కేదార్‌నాథ్‌ ఆలయంలో 228 కిలోల బంగారం అదృశ్యం వివాదం: స్పందించిన ట్రస్ట్‌

- July 17, 2024 , by Maagulf
కేదార్‌నాథ్‌ ఆలయంలో 228 కిలోల బంగారం అదృశ్యం వివాదం: స్పందించిన ట్రస్ట్‌

కేదార్‌నాథ్‌: కేదార్‌నాథ్‌ దేవాలయంలో వందల కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలపై ఆలయ కమిటీ బుధవారం స్పందించింది. బద్రీనాథ్‌ - కేదార్‌నాథ్‌ ఆలయ కమిటీ ఛైర్మన్‌ అజేంద్ర అజయ్‌ మాట్లాడుతూ..

స్వామీ అవిముక్తేశ్వరానంద ప్రకటన దురదృష్టకరమన్నారు. వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన స్వామీజీని కోరారు.

''కేదార్‌నాథ్‌ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద ప్రకటనలు చేయడం చాలా దురదృష్టకరం. నేను ఆయన్ను అభ్యర్థిస్తున్నా.. సవాలు కూడా చేస్తున్నా. వాస్తవాలను ప్రపంచం ముందుంచాలని కోరుతున్నా. స్వామీజీ ప్రకటనలు చేసే కంటే.. సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తునకు డిమాండ్‌ చేయాల్సింది. అంతేకాదు.. ఆయన వద్ద ఆధారాలు ఉంటే హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు'' అని అజేంద్ర పేర్కొన్నారు.

'కేదార్‌నాథ్‌ ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే హక్కు శంకరాచార్య (స్వామీ అవిముక్తేశ్వరానంద)కు లేదని అజేంద్ర వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయ లక్ష్యాలతో పనిచేస్తే మాత్రం అది దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన కేవలం ఆందోళనలు, వివాదాలు సృష్టించడానికే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అజెండా ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయడం విచారకరమన్నారు.

'కేదార్‌నాథ్‌ ఆలయంలో తాపడం చేసిన 228 కేజీల బంగారం అదృశ్యమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద సోమవారం ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అక్కడ కుంభకోణం చేసి.. దిల్లీలో ఆలయ నమూనా నిర్మిస్తున్నారా..? అని ప్రశ్నించారు. బంగారం గోల్‌మాల్‌పై అసలు దర్యాప్తు ప్రారంభించలేదన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? అని ప్రశ్నించారు. తాము కమిషనర్‌ను విచారణకు డిమాండ్‌ చేసినా ఫలితం లేదన్నారు.

''తొలుత 320 కిలోల బంగారం మాయమైందన్నారు.. తరవాత 228 కిలోలకు తగ్గించారు.. ఆ తర్వాత 36..32.. 27 అన్నారు. బంగారం 320 కిలోలా.. 27 కిలోలా అన్నది సమస్య కాదు.. అది ఎక్కడికి పోయిందనేదే ముఖ్యం. బంగారం రాగిగా ఎలా మారుతుంది..?'' అని నాడు అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com