నాగపంచమి
- August 09, 2024
హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే శుద్ధ పంచమి రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ పర్వదినాన పుట్టలో పాములకు పాలు, గుడ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పర్వదినాన నాగ దేవతను పూజించిన వారికి, ఏడాది పొడవునా ఎలాంటి సమస్యలూ రాకుండా, తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 9 ఆగస్టు 2024 శుక్రవారం రోజున నాగ పంచమి పండుగ వచ్చింది.
శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్క మొదలైన చేసిన నాగ పడిగెలకు భక్తులు ఆరాధిస్తుంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి" నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసము నివేదించాలని శివుడు పార్వతి దేవికి వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.
నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి.పూజ కొరకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపం వెలిగించాలి.నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి.
పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. "ఓం నాగరాజాయనమః" అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి.కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!