డ్రగ్స్‌ వినియోగం విష ప్రయోగం లాంటిది: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి పిలుపు

- June 25, 2024 , by Maagulf
డ్రగ్స్‌ వినియోగం విష ప్రయోగం లాంటిది: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో జలవిహార్‌ వద్ద డ్రగ్స్‌ నిర్మూలన ర్యాలీని ఆయన ప్రారంభించారు.అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మారకద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించమని, ఉక్కు పాదంతో అణచివేస్తామన్నారు.

“తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా కనబడడానికి వీలులేదని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కఠిన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం.రాష్ట్రంలో అక్రమ రవాణా, డ్రగ్స్ నివారణకు ఎన్ని నిధులైన కేటాయిస్తాం బడ్జెట్ సమస్యనే కాదు.దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్సును సమూలంగా నివారించడం మనందరి బాధ్యత. తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా బలమైనది తెలివైనది ఎంత దూరం వెళ్లి నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు కలది.పోలీసులు వేసే ప్రతి అడుగు మనకోసమే అన్న భావనను పెంపొందించుకొని పోలీసు వారికి సహకరించాలి.” అని పేర్కొన్నారు.

సంఘవిద్రోహ శక్తులు, అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడానికి కొందరు దుర్మార్గులు అలవాటు చేసే డ్రగ్స్ ఉచ్చులో పడి యువత బంగారు భవిష్యత్తును కోల్పోవద్ద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యార్థులు ఎదగాలి. ఈ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నదన్నారు.

”డ్రగ్స్‌ వినియోగం విష ప్రయోగం లాంటిది.. ఇది అత్యంత ప్రమాదకరం. కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుంది.డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న సంఘ విద్రోహశక్తుల చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయి.పన్నుల నుంచి వస్తున్న ప్రతి పైసను సద్వినియోగం చేస్తూ ఈ ప్రభుత్వం విద్యకు ఎక్కువ మొత్తంలో వెచ్చించి మీ బంగారు భవిష్యత్తుకు తోడ్పడుతున్నది. తాత్కాలిక వ్యసనాలకు మీరు నష్టపోతే మీ తల్లిదండ్రులతో పాటు ఈ సమాజం బాధపడుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.విద్యార్థులు యువత మంచి సహవాసంతో నడిచి భవిష్యత్తును మార్గదర్శనం చేసుకోవాలి.ప్రశాంతంగా ఆప్యాయంగా ప్రేమగా ఉన్న కుటుంబ వ్యవస్థలో డ్రగ్స్ విష ప్రయోగం లాంటిది. భారతదేశ సమాజబలమే కుటుంబ వ్యవస్థ అలాంటి కుటుంబ వ్యవస్థకే ఇది చాలా ప్రమాదకరంగా మారింది. దేశానికి బలీయమైన మానవ వనరులను నిర్వీర్యం చేయాలని దేశ ద్రోహులు చేసే కుట్రలో అంతర్భాగమే మాదక ద్రవ్యాల రవాణా..అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు వేసి పోలీసులు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుంటే కట్టడి చేయడం పెద్ద సమస్య ఏమి కాదు.” అని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com