ప్రముఖ ఫిట్నెస్ గురు అనుప్రసాద్ తో ముఖాముఖి...

- June 02, 2024 , by Maagulf
ప్రముఖ ఫిట్నెస్ గురు అనుప్రసాద్ తో ముఖాముఖి...

ప్ర): మారుతున్న జీవన శైలిలో ఫిట్‌నెస్‌కి వున్న ప్రాధాన్యత ఎంత?

జ): ఫిట్‌నెస్‌ వలన మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, బిపి, డయాబెటిస్ సమస్యలను దూరం  చేసుకోవచ్చు.బ్లడ్ సర్కులేషన్ జరగడంతో పాటు ఇమ్యూనిటీని బూస్ట్ చేసి త్వరగా జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.నిత్యం చైతన్యవంతంగా రోజంతా ఉండేలా చేస్తుంది.

రోజు కనీసం ఒక గంట పాటు నడక, ఆటలు, వ్యాయామం,స్విమ్మింగ్, యోగా, కార్డియో వ్యాయామం వంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనం ఫిట్‌నెస్‌ పొందవచ్చు. మన శరీరాన్ని ఒక దేవాలయంగా భావించాలి. శరీరం ఫిట్ గా ఉండటం వల్లే మనకు మానసిక ఆహ్లాదం కలుగుతుంది. మనం వ్యాయామం ప్రారంభించే ముందు నిపుణుల సూచనలు,సలహాలు తీసుకోని ప్రారంభించాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. చెడు కొలెస్ట్రాల్ ను పెంచే జంక్ ఫుడ్స్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. పైవన్ని మన ఫిట్‌నెస్‌ పెంచేందుకు దోహదపడతాయి.

ప్ర): బిజీ బిజీ జీవితంలో ఫిట్‌నెస్ కోసం సమయం కేటాయించలేకపోతున్నవారికి మీరిచ్చే సూచన ఏంటి?

జ): ఫిట్‌నెస్ లక్ష్యాలను సాధించడానికి సరైన పోషకాహారం అవసరం. సరైన ఇంధనం లేకుండా, మీ వాహన ఎలా అయితే ముందుకు సాగదో.. అలాగే సరైన పోషకాలు శరీరానికి అందకపోతే, వ్యాయామాలు అంత ప్రభావవంతంగా ఉండవు. అందువల్ల  ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.

ప్రణాళిక లేకుండా జిమ్‌లో వర్కౌట్లు చేయడం వలన ఫలితాలు రావు. నిర్మాణాత్మక వ్యాయామ ప్రణాళికను కలిగి ఉండటం వలన మీరు మీ ఫిట్‌నెస్‌ లక్ష్యాల వైపు పురోగతి సాధించవచ్చు. అంటే మీరు ఏ లక్ష్యంతో వర్కౌట్ చేస్తున్నారు..? అందుకోసం ఏయే వర్కౌట్లు ఉపయోగపడతాయి అనే వివరాల ప్రణాలిక ఉండడం అవసరం.

ప్ర): ఫిట్‌గా వుంటే, అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా వుండొచ్చని తెలిసీ, ఎందుకు ఫిట్‌నెస్ పట్ల ఆసక్తి చూపించలేకపోతున్నారు?

జ): ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి మన పూర్వీకుల నుండి వింటూనే ఉన్నాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు కావాల్సిన భౌతిక అవసరాలను తీర్చుకోగలం లేదా సంపాదించుకోగలం. ఈనాటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి మనిషికి సమయం ఉండటంలేదు, కానీ మనం లేచిన దగ్గర నుండి ఏ సమయానికి ఏమి చేస్తున్నాం, ఏం తింటున్నాం ఇవన్ని ప్రణళికగా రాసుకొని ఉదయం లేదా సాయంతం ఒక గంట మీకోసం మీరు కేటాయించుకోవాలి. ఇష్టంతో చేసే ఏ పని కష్టం కాదు. ఏ పనైనా మనం ఇష్టంతో చేస్తూ పోతుంటే  సంతోషాన్ని పొందుతాం. వ్యాయామం మన శరీరానికి అలవాటైతే మన జీవితంలో అది ఒక భాగమైపోతుంది.

ప్ర): ఫిట్‌నెస్ పేరుతో అతిగా వ్యాయామం చేసేవారికి మీరిచ్చే వార్నింగ్ లాంటి సూచన ఏంటి?

జ): అతిగా చేస్తే ఏదైన వికటిస్తుంది. కాబట్టి మనం వ్యాయామం మొదలు పెట్టేటప్పుడు మనకున్న ఆరోగ్య సమస్యలను, శారీరిక బలహీనతలను వ్యాయామ నిపుణలతో పంచుకోవాలి. మన అలవాట్లు, మనం ఏ సమయానికి పడుకుంటున్నాము, లేస్తున్నాం. 8 గంటలు విశ్రాంతి తీసుకుంటున్నామా లేదా కార్డియో వ్యాయామాలు లంగ్స్ సామర్థ్యాన్ని పెంచడానికి, కొవ్వును కరిగించడానికి, శరీర బరువు తగ్గడానికి వ్యాయామాలు ఉపయోగపడతాయి. వ్యాయామం వల్ల అనారోగ్యాల ముప్పు తప్పుతుంది. అలాగే శరీర నిర్మాణంలో వ్యాయాయం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారంగా చేయాలి.వ్యాయామం రోజూ చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం ఫిట్‌గా కూడా మారుతుంది.  

ప్ర): ఏ వయసు వారికి ఎలాంటి ఫిట్‌నెస్ అవసరం ?

జ): ఏ వయసు వారైనా ఫిట్‌గా ఉండటానికి తీసుకునే ఆహారం కూడా అంతే శక్తిని ఇచ్చేది, ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో ఫ్రోటీన్లు, విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఆహారంలో తీసుకోవాలి. చక్కెరలు, అధిక ఉప్పుకు దూరంగా ఉండి పరిమితంగా తీసుకోవాలి, ఇది ధీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఏ విధమైన ఒత్తిడి లేని మంచి నిద్ర కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖాన్ని కాంతి వంతంగా, నల్ల మచ్చలు లేకుండా చేస్తుంది. రాత్రి 7 నుంచి 9 గంటల లోపు నిద్రపోయేలా ఫ్లాన్ చేసుకోవడం మంచిది.ధ్యానం, లోతైన శ్వాస ప్రక్రియలు, యోగా వంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి.

ప్ర): చిన్న పిల్లలకు ఎలాంటి ఫిట్‌నెస్ టిప్స్ మీరు సూచిస్తారు?

జ): పిల్లల ఎదుగుదలకు, వారు ఆరోగ్యంగా ఉండేందుకు పోషకాలతో కూడిన సమతుల్యత ఆహారం చాలా అవసరం. అయితే ఇటీవల మారుతున్న జీవనశైలి నేపథ్యంలో కొందరు వీటిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. జంక్ ఫుడ్స్, వివిధ రకాల తినుబండరాలు, ఫిజికల్ యాక్టివ్నెస్ తగ్గడం వల్ల ఎదుగుదలపై ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే వీటిని నివారించడానికి పేరెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల ఎదుగుదల కోసం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఐరన్ క్యాల్షియం, హెల్తీ ఫ్యాట్స్ కలిగిన ధాన్యాలు చిక్కుల్లో కూరగాయలు పండ్ల మిశ్రమం వంటి సమతుల్యత ఆహారం ఇవ్వాలని న్యూట్రిషన్లు చెబుతున్నారు. రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు ఇటువంటి సమతుల్యత భోజనం ఇవ్వడం వల్ల చిన్నారులు మెంటల్గా ఫిజికల్ గా డెవలప్ అవ్వడానికి దోహదం చేస్తుందని హైడ్రేటుగా ఉండేందుకు తగినంత నీరు తాగడానికి ప్రోత్సహించాలని చక్కెర పానీయాలు పరిమితం చేయాలి.

పిల్లలు ఔట్ డోర్ గేమ్స్లో పాల్గొనేలా చూడడం చాలా అవసరం. సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ వంటి వాటిలో ఉత్సాహంగా పాల్గొనేలా వారిని ప్రోత్సహించాలి. వీటిలో పాల్గొనడం వల్ల పిల్లల కండరాలు దృఢంగా మారడమే కాకుండా వారి స్టామినా కూడా పెరుగుతుంది.

ప్ర): వృద్ధులకు కూడా ఫిట్‌నెస్ అవసరమే కదా ?

జ): వృద్దలకు ఫిట్‌నెస్ చాలా అవసరం. ఎందుకంటే వయస్సు పెరుగుతున్న వారిలో బలం తగ్గుతూ వస్తుంది,  ఫిట్‌నెస్ పరంగా చూస్తే వారు చాలా వీక్ అయిపోతారు. శరీరం వీక్ అవ్వడం వల్ల మానసికంగా కూడా వారు కృంగిపోతారు. ఇలా జరగకుండా ఉండాలంటే వారు కచ్చితంగా ఫిట్‌నెస్ పెంచుకోవడానికి గంట పాటు వ్యాయాయం చేయాలి లేదా నడవాలి.  

ప్రతిరోజూ వ్యాయామం చేసే అలవాటు కూడా అనేక వ్యాధులను నివారిస్తుంది, కాని వృద్ధులకు వ్యాయామం కంటే నడక చాలా ముఖ్యం. వాకింగ్, డ్యాన్స్,  బ్రెయిన్ హెల్త్ పై కొత్త అధ్యయనం ప్రకారం, రోజూ నడిచేవారికి మంచి మానసిక ఆరోగ్యం ఉంటుంది. నడిచే వ్యక్తుల జ్ఞాపకం వేగంగా ఉంటుంది. నడక మెదడులో రక్త ప్రసరణను పెంచుతుంది. ఈ కారణంగా ఆక్సిజన్, పోషకాలు మెదడు కణాలకు చేరుతాయి. ఫలితంగా, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది.

ప్ర): ఫిట్‌నెస్ విషయంలో ఆహార నియమాల పాత్ర ఎంత ?

జ): కాలంతోపాటు వాతావరణం మారుతోంది. కాలుష్య కారకాలు మారుతున్నాయి. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు. బిజీ లైఫ్‌లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవి ప్రభావం చూపే మనిషి పరిస్థితి కూడా దారుణం చేస్తున్నాయి. ఉబకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.వైరల్‌ ఫీవర్‌, మలేరియా, డెంగీ, ప్లేట్‌లెట్స్‌ పడిపోవడం వంటి జబ్బులతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

వీటన్నింటికీ కారణం ఆహార నియమావళి అదుపు తప్పడం, శరీరానికి సరైన వ్యాయామం లేక పోవడమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే భేదాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.

ఫిట్‌నెస్ పరిరక్షణకు చికిత్స, మందుల వాడకానికే పరిమితం కాకుండా వాకింగ్‌, జాగింగ్‌తో పాటు జిమ్‌, యోగా ఇతర మానసిక, శారీరక అలసటకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ పుష్టికరమైన సంతులిత ఆహారం, పండ్లు, పండ్ల రసాలు తదితర పదార్థాలు సమపాళ్లలో తీసుకుంటే ఎటువంటి ప్రాణాంతక వ్యాధులు, జబ్బులకైనా చెక్‌ పెట్టవచ్చు. ముఖ్యంగా నూనె పదార్థాలు పరిమితంగా వాడటం, మాంసకృత్తులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రెడ్‌ సమపాళ్లలో లభించేలా పప్పు దినుసులు, కూరగాయాలు, పండ్లు తదితర పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారులు పప్పుదినుసుల స్థానంలో అప్పుడప్పుడు గుడ్డు, చేప, మాంసం తీసుకుంటే మంచిది.

ప్ర): ఫిట్‌నెస్ కోసం రోజులో ఎంత సమయం కేటాయించాలి ?

జ): మీ ఫిట్‌నెస్ కోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వారంలో అన్ని రోజులు కుదరకపోతే కనీసం వీకెండ్‌లో అయినా ఒకటి రెండు రోజులు మీ ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం సమయం కేటాయించాలి. ప్రతి వారం ఒకటి లేదా రెండు రోజులలో కనీసం 75 నిమిషాల తీవ్రమైన ఫిజికల్ యాక్టివిటీ లేదా 150 నిమిషాల మితమైన వ్యాయామం చేసే వారి ఆయుర్దాయం పెరుగుతుందని వివిధ అధ్యయనాలు కూడా తెలియచేశాయి.

ప్ర): ఉదయం వేళ ఫిట్‌నెస్ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం మంచిదా? సాయంత్రానికి వాయిదా వేయొచ్చా?

జ): శరీర ఫిట్‌నెస్ ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. కానీ చాలా మంది రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయలేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో లేదా వ్యాయామం చేయడానికి ప్లాన్ చేస్తున్న వారిలో సాధారణంగా ఓ అనుమానం తలెత్తుతుంది. అదేంటంటే.. ఉదయం లేదా సాయంత్రం ఏ వేళలో వ్యాయామం చేస్తే మంచిది?

ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. అందువల్ల ఏ సమయంలో వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనే విషయం చెప్పడం కష్ట తరం.బదులుగా, రోజువారీ జీవితాన్ని, పనిలో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామం కోసం మీరే మంచి సమయాన్ని నిర్ణయించుకోండి. అది ఉదయం లేదా సాయంత్రం కావచ్చు.ఏది మీకు అనుకూలమైనదిగా భావిస్తే దానిని కొనసాగించండి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే.. మీరు వ్యాయామం చేసినప్పుడు స్థిరంగా, ధైర్యంగా చేయండి. దీంతో శరీరం దృఢంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.

ప్ర): ఫిట్‌నెస్ పేరుతో ఆహారం మానేసేవారికి మీరిచ్చే సలహా ఏంటి?

జ): వ్యాయామం చేసే సమయంలో షుగర్ డౌన్ అవుతుంది అనిపిస్తే రెండు ఖర్జురాలు, చాక్లెట్ తీసుకోవాలి.అలాగే మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు తాగాలి.

ఒక వేళ మీ వ్యాయామ సమయం గంటన్నర కంటే ఎక్కువగా ఉంటే మధ్యలో ఆహారాన్ని తీసుకోకండి.వ్యాయామం ముగిసిన తరువాత ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు మిల్క్‌షేక్‌ కానీ, బాదం, ఆక్రోట్‌ గింజలు లేదా తాజా పళ్ళు,పెరుగు లాంటివి తీసుకుంటే మంచిది.శరీరం యొక్క బరువు బట్టి 02-2.5ml నీళ్లు తాగితే చెమట ద్వారా పోయిన నీటిని భర్తీ చేసుకోవచ్చు.ప్రోటీన్‌ కోసం గుడ్లు, చికెన్‌, చేప; శాకాహారులైతే పప్పు ధాన్యాలు,సెనగలు, రాజ్మా, అల సందలు తీసుకోవచ్చు.శరీరాన్ని బట్టి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవచ్చు కానీ అవి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినవి మాత్రమే, దీని వల్ల అలసట తగ్గి, శరీరం త్వరగా కోలుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com