మహానాయకుడు..!

- May 28, 2024 , by Maagulf
మహానాయకుడు..!

తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. తెలుగు వారి ఆత్మగౌరవానికి నిండైన ప్రతీకగా భారత దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కీర్తి గడించిన ఈ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి.

1923,మే 28వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నిమ్మకూరు గ్రామంలో జన్మించిన ఎన్టీఆర్ గా సూపరిచితులైన నందమూరి తారక రామారావు స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి భారత దేశ సిని, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణలను చిన్నతనంలోనే అలవర్చుకుని తన జీవితంలో పెట్టుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తూ వచ్చారు.

ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం 4 సబ్ రిజిస్టార్ ఉద్యోగాలు కోసం నిర్వహించిన పరీక్షలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉత్తీర్ణత సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచినా ఆ ఉద్యోగ ధర్మంలో ఉన్న అవినీతితో రాజీ పడలేక తాను నమ్మిన ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా ఏంతో కష్టపడి  సాధించిన సబ్ రిజిస్ట్రార్ వంటి ఉన్నత శ్రేణి ఉద్యోగానికి రాజీనామా చేసిన అరుదైన వ్యక్తి ఎన్టీఆర్.

స్వతహాగా అందగాడు, ఆజానుబాహుడైన ఎన్టీఆర్ విద్యార్థి దశలోనే నటన మీద ఆసక్తి ఏర్పడి పలు నాటకాల్లో నటించడం జరిగింది. నటన మీద మక్కువతో దర్శక దిగ్గజం ఎల్వీ ప్రసాద్ ఆశీస్సులతో 1949లో 'మనదేశం' చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనంతర కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. తన తోటి హీరోల్లా ఎన్టీఆర్ ఒకే తరహా పాత్రలకే పరిమితం కాకుండా సాంఘిక, జానపద మరియు అనేక విశిష్టతో కూడిన వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి తనలోని నట తృష్ణను తీర్చుకోవడమే కాకుండా ప్రేక్షకులను సైతం మెప్పించారు .  

సామాజిక, సాంఘిక , జానపద, పౌరాణికాలకు(  (శ్రీరాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు వంటి దైవత్వం కలిగిన పాత్రలతో పాటుగా రావణ, కీచక,దుర్యోధనుడు వంటి చారిత్రాత్మక ప్రతినాయక పాత్రలు) ) సంబంధించిన అనేక రకాల పాత్రలను పోషించి నటనలో తనకు తిరుగులేదని నిరూపించి " విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు" గా బిరుదాంకితుడైనాడు.

హీరోగా ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలోనే అధికారమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పెద్దల పాదాల చెంత తాకట్టు పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీరును నిరసిస్తూ తెలుగు వారి ఆత్మగౌరవం పేరుతో  తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల ఎంపికకు ఎన్టీఆర్ పలు రకాల పద్దతులను అనుసరించారు. యువత ముఖ్యంగా పట్టుభద్రులకు మరియు రాజకీయంగా వెనుకబడిన వర్గాలైన బీసీ, దళితులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.

దేశ రాజకీయాల్లో అప్పటి వరకు కాకలు తీరిన ఏ రాజకీయ నాయకుడికి సుసాధ్యం కానీ కనీవినీ ఎరుగని రీతిలో పార్టీ స్థాపించిన కేవలం 8 నెలల్లోనే అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో అనేక సంస్కరణలు మరియు మునుపెన్నడూ లేనటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.

పేదవాడు పట్టెడన్నం తినేందుకు ప్రవేశ పెట్టిన రెండు రూపాయలకే కిలో బియ్యం,పేదల కోసం పక్కా గృహాలు, సగం ధరకే జనతా వస్త్రాలు, ఉపాధి హామీ పథకం, నీరు పేదలకు నెలకు 30 రూపాయల పింఛన్ , ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55 వేల మంది వితంతు మహిళలకు 50 రూపాయిలు పింఛన్ , అసంఘటిత కార్మికులకు 30 రూపాయలకు పింఛన్ అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ సొంతం.  

రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, నీటి తిరువా రద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సాగు నీటి పారుదల వ్యవస్థ పూనర్నిర్మాణం, సన్న,చిన్నకారు రైతుల భూమి శిస్తూ రద్దు ,రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన వంటి పలు పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరిగింది. రైతాంగం మేలు కోసం సహకార వ్యవస్థను బలోపేతానికి కృషి చేస్తూనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి దోహదపడ్డారు.

సామాన్య ప్రజానీకానికి విద్యా, వైద్య  సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యం తో ప్రతి మండల కేంద్రం లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , జిల్లా పరిషత్ హైస్కూల్, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది.బడుగు ,బలహీన, అణగారిన గిరిజన, దళిత వర్గాలకు చెందిన వారికి ఆర్థిక , సామాజిక, రాజకీయ, విద్య , ఉపాధి రంగాల్లో అపారమైన అవకాశాలు, సామాజిక భద్రత కల్పించి వారి అభ్యున్నతికి  కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్.

విద్య యొక్క విలువ తెలిసిన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా  విద్యా రంగంలో రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు ఎన్నో చర్యలు చేపట్టారు . పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది .అలాగే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ప్రాథమిక స్కూళ్లు ఏర్పాటు చేయడం మరియు సాంకేతిక , వైద్య విద్యలకు సంబంధించిన పలు  విప్లవాత్మక సంస్కరణలు , ఎంసెట్ నిర్వహణ,క్యాపిటేషన్ ఫీజులు రద్దు మొదలైనవి ఈ రంగంలో ఎన్టీఆర్ సాధించిన విజయాలు.

ఎన్టీఆర్ ను గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి చేరువ చేసిన ముఖ్యమైన పాలనా సంస్కరణ మండల వ్యవస్థ నిర్మాణం. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా, మెరుగైన సేవలు అందించేందుకు అప్పటి వరకు పాలన వ్యవస్థలో బలంగా ఉన్న గ్రామ మునుసుబు, కరణాల వ్యవస్థను ఒక్క కలం పోటుతో రద్దు చేసి సంచలనం సృష్టించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అధికార వికేంద్రీకరణతో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు, మండల యూనిట్ గా గ్రామాల అభివృద్ధికి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది.  

ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. దేశంలో మొదటి సారిగా ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించడంతో ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ 30 శాతం మహిళలకే కేటాయించారు. జిల్లా, మండల ప్రజాపరిషత్తులలో 9శాతం చైర్మన్‌ పదవులు మహిళలకే రిజర్వు చేశారు. మహిళల సంక్షేమం కోసం 14 పథకాలు, అంశాల్లో కృషి చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాలు సత్వరంగా, సక్రమంగా అమలు జరిపేందుకు మహిళాభ్యుదయ, శిశు సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సాధారణ మధ్యతరగతి, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చెందిన యువతను, కార్మిక, కర్షక మరియు మైనారిటీలను, మహిళలను నాయకులుగా తీర్చిదిద్ది రాజకీయాల్లో తగినన్ని అవకాశాలు కల్పించారు. ఆయన కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఏంతో మంది రాజకీయాల్లో రాణించారు. ఆనాడు ఆయన ఎంపిక చేసిన యువకులే నేడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలకమైన నాయకులుగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ ను తమ రాజకీయ గురువుగా చెప్పుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు పోటీపడతారు.  

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు.1984 లోక్ సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ 8వ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంతో జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయాణం మొదలైంది. పాలనలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్న గవర్నర్ వ్యవస్థ మీద జాతీయ స్థాయిలో  తిరుగుబాటు చేసిన మొదటి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారు.  

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులతో కలిసి 1989లో నేషనల్ ఫ్రంట్ కూటమిని ఏర్పాటు చేశారు. తానే స్వయంగా ఫ్రంట్ అధ్యక్ష భాద్యతలు చేపట్టి సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమిలో మరియు ఫ్రంట్ తరుపున వి.పి.సింగ్ ప్రధానమంత్రి కావడంలో సైతం కీలకమైన పాత్ర పోషించారు. ఆయనిచ్చిన స్పూర్తితో 1996లో యునైటెడ్ ఫ్రంట్ 1998, 1999లలో ఎన్డీయే ప్రభుత్వాల ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ కీలకమైన పాత్ర పోషించింది.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రిగా  కనీవినీ ఎరుగని రీతిలో రాజకీయల్లో మరియు పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.చివరి శ్వాస వరకు తెలుగు జాతి ఉన్నతి కోసం తపించిన ఎన్టీఆర్ తెలుగు నాట ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com