వరద బాధితులకు సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహాయం

- September 09, 2024 , by Maagulf
వరద బాధితులకు సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సహాయం

- ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 15 లక్షల విరాళం
- వరద బాధిత కుటుంబాలకు రిలీఫ్ కిట్ల పంపిణీ
- సిద్ధార్థ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినీకి సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు

విజయవాడ: తీవ్రమైన వరద కారణంగా సర్వస్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్థం సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 15 లక్షల విరాళాన్ని అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులతో కలసి సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన అల్యూమినీ ప్రతినిధులు.. రూ. 15 లక్షల చెక్కును అందించారు. సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల దాతృత్వం అభినందనీయమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అల్యూమినీ ఆధ్వర్యంలో వరద బాధితులకు పంపిణీ చేస్తున్న కిట్ల గురించి ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మొత్తం కుటుంబానికి అవసరమైన చీర, పంచె, టవల్, దుప్పటి తదితర వస్తువులను అందజేస్తున్నట్లుగా తెలుసుకుని, మిగతా దాతలు సైతం ఈ తరహా కిట్లను అందజేస్తే బాధితులకు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల అల్యూమినీ ప్రెసిడెంట్, సెక్రటరీలు డాక్టర్ సూరపనేని శ్రీనివాస్, డాక్టర్ నలమాటి అమ్మన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ, విపత్తు సమయాల్లో ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని అన్నారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు దేశ విదేశాల్లోని తమ సహచరులు ముందుకు వచ్చారని తెలిపారు. వరద బాధిత కుటుంబాల కోసం ఇప్పటి వరకు 500 రిలీఫ్ కిట్లను అందజేశామని చెప్పారు. వీటితో పాటు పునర్వినియోగానికి వీలుపడే 20 లీటర్ల వాటర్ క్యాన్లను బాధితులకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. వచ్చే రెండు రోజుల్లో మరో 1500 మందికి రిలీఫ్ కిట్లను అందజేయనున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు సమయంలో సిద్ధార్థ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినీ ఆధ్వర్యంలో రెండు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నగరంలోని పాత, కొత్త ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్లు కరోనా విపత్తు సమయంలో ప్రజలకు సంజీవనిలా ఉపయోగపడ్డాయని అన్నారు. ప్రభుత్వాసుపత్రికి అనుబంధంగా త్వరలోనే బ్లడ్ బ్యాంకును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమినీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ వరప్రసాద్, మహిళా ప్రతినిధి డాక్టర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com