నవరస రత్నాలపల్లి-రాళ్లపల్లి
- August 15, 2024
ఏ పాత్రనైనా సరే అవలీలగా పోషించగలిగిన సహజ నటుడు రాళ్లపల్లి నరసింహారావు. నటనలో ఆయనకంటూ ఒక సొంత శైలి ఉంది. భాషా భేదం లేకుండా కొన్ని వందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు రాళ్లపల్లి.. ఆలా వచ్చిన ఆయన ‘స్త్రీ’ (1973) చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించి ‘భలే భలే మగాడివోయ్’ (2015) వరకూ దాదాపు 850 చిత్రాల్లో నటించారు రాళ్లపల్లి. నేడు సీనియర్ నటుడు రాళ్లపల్లి జన్మదినం.
రాళ్లపల్లి పూర్తి పేరు రాళ్లపల్లి వెంకట నరసింహారావు.1945, ఆగస్ట్ 15న తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో జన్మించారు.1958లోనే హైదరాబాద్‌లో వీరి కుటుంబం స్థిరపడింది. చిన్నప్పటి నుంచి రాళ్లపల్లికి నాటక రంగంపట్ల ఆసక్తి ఎక్కువ. పదో తరగతిలో ఉన్నప్పుడే ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. చదువుకుంటూ, నాటకాల్లో నటిస్తూ బీఎస్సీ పూర్తి చేశారు. నటుడే కాదు రాళ్లపల్లిలో మంచి రచయిత కూడా ఉన్నారు.
కాలేజీ రోజుల్లో ఆయన రాసి, నటించిన ‘మారని సంసారం’ నాటికకు ఉత్తమ రచన, నటుడు అవార్డులు లభించాయి. అప్పటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి చేతుల మీదుగా అ అవార్డులు అందుకున్నారాయన. బీఎస్సీ పూర్తయ్యాక తన అన్నయ్య సలహా మేరకు రైల్వేలో ప్యూన్ జాబ్‌లో చేరారు రాళ్లపల్లి. కుర్చీలు, బల్లలు తుడవడం, కాఫీ కప్పులు కడగడం.. ఇలా అన్నీ చేశారు. ఓ సందర్భంలో పై అధికారి ఏదో అంటే సీరియస్‌గా ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పారు రాళ్లపల్లి.
ఆ తర్వాత ఆయన రాళ్లపల్లి వివరాలు కనుక్కుంటే బీఎస్సీ చదువుకున్నాడని తెలుసుకుని, అప్పటినుంచి చదువుకు తగ్గ పనులు మాత్రమే చెప్పడం మొదలుపెట్టారు. ప్యూన్ ఉద్యోగం చేస్తుండగానే హైదరాబాద్‌లోని మినిసీ్ట్ర ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్లోని ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’లో రాళ్లపల్లికి జాబ్ వచ్చింది. 1970 జనవరి 4న ఢిల్లీలో కొత్త ఉద్యోగంలో చేరిన ఆయన జాతీయ సమైక్యత, కుటుంబ నియంత్రణ.. ఇలా సామాజిక అంశాలతో నాటకాలు వేశారు. ఎనిమిదేళ్ల పాటు నిరవధికంగా నాటకాలు వేశారు రాళ్లపల్లి. ఆయన జీవితకాలంలో దాదాపు 8 వేల నాటకాల్లో నటించారు.
నాటకాలతో బిజీగా ఉన్నప్పుడే నూతన హీరో హీరోయిన్లతో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘హారతి’ నవలను సినిమాగా తీయనున్నట్లు వచ్చిన పత్రికా ప్రకటన రాళ్లపల్లి దృష్టిలో పడింది. ‘మీరెలాగూ హీరోగా పనికి రారు. వేరే ఏదైనా పాత్రలకు పనికొస్తారేమో.. ఓ ఉత్తరం రాయొచ్చు’గా అని భార్య స్వరాజ్యలక్ష్మి చెప్పిన మీదట.. ‘నా ఎత్తు అంతంత మాత్రమే.. ’ అంటూ ప్రత్యగ్మాతకు రాశారు. అలా ‘స్త్రీ’ సినిమాకి అవకాశం తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. రాళ్లపల్లి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ఊరుమ్మడి బతుకులు’ (1976). అందులో రాళ్లపల్లి చేసిన తాగుబోతు హరిశ్చంద్రుడు పాత్ర ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత ‘చిల్లర దేవుళ్లు’లో చేసిన వీరిగాడి పాత్ర, ‘చలి చీమలు’ కూడా రాళ్లపల్లికి మంచి పేరు తెచ్చాయి. ‘సీతాకోక చిలుక’, ‘అభిలాష’, ‘కంచు కాగడా’, ‘రేపటి పౌరులు’, ‘అన్వేషణ’, ‘శుభలేఖ’ వంటి చిత్రాలు రాళ్లపల్లిలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. ‘అభిలాష’ సినిమాలో చిరంజీవిని కాపాడే జైలు వార్డన్ శర్మగా ఆయన చేసిన నటన విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకా వంశీ సినిమాలు ‘ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’లో మంచి పాత్రలు చేశారు. జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘అహ నా పెళ్లంట’, ‘రెండు రెళ్ల ఆరు’లో మంచి పాత్రలు చేశారు. మణిరత్నం ‘బొంబాయి’లో చేసిన హిజ్రా క్యారెక్టర్ రాళ్లపల్లికి పలు ప్రశంసలు తెచ్చిపెట్టింది.
సినీ కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో టైటిల్ కార్డ్స్‌లో ‘ఆర్.వి. నరసింహారావు’ అని వేసేవారు. ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమా చేసేటప్పుడు ఆ చిత్రదర్శకుడు బాపు.. అంత పొడవాటి పేరు ఎందుకు? అని ‘రాళ్లపల్లి’ అని వేశారు. అప్పటినుంచి ‘రాళ్లపల్లి’గా గుర్తుండిపోయారు. కళాకారులు నిరంతర విద్యార్థులు అంటారు రాళ్లపల్లి. అది ఆచరణలోనూ చూపెట్టారాయన. 70 ఏళ్లకు దగ్గరపడుతున్న సమయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల శాఖలో ఎంఫిల్ చేశారాయన.
800 పై చిలుకు చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి వ్యక్తిగత జీవితంలో కొంత విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మెడిసిన్ చదవడానికి రష్యా ప్రయాణం అయినప్పుడు మార్గ మధ్యలో వైరల్ ఫీవర్ ఎటాక్ కావడంతో చనిపోయారు. తన జీవితంలో జరిగిన అతి పెద్ద దుర్ఘటన అది అని పలు సందర్భాల్లో రాళ్లపల్లి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన చిన్నకుమార్తె రష్మిత ఎంసీఏ చేశారు. ప్రస్తుతం కుటుంబంతో సహా రష్మిత అమెరికాలో ఉన్నారు.
సినిమాల్లోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు. వంటగదిలోని పాత్రలతో భోజనప్రియులతో ‘ఆహా.. ఏమి రుచి’ అనిపించగలరు రాళ్లపల్లి. నటుడు కమల్‌హాసన్, దర్శకుడు వంశీలకు రాళ్లపల్లి వంటకాలంటే చాలా మక్కువ. ‘‘మీకు ఎప్పుడూ సినిమాలుండాలనేది నా ఆకాంక్ష. ఒకవేళ లేకపోతే నా దగ్గరకొచ్చేయండి.. వారానికి రెండు రోజులు వండి పెట్టండి చాలు. జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాను’’ అని రాళ్లపల్లితో కమల్ ఓ సందర్భంలో అన్నారు. ఇక దర్శకుడు వంశీ అయితే షూటింగ్ స్పాట్‌కే కూరగాయలు తెప్పించి మరీ రాళ్లపల్లితో వంట చేయించుకుని ఎంతో ఇష్టంగా తీనేవారు. ఇంకా రాళ్లపల్లి వంటలను ఇష్టంగా ఆరగించిన ప్రముఖులు చాలామందే ఉన్నారు.
తెలుగు సినిమా పరిశ్రమ మంచి సహాయనటుడు, హాస్య నటుడిని కోల్పోయింది. రత్నం లాంటి నటుడు రాళ్లపల్లి. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోతాయి. కళాకారుడు కన్నుమూసినా, తాను చేసిన పాత్రల్లో జీవించే ఉంటాడు. ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచే ఉంటాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..