జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి: TTD ఆదనపు ఈవో

- August 15, 2024 , by Maagulf
జాతీయ నాయకుల స్ఫూర్తితో సేవలందించాలి: TTD ఆదనపు ఈవో

తిరుమల: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు జాతీయ నాయకులు అకుంఠిత దీక్షతో ఎన్నో త్యాగాలు చేశారని, అలాంటి వారిని టిటిడి ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆదనపు ఈవో సిహెచ్‌ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం కోసం ఎందరో మహానేతలు తమ జీవితాలను అంకితం చేశారన్నారు.మన సనాతన హిందూ ధర్మం, పురాణాలు, వేదాలు మనకు నిస్వార్థ సేవ, త్యాగం సత్యాన్ని బోధించాయన్నారు. ఆ మార్గంలోనే మన స్వాతంత్య్ర సమరయోధులు స్వాతంత్య్రం సాధించారన్నారు. వారి బాటలో పయనిస్తూ, ఉద్యోగులందరూ సమన్వయంతో, అత్యంత అంకితభావంతో భక్తులకు సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. తద్వారా యాత్రికులు మరపురాని తిరుమల తీర్థయాత్ర అనుభవంతో వారి ఇళ్లకు తిరిగి వేళతారని ” ఆయన చెప్పారు. రోజుకు దాదాపు 85 వేల మంది భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామని, టీటీడీ ఉద్యోగులు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించడంతోపాటు, క్యూ లైన్‌లు, ఇతర ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉంచడంలో 24 గంటలూ ఉత్తమ సేవలందిస్తున్నారన్నారు. రాబోయే రోజులలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించి, ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఖ్యాతిని పెంపొందించే విధంగా, వివిధ ఆధ్యాత్మిక సంస్థలకు ఆదర్శప్రాయంగా నిలిచేందుకు బాధ్యతలు నిర్వహించాలని” అని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన టీటీడీకి, భక్తులకు విశేష సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులకు, టీటీడీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేస్తున్న మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ2 సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్‌, వెంకటయ్య, ఆశా జ్యోతి, విజివోలు సురేంద్ర, ఎన్‌టివి రామకష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com