ఆదర్శ నేత్ర వైద్యుడు...!
- September 01, 2024
ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు ఇక్కడకు వచ్చి చికిత్స చేయించుకుంటుంటారు. మూడున్నర దశాబ్దాల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిడుకులను ఎదుర్కొని సంస్థను విజయపథంలో నడిపిస్తున్నారు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ జి.ఎన్ రావు. నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆప్తమాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ జి.ఎన్ రావు జన్మదినం సందర్భంగా వారి ప్రయాణం గురించి క్లుప్తంగా మీకోసం...
డాక్టర్ జి.ఎన్ రావు పూర్తి పేరు గుళ్లపల్లి నాగేశ్వరరావు. 1945, సెప్టెంబరు1న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర్లోని చోడవరం గ్రామంలో జన్మించారు. అయితే, రావు గారి తండ్రి డాక్టర్ గుళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు గుంటూరులో ఆప్తమాలజిస్ట్‌గా క్లినిక్ పెట్టి అక్కడే స్థిరపడటంతో పదేళ్ల వయస్సు నుంచి మెడిసిన్ చదివే వరకు అక్కడే ఉన్నారు. గుంటూరులోని ఏ.సి కళాశాలలో పీ.యూ.సి, గుంటూరు మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.యస్ పూర్తి చేసి ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ కళాశాలలో ఆప్తమాలజీ విభాగంలో పీజీ పూర్తిచేశారు.
ఆప్తమాలజీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి టఫ్ట్స్ యూనివర్శిటీ న్యూ ఇంగ్లాండ్ మెడికల్ సెంటరులో ఎఫ్.ఆర్.సి.ఎస్ పూర్తి చేసి న్యూయార్క్ నగరంలోని రోచెస్టర్ యూనివర్శిటీలోని ఫ్లామ్ ఐ ఇన్ స్టిట్యూట్ (Flaum Eye Institute) లో ఎఫ్.ఏ.సి.ఎస్ పూర్తి చేసి ఆప్తమాలజీ విభాగంలో రీసెర్చ్ ఫెలోగా, డాక్టర్ కమ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. కేవలం, పదేళ్లలోనే అమెరికాలోని ప్రముఖ ఆప్తమాలజీస్టుల్లో ఒకరిగా ప్రసిద్ధి పొందారు. ఆప్తమాలజీ విభాగంలో రావు గారు రాసిన 300 పైగా రీసెర్చ్ పేపర్స్ అంతర్జాతీయ జర్నల్స్ లో పబ్లిష్ అయ్యాయి.
అమెరికాలో బిజీగా ఉన్న సమయంలోనే మాతృదేశానికి తన సేవలను వినియోగించాలని భావించి 1986 చివర్లో అమెరికా నుండి ఇండియాకు తిరిగి వచ్చారు. మధురైలోని ప్రఖ్యాత అరవింద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సందర్శించి దాని వ్యవస్థాపకుడైన డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి స్పూర్తితో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటికి సంబంధించిన అత్యాధునిక వసతులతో కూడిన కంటి హాస్పిటల్ మరియు పరిశోధనా సంస్థ ఏర్పాటుకు అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రభుత్వ పరంగా ఇచ్చిన ప్రోత్సాహం అందించారు. దానితో పాటుగా, ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్ తమ తండ్రి పేరిట హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న తమ సొంత స్థలంతో పాటుగా ఆరోజుల్లోనే కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రసాద్ గారి కుటుంబం ఇచ్చిన అంత పెద్ద కాంట్రిబ్యూషన్‌కు గుర్తింపుగా "ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్"(LVPEI) గా నామకరణం చేశారు.
తారతమ్యాలు చూపకుండా సమాజంలోని అన్ని వర్గాలకు మెరుగైన కంటి వైద్యం అందించడమే ఎల్వీపీఈఐ సంస్థ యొక్క లక్ష్యం అని రావు గారు పేర్కొన్నారు. 50 శాతానికి పైగా రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయంగా నేత్రవైద్యంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అత్యంత అధునాతన వైద్యా పద్దతులను ఎల్వీపీఈఐలో ప్రవేశపెడుతూ వస్తున్నారు. కంటి వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంతోపాటు కంటి వ్యాధులు రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకునేందుకు ఎల్వీపీఈఐ వైద్యులు కృషి చేస్తున్నారు. దీంతోపాటు పుట్టుకతో కంటి చూపు కోల్పోయిన వారికి తమవంతు సేవలను అందిస్తున్నారు. వరల్డ్ క్లాస్ నేత్ర వైద్యాన్ని రోగులకు అందించడంతో మా ఆసుపత్రికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించింది.
ఎల్వీపీఈఐ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు రెండు కోట్ల పైచిలుకు కంటి ఆపరేషన్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా...ఈ మూడు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో పర్మనెంట్‌గా 300 పైచిలుకు ఎల్వీపీఈఐ కేంద్రాలు స్థాపించారు. లైబేరియా దేశ అధ్యక్షుడి వినతి మేరకు ఆ దేశ రాజధాని నగరమైన మోన్ రోవియాలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేత్రవైద్య సేవలు అందిస్తున్నారు.
ఆప్తమాలజీ విభాగంలో రావు చేసిన సేవలకు గాను 1983లో అమెరికన్ ఆప్తమాలజీ అకాడమీ నుండి గౌరవ అవార్డు, 1996లో భారత జాతీయ వైద్యశాస్త్ర అకాడమీ ఫెలోషిఫ్, 2002 లో పద్మశ్రీ పురస్కారాలతో పాటుగా పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులు, సత్కారాలను అందుకుంటూనే ఉన్నారు.
"ఇప్పుడు రెండు పెద్ద ప్రాజెక్టులపై పనిచేస్తున్నాం. ఒకటేమో ఐ కేర్‌లో ఇనిస్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్. అవి ఒక పన్నెండు సెంటర్లు వస్తున్నాయి. రెండోది మూడు స్టేట్స్‌లో ప్రైమరీ ఐకేర్‌ను విస్తృత పరిచి, అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచానికి ఒక మోడల్ అందించాలని ఆశిస్తున్నాం. మన దేశం పేరు ప్రముఖంగా వినిపించేలా పరిశోధనలు చేయాలని ఆలోచిస్తున్నాం" అని రావు గారు తెలిపారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..