గుడ్లవల్లేరు ఘటన బాధాకరం : జగన్

- August 30, 2024 , by Maagulf
గుడ్లవల్లేరు ఘటన బాధాకరం : జగన్

అమరావతి: చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయంటూ వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంద‌ని పేర్కొన్నారు.

గుడ్లవల్లేరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని… విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఘటన ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారంటూ మండిప‌డ్డారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీతో పాటు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని…. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.

ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రిగా ఉన్నందున ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. రోజూ మెనూతో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించే గోరుముద్ద పథకం అత్యంత అధ్వాన్నంగా తయారైందని మండిపడ్డారు. చంద్రబాబు వెంటనే మేలుకోవాలని.. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, వారి భవిష్యత్తును పణంగా పెట్టవద్దని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com