రైతు నాయకుడు....మాదాల
- May 29, 2024
మాదాల జానకీరామ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉలవావారిపాలెం గ్రామంలో జన్మించారు.ఆ గ్రామంలో వీరిది పెద్ద రైతు కుటుంబం. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆనాడు నెల్లూరు జిల్లాలో ప్రముఖ విద్యార్థి నాయకుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి సమవుజ్జీ గా నిలిచారు.
నెల్లూరు మెట్టసీమ రైతు నాయకులు మాదాల తిమ్మయ్య నాయుడు, ధనేకుల నరసింహం, కొండపనాయుడు, గంగవరపు తిరుపతి నాయుడు వంటి ఉద్దండుల సహచర్యంలో రాజకీయ ఓనమాలు దిద్దారు. అనంతరం విద్యార్థి నేతగా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అనుంగు శిష్యుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
1972లో మొదలైన జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని నెల్లూరు జిల్లాలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు కూడా గట్టడంలో వీరి పాత్ర మరువలేనిది. ఈ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వెంకయ్య నాయుడు కీలకపాత్ర పోషిస్తే నెల్లూరు జిల్లాలో జానకీరామ్ కీలకంగా వ్యవహరించారు. 1978,1989,1994 లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయగిరి నుండి పోటీ 1989లో మాత్రమే గెలిచారు. 1991లో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి క్యాబినెట్ లో మైనింగ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో జానకీరామ్ ది విలక్షణమైన శైలి. ఎన్నికల్లో అనువుగాని హామీలు ఇవ్వడం ఆయనకు నచ్చని పని. ప్రచారంలో భాగంగా అన్ని గ్రామాల రైతులను కలిసి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గురించి అడిగి తెలుసుకుని వాటిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చేవారు.
1978లో మొదటి సారి ఓటమి చవిచూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యుడిగా ఎన్నికల్లో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి పనిచేశారు.1989 ఎన్నికల్లో సైతం నియోజకవర్గ ప్రజలకు కావాల్సిన పక్కా గృహాల నిర్మాణం, చెరువుల మరమ్మతులకు, సాగు,త్రాగునీటి ఎద్దడి నుండి ప్రజలకు ఉపశమనం కలిగిస్తానని హామీ ఇచ్చారు తప్పించి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు చేయలేదు.
ఉదయగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తాను ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేశారు.జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కావాల్సిన నిధుల విడుదల చేయించి పనులు ముమ్మరంగా పూర్తి చేశారు.1991లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగించారు. ఆనాడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కన్నా ఎక్కవ పక్కా ఇళ్లు నిర్మించిన ఘనత ఉదయగిరి నియోజకవర్గానికి దక్కడంతో జానకీరామ్ కీలకమైన పాత్ర పోషించారు.1989–94 వరకు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టించారు.
అధికారంలో ఉన్నా లేకున్నా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న మెట్టసీమ ప్రాంత అభివృద్ధి కోసం తన బంధువైన మాజీ కనిగిరి ఎమ్మెల్యే తిరుపతి నాయుడు గారితో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఉదయగిరి నియోజకవర్గం అంటే వల్లమాలిన అభిమానం. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో సాగు, త్రాగునీటి అవసరాల కోసం గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర కాలువ పొడిగింపు మరియు ఉదయగిరి చెరువు పూడిక తీత కార్యక్రమాలు చేపట్టారు.
జానకీరామ్ రైతు పక్షపాతి, అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల సమస్యలపై పోరాడుతూ వచ్చారు. రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు దక్కాలని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రాష్ట్రస్థాయి రైతు ఆందోళనలలో పాల్గొన్నారు.రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని పలువురు ముఖ్యమంత్రులకు వినతి పత్రాలు అందజేశారు. మెట్టసీమ అన్నదాతల సాగునీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం నూతన ప్రాజెక్టులు, కాలువలు నిర్మించాలన్నారు.
నెల్లూరులోని మెట్టసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కాసు బ్రహ్మానంద రెడ్డి హయాంలో ఆగిపోయిన నాగార్జున సాగర్ రెండో దశ కాలువల నిర్మాణం కోసం ప్రకాశం జిల్లాలోని కురిచేడు నుండి కావలి వరకు 1800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. దాన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెండో దశ జలయజ్ఞంలో దీన్ని భాగంగా చేర్చినప్పటికి ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు
జానకీరామ్ గొప్ప వక్త, వీరు చేసిన ప్రసంగాలలో నిప్పులు కురిసిన భావన కలిగేది. తాను ఆవేశంతో ఊగిపోకుండా తన ఉపన్యాసాలతో ప్రజలు ఊగిపోయేలా చేసేవారు.ప్రజా సమస్యల పరిష్కారానికి తన వాక్చాతుర్యాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్న అతి కొద్ది మంది నాయకుల్లో వీరు ఒకరు.
జానకీరామ్ రాజకీయాల్లో అజాత శత్రువు. మాట కరుకుగా ఉన్నప్పటికీ తన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరిపారు.తన రాజకీయ ప్రత్యర్థులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి దివంగత కలికి యానాదిరెడ్డి వంటి వారితో ఆత్మీయ సంబంధాలు కలిగి ఉన్నారు.
జానకీరామ్ నిబద్ధత కలిగిన రాజకీయ నాయకులు.సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటూ ఆస్తులన్నీ కరిగించుకున్నారు తప్పించి అవినీతికి పాల్పడలేదు. వారసత్వ రాజకీయాలకు బద్ద వ్యతిరేకంగా ఉండేవారు. చివరి దశలో గ్రామ స్థాయి రాజకీయాల్లో సైతం ధన ప్రభావం పెరగడం చూసి బాధ పడ్డారు. జానకీరామ్ లాంటి నాయకులు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో అడుగుపెట్టిన, పెట్టబోతున్న యువ రాజకీయ వేత్తలకు ఆదర్శంగా నిలుస్తారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!