వచ్చే నెల 19న ‘మిలాద్‌-ఉన్‌ నబి’ ప్రదర్శన

- August 29, 2024 , by Maagulf
వచ్చే నెల 19న ‘మిలాద్‌-ఉన్‌ నబి’ ప్రదర్శన

హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 16న జరగాల్సిన మిలాద్‌-ఉన్‌-నబి ప్రదర్శనలను 19వ తేదీన నిర్వహించుకునేందుకుగానూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల మిలాద్‌ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 16న మిలాద్‌ ఉన్‌ నబి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్‌ కమిటీ ఇదివరకే నిర్ణయించింది.

ఆ మరుసటి రోజు 17 గణేష్‌ నిమజ్జనోత్సవాలు ఉన్న నేపథ్యంలో మిలాద్‌ ఉన్‌ నబి ఏర్పాట్ల పై రాష్ట్ర గురువారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబరు ఏడు నుంచి గణేష్‌ నవరాత్రోత్సవాలు, 17న గణేష్‌ నిమజ్జనం ఉన్న విషయంపై కమిటీ ప్రతినిధులతో చర్చించారు.

మతపరమైన విభేదాలు తలెత్తకుండా చూసేందుకు, ఏ వర్గానికి కూడా ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తేదీలో మార్పు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని అంశాలపై కూలంకశంగా చర్చించిన అనంతరం మిలాద్‌ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిలాద్‌ ఉన్‌ నబీ ప్రదర్శనలను వాయిదా వేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి, మంత్రులు మిలాద్‌ కమిటీ సభ్యులకు సూచించారు.

ఈ అంశంపై చర్చించే బాధ్యతను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎంఐఎం ప్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ, మిలాద్‌ కమిటీ సభ్యులకు అప్పగించారు. సమీక్ష అనంతరం వారంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రదర్శన వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రతినిధులు కోరగా మిలాద్‌ కమిటీ సభ్యులు సానుకూలత వ్యక్తం చేశారు.

మహ్మద్‌ ప్రవక్త 1499వ జన్మదినం వచ్చే సెప్టెంబర్‌ 16న జరుగుతుందని, వచ్చే ఏడాది 1500వ జన్మదినం కనుక ఏడాది పాటు ఉత్సవాల నిర్వహణకు అనుమతించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మిలాద్‌ ఉన్‌ నబి ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

మసీదుల అలంకరణ, వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఒక జాబితా తయారు చేసి ఇవ్వాలని కమిటీ సభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు. వాటిని పరిశీలించి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com