌడీ రాముడు-కొంటె కృష్ణుడు' సినిమాలో తండ్రి ఎన్టీఆర్తో తనయుడు బాలకృష్ణ నటించారు. బాలకృష్ణ సోలో హీరోగా చేసిన పట్టాభిషేకం, దొంగరాముడు, అపూర్వ సహోదరులు హిట్ చిత్రాలుగా నిలిచాయి. అలాగే, మెగాస్టార్ చిరంజీవి, రాఘవేంద్రరావుల కాంభినేషన్‌లో భారీ హిట్స్ వచ్చాయి..అడవిదొంగ, ఘరానమొగుడు, రౌడి అల్లుడు, ఇద్దరు మిత్రులు లాంటి హిట్ చిత్రాలతో పాటు జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి మాస్టార్ పీస్ కూడీ వీరి కాంభినేషన్‌లో రూపొందిందే..
తెలుగు తెరకి గ్లామర్‌ని తీసుకొచ్చిన దర్శకుడు కూడా ఆయనే, హీరోయిన్లను అందంగా చూపించడంలోను, స్క్రీన్‌ను అందమైన కాన్వాస్‌లా మలచడంలోనూ, కే. రాఘవేంద్రరావు ని మించిన దర్శకులు తెలుగులో లేరంటే అతిశయోక్తి కాదు. రాఘవేంద్రరావు చిత్రాలలో నటిస్తే చాలు స్టార్ డమ్ సొంతమవుతుందని నటీనటులు తపించేవారు.
ఆ రోజుల్లో ముఖ్యంగా హీరోయిన్స్ ఆయన సినిమాల్లో నటించడానికి ఉరకలు వేసేవారు. వారి అభిలాషకు తగ్గట్టే రాఘవేంద్రరావు తన చిత్రాల్లో నటించే నాయికలను తీర్చిదిద్దేవారు. నాటి మేటి తారలు జయప్రద, జయసుధ, శ్రీదేవి లాంటివారు రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే స్టార్ డమ్ సంపాదించిన సంగతి అందరికీ తెలిసిందే! వెంకటేశ్, మహేశ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోస్ రాఘవేంద్రుని చిత్రాల ద్వారానే కథానాయకులుగా పరిచయమై జనాన్ని అలరించిన తీరును మరచిపోరాదు.
కమర్షియల్ సినిమాలతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నా ఆయన ఆ సినిమాలతోనే ఆగిపోవాలనుకోలేదు.. అందుకే భక్తి రసాన్ని కూడా వెండితెర మీద పారించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి, ఓం నమో వేంకటేశాయ చిత్రాలు రాఘవేంద్రరావు, నాగార్జునల కెరీర్‌లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన అతి కొద్ది మంది సినీ దర్శకుల్లో దర్శకేంద్రుడు ఒకరు. బొబ్బిలిబ్రహ్మన్న, అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి, అన్నమయ్య చిత్రాలతో ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు. ఇప్పటి దాకా దర్శకుల్లో నాలుగు సార్లు నంది అవార్డును అందుకున్న ఘనత రాఘవేంద్రరావుదే! ‘పెళ్ళిసందడి’తో బెస్ట్ కొరియోగ్రాఫర్ గానూ నందిని అందుకోవడం విశేషం. 2009లో బి.యన్.రెడ్డి నేషనల్ అవార్డును అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను ఆయనకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డును ప్రకటించారు. ఇక ప్రేమలేఖలు, జగదేకవీరుడు - అతిలోకసుందరి, అల్లరి ప్రియుడు, అన్నమయ్య చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు.
నాలుగున్నర దశాబ్దాలుగా ఆయన 108 తెలుగు సినిమాలకు, 18 పరభాషా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదు తరాల నటులతో కలసి పనిచేశారు. ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్తో సినిమాలు తీశారు. ఎన్టీఆర్తో 12 సినిమాలు, చిరంజీవితో 10, శ్రీదేవితో 24 సినిమాలకు దర్శకత్వం వహించడం విశేషం.
వెండితెరమీదే కాక బుల్లితెర మీద కూడా రాఘవేంద్రరావు తన ముద్ర వేశారు. ప్రముఖ టీవీ ఛానెల్ లో ప్రసారమైన శాంతి నివాసం అనే సీరియల్ కి రచయిత, దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సీరియల్ ద్వారా దిగ్గజ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి పరిచయం అయ్యారు.
రొమాంటిక్ కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్ థ్రిల్లర్, జీవిత కథలు…ఇలా ఆయన వెండితెరపై టచ్ చేయని అంశం లేదేమో. సినిమా అంతా ఒకెత్తైతే… పాటలు మరో ఎత్తు అనేలా ఆయన దర్శకత్వం సాగుతుంటుంది. పండ్లు, పూల నేపథ్యంలో పాటల్ని తెరకెక్కిస్తూ వెండితెరని ఒక పెయింటింగ్‌లా మార్చేస్తుంటారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలపాటు సినీ దర్శకుడిగా కొనసాగడం అంటే సామాన్యమైన విషయం కాదు! ఈ సమయంలో ఐదు తరాల నటులతో కలిసి పనిచేశారు. తనకు తానే సాటి అని నిరూపించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!