సీఎం చంద్ర‌బాబుతో సునీతా కృష్ణ‌న్ భేటి…

- August 13, 2024 , by Maagulf
సీఎం చంద్ర‌బాబుతో సునీతా కృష్ణ‌న్ భేటి…

అమరావతి: ప్రముఖ సామాజిక కార్యకర్త, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్ నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇటీవలే ఆమె సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరగా, చంద్రబాబు సానుకూలంగా స్పందించి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అపాయింట్ మెంట్ ఖరారు చేశారు.ఈ నేపథ్యంలో, నేడు అమరావతి వచ్చిన సునీతా కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

తన సమావేశం పై ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..“చంద్రబాబు సర్… మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషం కలిగించింది. నా జీవితగాథ పుస్తకం ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’ (I Am What I Am)ను మీకు అందించడం నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. మీ విలువైన సమయాన్ని నాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు.సైబర్ ఆధారిత మానవ అక్రమ రవాణాపై పోరాటానికి సహకరించాలన్న మా ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవడానికి మీరు చూపిన సానుకూల స్పందన హర్షణీయం. అదే సమయంలో లైంగిక నేరగాళ్ల వివరాలు, లైంగిక నేరాల తగ్గింపునకు అనుసరించాల్సిన వ్యూహం గురించి మీకు వివరించగలిగే అవకాశం దక్కినందుకు సంతోషిస్తున్నాను. ఎప్పట్లాగే మీతో సమావేశం ఎంతో స్ఫూర్తిని కలిగించింది” అంటూ చంద్రబాబును ఉద్దేశించి సునీతా కృష్ణన్ ట్వీట్ చేశారు.

కాగా, సునీతా కృష్ణన్ ట్వీట్ పట్ల చంద్రబాబు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “సునీతా కృష్ణన్ గారు… మీ ఆలోచనలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు. ఏ విధమైన సహాయసహకారాలతో ముందుకు పోవాలన్నదానిపై ఆలోచిస్తున్నాం” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com