హెల్త్ ఇన్సురెన్స్ నగదు రహిత చికిత్సలపై ఇక పై గంటలోపే నిర్ణయం..

- May 30, 2024 , by Maagulf
హెల్త్ ఇన్సురెన్స్ నగదు రహిత చికిత్సలపై ఇక పై గంటలోపే నిర్ణయం..

న్యూ ఢిల్లీ: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య బీమాపై మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. సుమారు 55కు పైగా నిబంధనలను క్రోడీకరించింది. దీని ప్రకారం ఆరోగ్య బీమాపాలసీ ఉన్నవారు రిక్వెస్ట్ చేసిన గంటలోపు నగదు రహిత చికిత్సపై ఆయా ఇన్సురెన్స్ సంస్థలు నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది.

ఆసుపత్రి నుంచి చివరి బిల్లు వచ్చాక మూడు గంటల్లోగా దానికి తుది అనుమతి ఇవ్వాలి. అలాగే, క్లెయిమ్స్ పరిష్కారాల కోసం పాలసీదారులు ఇకపై ఎటువంటి పత్రాలూ ఇవ్వాల్సిన అవసరం లేదు. బీమా సంస్థలతో పాటు టీపీఏలు వాటికి అవసరమైన పత్రాలు ఆసుపత్రుల నుంచే తీసుకోవాలని ఐఆర్డీఏఐ తెలిపింది.

ఆరోగ్య బీమా ఉన్నవారి వయసుతో పాటు ప్రాంతం, ఆరోగ్య పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఇన్సురెన్స్ కంపెనీలు ప్రయోజనాలు అందించాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి వివిధ రకాల పాలసీలను ప్రవేశపెట్టే అవకాశం ఇన్సురెన్స్ కంపెనీలకు ఉంటుంది. పాలసీ పత్రంతో ఇన్సురెన్స్ కంపెనీలు సీఐఎస్ (వినియోగదారుడి షీట్)ను అందించాలి.

ఇన్సురెన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను సరళమైన భాషలో అందులో పొందుపర్చాలి. ఒకవేళ బీమా ఉన్నవారి పాలసీ కాలంలో క్లెయిమ్స్ ఏవీ లేకపోయినట్లయితే ఇన్సురెన్స్ మొత్తాన్ని పెంచడం/ప్రీమియం తగ్గించడం/నో క్లెయిమ్ బోనస్ ఎంచుకునే సౌకర్యాన్ని వారికి కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు పలు నిబంధనలను ఐఆర్డీఏఐ క్రోడీకరించింది. 100 శాతం నగదు రహిత చికిత్సను బీమా ఉన్నవారికి అందించేలా ఇన్సురెన్స్ సంస్థలు చర్యలను నిర్ణీత వ్యవధిలోనే తీసుకోవాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com