కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త .. స్మార్ట్​ సిటీగా జహీరాబాద్​

- August 29, 2024 , by Maagulf
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త .. స్మార్ట్​ సిటీగా జహీరాబాద్​

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్.. కీలక నిర్ణయాలు తీసుకుంది.

గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం28,602 కోట్లతో దేశంలో12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం కింద 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు 2, తెలంగాణకు 1 కేటాయించింది.

తెలంగాణలోని జహీరాబాద్‌లో 3,245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో.. ఆ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయి. గతంలో మెదక్ జిల్లాలో ఉన్న జహీరాబాద్ నియోజకవర్గం.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత సంగారెడ్డి జిల్లాలోకి వచ్చింది. అయితే.. సంగారెడ్డిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో జహీరాబాద్‌ ఒకటి. జహీరాబాద్ ప్రాంతంలో ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ముంగి లాంటి పరిశ్రమలే కాకుండా.. నిజాం షుగర్స్ కూడా జహీరాబాద్‌లోనే ఉండటం గమనార్హం. పరిశ్రమలకు తగినట్టుగా వాణిజ్య సదుపాయాలు, అనేక గోడౌన్లు ఉండటంతో పాటు.. చుట్టు పక్కన గ్రామాల్లో చెరుకు ప్రధాన పంటగా ఉండటం గమనార్హం.

ఈ ప్రాంతంలోని పరిశ్రమలతో వేల మంది ఉపాధి పొందుతున్నారు. కాగా.. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో మరింత మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి దొరికే అవకాశం ఉంది. అంతే కాకుండా.. ఆ ప్రాంతమంతా అభివృద్ధి వైపు పరుగులు పెట్టే ఛాన్స్ ఉంది. అయితే ఈ పారిశ్రామిక హబ్‌లలో రూ.1.5లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యం ఉండగా.. ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పొందనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com