స్వర్ణభారత్ ట్రస్ట్ 23 ఏళ్ళ సేవా ప్రస్థానం అంకెలు కాదు, స్ఫూర్తిదాయక గమనం: ఉపరాష్ట్రపతి

- August 18, 2024 , by Maagulf
స్వర్ణభారత్ ట్రస్ట్ 23 ఏళ్ళ సేవా ప్రస్థానం అంకెలు కాదు, స్ఫూర్తిదాయక గమనం: ఉపరాష్ట్రపతి
నెల్లూరు: 17 ఆగస్టు 2024స్వర్ణభారత్ ట్రస్ట్ 23 ఏళ్ళ ప్రస్థానం అంటే అంకెలు కాదని, స్పూర్తిదాయక గమనమని, భారతదేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ పేర్కొన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా అక్షర విద్యాలయాన్ని సందర్శించారు. అక్కడి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి వారిని అభినందించారు. అనంతరం అక్షర విద్యాలయం ఆవరణలోని సోమా నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడి శిక్షణార్థులతో ముచ్చటించి, నైపుణ్య కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్వర్ణభారత్ ట్రస్ట్ కు విచ్చేసిన ఆయన ట్రస్ట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన అడ్మిన్ బిల్డింగ్ ను ప్రారంభించారు. అనంతరం ట్రస్ట్ ఆవరణలో మొక్కను నాటారు. స్వర్ణభారత్ ట్రస్ట్–భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయ సమితి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న జైపూర్ ఫుట్ ఉచిత శిబిరాన్ని సందర్శించి కొందరికి కృత్రిమ అవయవాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ ఆవరణలో ఉన్న దంత వైద్యశాల, సాధారణ వైద్యశాలలను సందర్శించి వారి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ముప్పవరపు వెంకయ్యనాయుడు జీవన ప్రస్థాన ఛాయా చిత్ర ఆంగ్ల గ్రంథాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ మాట్లాడుతూ  వెంకయ్యనాయుడు ఆలోచనలు మహోన్నతమైనవని పేర్కొన్నారు. వారు తమ జీవితాన్ని దేశం కోసం అంకితం చేశారని, అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారని పేర్కొన్నారు. వారి హృదయం ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాలతో మమేకమై ఉందని, దానికి వారి మానసపుత్రికగా ఈ ట్రస్ట్ ఓ ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారికి ప్రతి అడుగులో సహకరిస్తున్న ఉషమ్మ వారి విజయాల వెనుక ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ ను అభినందించిన ఆయన, ప్రభుత్వ సహకారం లేకుండా 23 ఏళ్ళ పాటు ట్రస్ట్ ను ఓ మహాయజ్ఞంలా నిర్వహించారని, దానికి ఎంతో నిబద్ధత కావాలని పేర్కొన్నారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవం అందరి పండుగ అని పేర్కొన్నారు. 23 ఏళ్ళ క్రితం మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఈ సంస్థ లక్ష మందికి పైగా నైపుణ్య శిక్షణను అందించామని తెలిపారు. విద్య, నైపుణ్య శిక్షణతో పాటు మన భాష, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటానికి స్వర్ణభారత్ ట్రస్ట్ నిబద్ధతో పని చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు నవీన పద్ధతులను అందిపుచ్చుకుని సాధికారతతో తల ఎత్తుకుని నిలబడటం తమ కలగా అభివర్ణించిన ఆయన, మహిళలు సైతం అదే సాధికారతతో తల ఎత్తుకు నిలబడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, పూర్వ ఉపరాష్ట్రపతి దంపతులతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దులు నజీర్ దంపతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు బీదా మస్తాన్ రావు,ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకపాటి శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ మరియు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ట్రస్టీలు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com