మూడు వారాలు టైమ్ ఇస్తున్నాం: వైఎస్ జగన్

- August 23, 2024 , by Maagulf
మూడు వారాలు టైమ్ ఇస్తున్నాం: వైఎస్ జగన్

అమరావతి: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం అచ్చుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించి.. బాధితులకు అందుతున్న వైద్యం, వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అచ్చుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సరికాదు. ఘటన జరిగింది రాత్రి కాదు పట్టపగలు.. అయినా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. హోం మంత్రి పర్యవేక్షణకు వెళ్తున్నాను అన్నమాటే లేదు. కార్మిక శాఖ మంత్రి కూడా తన దగ్గర ప్రమాదం వివరాలు లేవన్నారు. ఘటనా స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో తీసుకొచ్చారని జగన్ అన్నారు.

గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. తెల్లవారు జామున ప్రమాదం జరిగిన కాసేపటికే కలెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లారు. నేను ఉదయాన్నే 11గంటలకు ప్రమాద స్థలానికి వెళ్లాను. 24గంటల వ్యవధిలోనే పరిహారం ఇప్పించాం. కోటి రూపాయల పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం మాదేనని జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. చికిత్స పొందుతున్న బాధితులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అందలేదు. మూడు వారాలు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. ప్రకటించిన నష్టపరిహారం అందజేయాలి. లేదంటే బాధితుల పక్షాన ధర్నాకు దిగుతాం. అవసరమైతే నేనే వచ్చి ధర్నాలో కూర్చుంటానని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

ప్రమాద ఘటనపై లోతైన విచారణ జరగాలి. ఎల్జీ పాలిమర్ తరువాత హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిశ్రమల్లో భద్రతపై జీవో ఇచ్చాం. అది సక్రమంగా అమలవుతుందో లేదో ప్రభుత్వం మానిటరింగ్ చేసిఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని జగన్ అన్నారు. పరిశ్రమ భద్రతపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. కూటమి ప్రభుత్వం పాలనను పక్కన పెట్టి రెడ్ బుక్ పేరుతో పగలు ప్రతీకారాల మీద దృష్టి పెట్టిందని జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com