ఉక్కు మహిళ...!
- July 15, 2024
మహిళలు తలుచుకుంటే కుటుంబాన్నే కాదు, సమాజాన్ని కూడా చక్కదిద్దగలరని.. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని.. సహనంలోనైనా, సాహసించి పోరాడటంలోనైనా వారి తరువాతే ఎవరైనా అని ఎందరో మహిళలు రుజువు చేసారు. అలాంటి వారిలో ఉక్కు మహిళగా ప్రసిద్ధి గాంచిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ ముందు వరుసలో ఉంటారు. ఈరోజు స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ జయంతి సందర్భంగా.. ఆమె సాహసాలను, ఆమె సేవలను గుర్తు చేసుకొని స్ఫూర్తి పొందుదాం.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో1909, జూలై 15 న రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. 8 ఏళ్ళ వయసులోనే ఆమెకు మేనమామ సుబ్బారావుతో వివాహమయింది. అయితే తరువాత ఆమె ఆ వివాహాన్ని వ్యతిరేకించారు. ఆమె నిర్ణయాన్ని తండ్రి, సోదరుడు కూడా అంగీకరించారు. ఈమె బాల్యం నుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసుల వారికి విద్యాబోధన కావించేవారు.
1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు11 సంవత్సరాల ప్రాయంలో సభలో జరిగిన ఖాదీ ప్రదర్శన జరుగుతున్న సమయంలో ఆమెను వాలంటీర్‌గా నియమించినపుడు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన పండిట్ నెహ్రూని టికెట్ లేని కారణంగా అనుమతించలేదు. తదనంతరం టికెట్ కొన్నాకనే లోనికి పంపించారు. తన కర్తవ్య నిర్వహణకు గాను నెహ్రూ నుండి ఆమె ప్రశంసలు పొందారు. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కూడా అయ్యారు.
గాంధీజీగారి పిలుపుమేరకు పెద్దసంఖ్యలో నగదు మొత్తాన్ని, నగలను సేకరించిన దుర్గాబాయి... ఓ బహిరంగసభలో గాంధీగారికి విరాళంగా అందజేశారు. ఆమెలోని ధైర్యసాహసాలకు, దక్షతకు, కృషి, పట్టుదలకు ఇవే నిదర్శనాలు. స్వాతంత్య్ర సమరంలో, ఉప్పు సత్యాగ్రహంలో టంగుటూరి ప్రకాశంపంతులు, దేశోద్ధారకుని కాశీనాధ నాగేశ్వరరావు వంటి దిగ్గజాలతో కలసి ఈమె పనిచేశారు.
స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి.. బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రి క్యులేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించారు. తరువాత ప్రఖ్యాత క్రిమినల్ లాయర్‌గా పేరు సంపాదించారు.
స్వాతంత్య్రోద్యమంలోనే కాదు సేవా కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండేవారు. దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘిక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఆమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. 1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించారు.
దుర్గాబాయి 1941లో ఆంధ్రమహిళ అనే పేరుతో ఒక మాస పత్రికను కూడా నడిపారు. తద్వారా సరళమైన భాషలో ఆలోచనాత్మకమైన అంశాల్ని ముందుపెట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయగలిగారు. తదనంతర కాలంలో దానిపేరు ‘విజయదుర్గ’గా మార్చారు. ఆ పత్రికను ఇంగ్లీషు, తెలుగు రెండు భాషల్లో ప్రచురించారు. ‘లక్ష్మి’ అనే నవల సీరియల్‌గా ప్రచురించారు. చిన్నతనం నుంచీ శారద, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రమహిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ప్రేమ్‌చంద్ కథలను తెలుగులోకి అనువదించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పనిచేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పనిచేసారు. ఆ సందర్భంలో అప్పటి ఆర్థిక మంత్రి సి.డి.దేశ్‌ముఖ్ తో ఏర్పడ్డ పరిచయం వారి వివాహానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న జరిగింది. ఈవిడ 1953 ఆగస్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసారు.
దుర్గాబాయి 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్‌లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు. స్త్రీలకు దక్కాల్సిన న్యాయపరమైన హక్కుల సాధన కొరకు తీవ్రంగా కృషి చేశారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 1971లోనే ఆమె వయోజన విద్యావ్యాప్తికి చేసిన ఎనలేని కృషికిగాను "నెహ్రూ లిటరరీ అవార్డు"ను అందుకున్నారు. అవే గాకుండా.. ప్రపంచశాంతి బహుమతినీ, పాల్.జి. హోస్‌మ్యాన్ బహుమతులను కూడా ఆమె అందుకున్నారు 1975 లో భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ అందుకున్నారు. పద్మవిభూషణ్ అందుకున్న తొలి తెలుగు మహిళగా కూడా దుర్గాబాయి రికార్డులకెక్కారు.
దేశానికి ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ 1998లో కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు పేరున డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్ఛంద సంస్థకై ఉద్దేశించబడింది. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను నెలకొల్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్‌ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్‌గా నామాంతరం చెందింది.
భారతదేశం గర్వించదగ్గ మహిళామూర్తులో దుర్గాబాయిని ఆగ్రగణ్యులుగా చెప్పుకోవచ్చు. ఆమె వ్యక్తి మాత్రమే కాదు, ఒక వ్యవస్థ, ఓ గొప్ప మహోన్నత శక్తి. మేధావిగా, న్యాయకోవిదురాలుగా, మానవతావాదిగా, ఆంధ్రమహిళాసభ వ్యవస్థాపకురాలిగా.. బహుముఖ ప్రజ్ఞను కనబరిచి చరిత్రపుటల్లో మహామనిషిగా నిలిచిపోయారు.తన జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ 1981 మే 9వ తేదీన హైదరాబాదులో పరమపదించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్‌లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







