స్వాతంత్ర సమరయోధుడు-బంకిం చంద్ర ఛటర్జీ

- June 26, 2024 , by Maagulf
స్వాతంత్ర సమరయోధుడు-బంకిం చంద్ర ఛటర్జీ

ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకిం చంద్ర ఛటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాకుండా.. భారతీయ సాహిత్యాలను ఆయన ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేశారు. ఒక కవి రచించిన దేశభక్తి గీతం ప్రజలను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో తప్ప మరో చోట ఎక్కడా సంభవించలేదు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం వేగాన్ని మరింత పెంచింది. ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యానికి చెందినవే అయినా..సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం. నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యానరచనలో బంకిం చంద్ర ఛటర్జీ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు. నేడు  బంకిం చంద్ర ఛటర్జీ జయంతి.

బంకిం చంద్ర ఛటర్జీ 1838 జూ 27న సంప్రదాయ, సంపన్న బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు బంకిం చంద్ర చటోపాధ్యాయ. కానీ బ్రిటిష్ వారు పలకలేక ఛటర్జీ అని పిలిచారు. ఆ తర్వాత అదే అలవాటుగా మారింది. ఆయన మొదటి బంగాలీ రచన 'దుర్గేష్‌నందిని' ఒక నవల. కానీ తర్వాత మెల్లగా తన అసలు ప్రతిభ కవిత్వంలోనే ఉందనే విషయం ఆయనకు అర్థమైంది. దాంతో ఆయన కవితలు రాయడం ప్రారంభించారు. ఎన్నో ప్రముఖ సాహిత్య రచనలు అందించిన బంకిం విద్యాభ్యాసం హుగ్లీ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్‌లో సాగింది.

చటోపాధ్యాయ ఆనంద్‌మఠ్ రచించారు. తర్వాత దానికి వందేమాతరం గీతాన్ని కలిపారు. అది అలా చూస్తూ చూస్తూనే దేశవ్యాప్తంగా జాతీయవాదానికి ప్రతీకగా మారిపోయింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ దీనికి బాణీని సిద్ధం చేశారు. వందేమాతరంకు జనాదరణ ఎంతో వేగంగా పెరుగుతూ వచ్చింది. 1894 ఏప్రిల్లో బంకిం చంద్ర మరణించారు. తర్వాత 12 ఏళ్లకు విప్లవకారుడు బిపిన్ చంద్రపాల్ ఒక రాజకీయ పత్రిక ప్రచురించడం ప్రారంభించారు. దానికి ఆయన వందేమాతరం అనే పేరు పెట్టారు. లాలా లాజ్‌పత్ రాయ్ కూడా అదే పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు. దేశ ప్రజలందరు వందేమాతరంలో స్వాతంత్ర కాంక్షను చూశారు కానీ.. మతం కోణం చూడలేదు. దీంతో వందేమాతరం దేశం మొత్తం వ్యాపించింది. భారతీయులలో స్వాతంత్ర కాంక్ష రగిల్చింది.

ఇక స్వతంత్ర భారతదేశం కోసం కొత్త రాజ్యాంగం రాస్తున్నప్పుడు వందేమాతరంను జాతీయగేయంగా స్వీకరించలేదు, దానికి జాతీయగీతం హోదా కూడా దక్కలేదు. కానీ రాజ్యాంగబద్ధంగా సభ అధ్యక్షుడు, భారత తొలి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ 1950, జనవరి 24న వందేమాతరం గీతానికి జాతీయ గేయం హోదా ఇస్తున్నట్టు ప్రకటించారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com