ప్రజాకవి.....!

- September 09, 2024 , by Maagulf
ప్రజాకవి.....!

కాళోజీ అనే మూడు అక్షరాలు తెలుగు సాహిత్యలోకాన్నే కాదు, యావత్ సమాజాన్ని ప్రభావితం చేశాయి. అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట/హంస తూలికలొకచోట అలసిన దేహాలొకచోట/సంపదలన్నీ ఒకచోట గంపెడు బల గం బొకచోట! అంటూ సమాజంలోని అసమానతలను చూసి ఆవేదనతో కవితారచన చేసిన నికార్సయిన ప్రజాకవి కాళోజీ. ఆయన ఆధునికతరం వేమన. ఆయన కవిత్వంలో సమకాలీన స్పందనాత్మకత ఒక పార్శ్వమైతే, తెలంగాణ అస్తిత్వ ప్రతీకాత్మకత వేరొక కోణం. తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం నినదించిన కవులలో కాళోజీ స్వరం అత్యంత విలక్షణం.మాతృదేశాన్నీ మాతృభాషను అమితంగా అభిమానించిన కాళోజీ నాటి నిజాం రాష్ట్రంలోని కొందరు తెలుగు ప్రజలు తెలుగు భాషపట్ల చూపిస్తున్న నిరాదరణకు స్పందిస్తూ ఏ భాషరా నీది ఏమి వేషమురా/ఈ భాష ఈ వేషమెవరికోసమురా/ఆంగ్లమందున మాటలాడగలుగగనే / ఇంతగా కుల్కెదవు ఎందుకోసమురా?/అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా అంటూ స్వభాషాభిమానాన్ని తట్టిలేపారు. నేడు ప్రజా కవి కాళోజీ జయంతి. 

కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావ్ రాజా కాళోజీ.1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బిజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించిన కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్న డ, ఇంగ్లిష్ భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారు. రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. బిజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది. ఎక్కడో మరాఠాల కుటుంబంలో పుట్టి, వరంగల్‌కు వచ్చి స్థిరపడి ‘నాది బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష.. నా మాతృభాష తెలుగు’అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు కాళోజీ. తెలంగాణ పలుకుబడితో ప్రజల మాట, వ్యధలను ఆయన వ్యక్తం చేసిన తీరు అమోఘం.. అందరికీ ఆదర్శప్రాయం. 

స్వతంత్ర భారతంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ జైలుకు పోయాడు. తనకు నచ్చినట్లు బతికిండు. ఎమర్జెన్సీని ప్రశ్నిస్తూ కవితలు రాసిన ఏకైక వ్యక్తి కాళోజీ. విశాలాంధ్ర కావాలని తొలుత కోరుకున్నా, తర్వాత తెలంగాణ సంస్కృతి భాష, యాస వేళాకోళానికి గురైతే బాధపడి, ప్రత్యేక తెలంగాణను సమర్ధించి పోరాటం చేశాడు. అతను ఒక మానవతావాది, వైతాళికుడు, ఒక ఓదార్పు, భరోసా కలిగించిన స్వచ్ఛమైన మనిషి.1952లో హనుమకొండ పార్లమెంటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత ఏ పార్టీ తరఫున పోటీ చేయలేదు. 1958–60 మధ్య రెండున్నర సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు. 1977లో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మీద పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే, కాళోజీ ధైర్యంగా పోటీ చేసి ఎదుర్కొన్నాడు. 

ఆయన సామాన్యుల్లో అసామాన్యుడు. తనకు గుర్తింపు కావాలని ఆయన ఏనాడు కోరుకోలేదు. రాజకీయాల్లో ఉంటే ఎన్నో పదవులు పొందెటోడు. అది ఊహాజనితమైన విషయం. అధికారం వైపు కన్నెత్తి చూసే లక్షణం ఆయనకు లేదు. అధికారం అంటే ఒత్తిళ్లు, దర్పం, అధికారం మిత్రుల మీద ఉపయోగించడం వంటివి ఉంటాయి. వాటికి ఆయన పూర్తి విరుద్ధం. కాళోజీ ఒక ప్రవక్త, ఒక సూఫీ వేదాంతి, ఒక కబీర్. 

కాళోజీకి మనిషన్న, బతుకడమన్న చాలా ఇష్టం. మనిషి మనిషిలా జీవిస్తే, ఇంకో మనిషిని మనిషిలా గౌరవిస్తే ప్రపంచం బాగుపడుతుందన్న ఆలోచన ఉన్నవాడు. ఆయన తపనంతా మనిషి కోసమే. ‘‘ఈశ్వరుడుని కచ్చితంగా నమ్ముతాను. నేను ఆచరించి తీరుతాను. జరిగిందానికి వగవను. జరిగేదానిని తలవను. జరగనున్నది అని ఊహాగానాలు చేయను. వర్తమానంలోనే బతుకుతాను’’ అనేవారు. బతికినంత కాలం ఆత్మగౌరవంతో బతికిండు. అన్యాయాన్ని, పీడనని ఎదిరించి బతికిండు. నిజాంకి వ్యతిరేకంగా పోరాటాల్లో పాల్గొన్నడు. 

స్వతంత్ర భారతంలోనూ, తెలంగాణ ఉద్యమంలోనూ జైలుకు పోయాడు. తనకు నచ్చినట్లు బతికిండు. ఎమర్జెన్సీని ప్రశ్నిస్తూ కవితలు రాసిన ఏకైక వ్యక్తి కాళోజీ. విశాలాంధ్ర కావాలని తొలుత కోరుకున్నా, తర్వాత తెలంగాణ సంస్కృతి భాష, యాస వేళాకోళానికి గురైతే బాధపడి, ప్రత్యేక తెలంగాణను సమర్ధించి పోరాటం చేశాడు. అతను ఒక మానవతావాది, వైతాళికుడు, ఒక ఓదార్పు, భరోసా కలిగించిన స్వచ్ఛమైన మనిషి.

నిత్య సత్యవాక్యాలు ఆయన కవిత్వంలో ఎన్నో ఉన్నాయి. ‘‘సాగిపోవుటే బ్రతుకు, ఆగిపోవుటే చావు’’, ‘‘ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ’’, ‘‘హెచ్చు తగ్గులున్న చోట చచ్చిపోవు సమభావం, సమభావం లేని చోట సామ్యవాదం అవుత’’ ఇలాంటి మాటలు ఎన్నో. అధికార దాహాన్ని, రాజ్యకాంక్షను, తన చేతికర్రతో అదిలిస్తూ, ప్రజల గొడవలన్నీ నా ‘గొడవల’ని చేతి సంచిలో వేసుకుని అన్యాయం ఎదిరిస్తూ, ప్రతి ఒక్కరి గుండెల్లో స్వేచ్ఛ పతాకాన్ని ఎగరేయాలని, పరితపించిన ప్రజాకవి కాళోజి. అందుకే ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం "తెలంగాణ భాషా దినోత్సవం"గా ప్రకటించింది.

కాళోజీ కవిత్వం అంతా ఆయన జీవిస్తున్న సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలకు, ఎప్పటికప్పుడు స్పందించి వేమన వలె చేసిన అభిప్రాయ ప్రకటనలే. ‘‘నేను కవిని కావాలని కవిత్వం రాయలేదు. ఆనందమో, విషాదమో కలిగినప్పుడు, నాకు తోచిన మాటలు రాసిన. అది విన్నవాళ్లకు నచ్చింది. అందులో కవిత్వం ఉన్నదని నేను అనలేదు. ఉన్నదని మీరంటే సంతోషమే’’ అనేవాడు. మనిషిని కేంద్రంగా చేసుకొని, బతుకులు ఆధారం చేసుకుని రాసిందే ఆయన కవిత్వమంతా. తన మరణానంతరం పార్థివదేహాన్ని వరంగల్ కాకతీయ వైద్యకళాశాల విద్యార్థుల ఉపయోగం కోసమే దానం చేసిన వ్యక్తి ఆయన.

బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలనేవాడు.’’ తెలంగాణ భాష ఆయనకు ఎంతో ఇష్టం. ఎవరి వాడుక భాషలో వాడు రాయాలని చెప్పేది ఆయన సిద్ధాంతం. రిక్షావోడితోనైనా, రాష్ట్రపతితోనైనా ఒకే రీతిలో సంభాషించేవాడు. ‘నా గొడవతో’ రాసిన కవిత్వమంతా ప్రజల గొడవే. అన్యాయం ఏ రూపంలో ఉన్న, ఎక్కడ ఉన్న ఎదిరించడమే ఆయన నైజం. ‘‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’’ అన్న గొప్ప వ్యక్తి.తన జీవనగీతం అనంత చరణాలతో నిరంతరం బడుగుల బతుకులు అభిషేకించిన వైతాళికుడు కాళోజీ.తన జీవితంలో చెప్పిందే చేసిండు. చేసింది చెప్పిండు. అందుకే ఆయన విశ్వమానవుడు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com