ఇజ్రాయెల్‌ పై దాడికి ఇరాన్ సిద్ధం..

- August 13, 2024 , by Maagulf
ఇజ్రాయెల్‌ పై దాడికి ఇరాన్ సిద్ధం..

ఇజ్రాయెల్‌ పై ఇరాన్ దాడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో దాడిని తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్, అమెరికా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌లో హమాస్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా ఉన్న సమయంలో అతడిని అక్కడే ఇజ్రాయెల్‌ హత్య చేసిన విషయం తెలిసిందే.

దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ఎదురు చూస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఏ నిమిషంలోనైనా యుద్ధం మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాకు అమెరికా గైడెడ్ మిస్సైల్ సబ్‌మెరైన్‌ను పంపింది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను కూడా ఆ ప్రాంతానికి తరలించాలని అమెరికా ఆదేశించింది.

అంతేగాక, సమీప భవిష్యత్తులో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌‌తో పాటు దానికి మద్దతిస్తున్న సంస్థలు దాడి చేసే అవకాశం ఉందని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడితే తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ పూర్తి సంసిద్ధతతో ఉంది. ఇరాన్‌లో హమాస్ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియాను హతమార్చింది తామేనని ఇజ్రాయెల్ ఇప్పటివరకు అంగీకరించలేదు. అయినప్పటికీ ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్, హమాస్ ఇప్పటికే ప్రకటించాయి.

ఇరాన్‌ సహనంతో ఉండాలని అమెరికాతో పాటు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. అలాగే, ఇజ్రాయెల్‌, హమాస్‌ల మధ్య జరిగిన కాల్పుల విరమణ ప్రయత్నాలకు మద్దతు తెలిపాయి. కాల్పుల విరమణ చర్చలు తిరిగి గురువారం ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్‌ పై ఇరాన్‌ దాడి చేస్తే ఆ చర్చలకు ఆటంకం కలగవచ్చని అమెరికా భావిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com