ప్రవాసీ భారతీయుల ఉచ్చులో విదేశీ బ్యాంకులు..

- June 11, 2016 , by Maagulf
ప్రవాసీ భారతీయుల ఉచ్చులో విదేశీ బ్యాంకులు..

గల్ఫ్‌లోని దుబాయి, షార్జా, ఇతర ఎమిరేట్స్‌ల్లో తెలుగువారి మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు నిర్వహించే, పరిశ్రమలు నడిపే కొందరు తెలుగు ప్రవాసులు స్థానిక బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకొని, వాటిని తీర్చలేక పారిపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. దీంతో గల్ఫ్‌లో భారతీయుల ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోంది. దక్షిణాదిలో ఇటీవల ఎన్నికలు జరిగిన ఒక కీలక రాష్ట్ర ముఖ్యమంత్రికి బినామీగా భావిస్తున్న బంగారం ఆభరణాల వ్యాపారి ఎం.ఎం.
రామచంద్రన్‌ వెయ్యి కోట్ల రూపాయల బ్యాంకు లోన్‌ కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యాపారి రూ.325.52 కోట్లు ఎగ్గొట్టి స్వదేశానికి పారిపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతని సంస్థలో పని చేసే ఉద్యోగులకు రెండు నెలల వేతనాన్ని కూడా వీపీఎస్‌ ద్వారా బ్యాంకుల్లో ముందుగానే చెల్లించి, వ్యూహాత్మకంగా పారిపోయినట్లు తెలిసింది. ఆఫ్రికా దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో నష్టాలు రావడంతో పారిపోయినట్లు కొందరు అంటున్నారు. అతడు తన భార్య పేర కూడా అప్పులు తీసుకున్నాడు. ఆమె కూడా భర్తతో పాటు జాడ లేకుండా పోయినట్లు తెలిసింది. మరో కీలక కేసులో తెలుగు రాష్ర్టాలకు చెందిన కొందరు ప్రవాసులు కలిసి దుబాయిలో ఓ సంస్థను నెలకొల్పారు. అందులో అనంతపురం జిల్లాకు చెందిన ఒక ప్రవాసి ఎగ్జిక్యూటివ్‌ భారీ రుణ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఇతరుల ష్యూరిటీతో బ్యాంకు నుంచి భారీ రుణాలు పొంది అందర్నీ మోసం చేయడంతో పాటు సంస్థను దివాళా తీయించినట్లు చెబుతున్నారు. తాను మాత్రం మరోచోట ఉద్యోగం చేస్తున్నాడు. బ్యాంకుల్లో అప్పులు చేసిన తెలుగు రాష్ర్టాలకు చెందిన అనేక మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు స్వదేశానికి పారిపోయి మళ్లీ రావడం లేదు. కొన్ని కేసుల్లో పాస్‌ పోర్టుల్లోనూ తప్పుడు చిరునామాలు ఇచ్చారు. ఇలా ప్రవాస భారతీయుల ఉచ్చులో దుబాయిలోని ప్రధాన బ్యాంకులు, ఒక భారత జాతీయ బ్యాంకు పడ్డాయి. రుణాలు ఎగ్గొట్టి స్వదేశానికి పారిపోయిన ప్రవాసుల వివరాలు తెలుసుకునేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయి బ్యాంకుల్లోని లోప భూయిష్టమైన రుణ మంజూరీ విధానాన్ని ఆసరా చేసుకొని అప్పులు పొంది వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంతో కొందరు, డబ్బు తీసుకొని స్వదేశానికి పారిపోయే ఉద్దేశంతో మరికొందరు బ్యాంకు రుణాలు పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com