అధ్యయనం, తద్వారా పొందిన వివేకమే నా విజయరహస్యం: వెంకయ్యనాయుడు

- July 13, 2024 , by Maagulf
అధ్యయనం, తద్వారా పొందిన వివేకమే నా విజయరహస్యం: వెంకయ్యనాయుడు

విశాఖపట్నం: సాహిత్య అధ్యయనం, తద్వారా పొందిన వివేకమే తన విజయ రహస్యమని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ స్ఫూర్తిని యువతలో చూడాలని ఆకాంక్షించిన ఆయన,పెద్దవారు సైతం పిల్లలకు బహుమతులుగా పుస్తకాలను అందించాలని పిలుపునిచ్చారు. తద్వారా సాహిత్య అధ్యయనం పెరిగి, వివేకవంతులతో నవభారత నిర్మాణం వేగవంతమౌతుందని ఆకాంక్షించారు.ముప్పవరపు వెంకయ్యనాయుడు 50 సంవత్సరాల ప్రజా జీవన విజయ ప్రస్థానంలో అలుపెరుగని పయనం సాగించి, భారతదేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకుని, ఇటీవల 75 వసంతాలను పూర్తి చేసుకుని తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన నేపథ్యంలో వారి మిత్రులంతా కలిసి ఆత్మీయ సంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నంలో ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది.

తన జీవితంలో అనేక కీలక ఘట్టాలకు విశాఖపట్నం సాక్ష్యంగా నిలిచిందన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, విశాఖపట్నం నేల... ఇక్కడి మిత్రులు తనకెంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. విశాఖలో సాగర తీరాన్ని చూస్తుంటే కలిగే ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ మన హితాన్ని కాంక్షించే వారు, సహాయసహకారాలు అందించేవారు మన బంధువులు కాకపోయినా, వారే నిజమైన హితులన్న హితోపదేశంలోని వాక్యాలను గుర్తు చేసిన ఆయన, ఆత్మీయుల విషయంలో తనకంటే అదృష్టవంతులు లేరని పేర్కొన్నారు. రుచికరమైన ఆహారాన్ని ఒక్కరే కూర్చుని తినకూడదన్న వేద వాక్యాన్ని గుర్తు చేసిన శ్రీ వెంకయ్యనాయుడు, ఇది ఆహారానికే కాక, ఆనందానికి కూడా వర్తిస్తుందని, ఆనందాన్ని నలుగురితో పంచుకోవటం, తద్వారా పెంచుకోవటం సజ్జనుల వైఖరి అని, అలాంటి మిత్రులతో గడిపిన క్షణాలు మరువలేనివని తెలిపారు.

సమాజానికి హితకరమైన ఆలోచనలు, ఆచరణ కారణంగా యశస్సు లభిస్తుందని... అదే సమయంలో అనునిత్యం విద్యార్థిగా ఉంటూ కొత్తదనాన్ని కోరుకుంటే వివేకం పెరుగుతుందన్న శ్రీ వెంకయ్య నాయుడు, యశస్సు, వివేకం పెంచుకుంటూ ఉంటే జీవితం ధన్యం అవుతుందని, అలాంటి వారినే సజీవులుగా పరిగణించాలన్న యోగవాశిష్ఠ సందేశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన జీవితమంతా అదే మార్గంలో ముందుకు సాగిందన్న ఆయన, ఆత్మీయులతో సాగిన నిరంతర సాంగత్యం, సమాజానికి ఉపయోగపడే ఆలోచనల దిశగా తనను ముందుకు నడిపిందని పేర్కొన్నారు. వీటితో పాటు నిరంతర సాహిత్య అధ్యయనం తన నిజమైన విజయరహస్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు మిత్రులతో పాటు, విశాఖపట్నంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టి.ఎస్.ఆర్. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com