కవి సామ్రాట్ ...!

- September 10, 2024 , by Maagulf
కవి సామ్రాట్ ...!

ఆధునిక యుగంలో ఎందరు కవులు తెలుగునాట పుట్టినా, గిట్టినా ఆయన తీరు వేరు. స్పష్టత ఆయనలోని రచనలోని తొలి గుణం. వ్యక్తిగా, రచయితగా ముక్కుసూటిగా చెప్పగల వ్యక్తి. మిత్రులను మందలించడమే కాక, శత్రువులను సైతం ప్రేమించగల సహృదయతకల వ్యక్తి. ఆయనను కొందరు ఛాందసుడు అన్నారు. కొందరు ఉదారుడు అన్నారు. మరికొందరు “పాషాణ పాకప్రభువు” అన్నారు. వీరగ్రాంధికవాదిగా పేరుబడిన కవి విశ్వనాథ సత్యనారాయణ. నేడు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి.

విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబర్ 10న కృష్ణాజిల్లా నందమూరులో పార్వతమ్మ, శోభనాద్రి దంపతులకు జన్మించారు. బందరు (మచిలీపట్నం)లో హైస్కూలు విద్య చదివారు. తరువాత కళాశాలలో ప్రవేశించారు. సహాయ నిరాకరణ పిలుపుతో కళాశాల వదలి వచ్చేశాడు. తరువాత బందరు జాతీయ కళాశాల, హిందూ కళాశాలలో పనిచేస్తూ, పట్టభద్రుడయ్యాడు. 1932లో గుంటూరు ఏ.సి. కాలేజీలో అధ్యాపకులుగా ఉన్నారు. అక్కడా ఇమడలేక 1938లో పి.జి. స్థాయిలో సంస్కృతం చదివారు. తరువాత విజయవాడ కాలేజీలో పనిచేశారు. పదవీ విరమణ అనంతరం కరీంనగర్‌లో ప్రిన్సిపాల్ గా కళాశాలలో పనిచేశారు.

విశ్వనాథవారు విద్యార్థి దశనుండే కవితలు చెప్పేవారు. కొడాలి ఆంజనేయులు గారితో కలిసి జంటకవిత్వం కూడా పందించాడు. ఆధునిక సాహిత్య ప్రక్రియలలో ఆయన చేపట్టని ప్రక్రియలేదు. నవ్యకవిత్వ శాఖలన్నిటా ప్రవేశించి శిఖర సమానుడయ్యాడు. 1932లో భార్య వరలక్ష్మిగారు మరణించారు. భార్యావియోగంతో ‘వరలక్ష్మీ త్రిశ” అన్న స్మృతి కావ్యం రచించారు. నవలా సాహిత్యంలో కాలుపెట్టిన విశ్వనాథవారు 1917లో “అంతరాత్మ” అన్న తొలి నవల రాశారు. 1976లో చివరిదైన “నందిగ్రామరాజ్యం ” రచించారు. మొత్తంగా 59 నవలలు రచించారు. వీటిలో మంచిపేరు తెచ్చినది “ఏకవీర”(1930). వ్యక్తి ధర్మానికీ, వ్యవస్థా ధర్మానికీ మధ్య చెలరేగిన సంఘర్షణను హృద్యంగా ఈ నవల చర్చిస్తుంది. ఆ రోజులలోనే ఈ నవల మనో విశ్లేషణకు దారులు తీసినది.

ఏకవీరలోని శ్రీకాత్మకత వేయి ముఖాలుగా విస్తరించి “వేయిపడగలు” (1934) అన్న నవలగా రూపుదిద్దుకుంది. ఈ నవల మూడు తరాల జీవితాలకు అద్దం పడుతుంది. ఈ నవలను విశ్వనాథ వారు చెబుతుంటే వారి తమ్ముడు రాసేవారట. ఈ పని 29 రోజుల్లోనే పూర్తయింది. 1968లో పి.వి. నరసింహారావుగారు “సహస్రఫణ్” పేర హిందీలోకి అనువదించాడు. 1976లో గుజరాతీ అనువాదం కూడా వచ్చింది. ఈ నవలలో సాహిత్యం , సంగీతం, నాట్యం, నాటకం, వైద్యం, ధ్యానయోగం వంటి ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి. కథా కథనంలో, పాత్రచలనంలో విశ్వనాథవారు తనదైన శైలిని చూపారు. విశ్వనాథవారు ఇంకా అనేక నవలలు రచించారు. కథలు రాసింది కొన్నయినా, విలువలో ఉన్నతమైనవి. మానవీయ సంబంధాలు, వివిధ చిత్తవృత్తులు అపూర్వంగా, కరణరసంలో చిత్రితమయ్యాయి.  

విశ్వనాథ వారికి విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టిన గ్రంథం “రామాయణ కల్పవృక్షం” ఈ రచనకు జ్ఞానపీర్ బహుమతి లభించింది.
విశ్వనాథవారు 1913లో తన తండ్రికి ఒక ప్రతిజ్ఞ చేశారు. అదేమంటే కవిగా తను ఎదిగితే రామాయణాన్ని తెలుగులో రచిస్తానని, ఇలా 1934నుండి “రామాయణ కల్పవృక్షం” రాయడం మొదలుపెట్టారు. ఈ రచనకై ఎంతో అధ్యమనం చేయవలసి వచ్చింది. సృష్టి క్రమాన్ని, ప్రకృతి గురించి, చరిత్ర, అర్థశాస్త్ర, పౌరశాస్త్రాలు, సమాజ శాస్త్రాలు, జ్యోతిష్యశాస్త్రాలు చదవవలిసి వచ్చింది. ప్రాచ్య, పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని, డార్విన్ సిద్ధాంతాన్ని చదవడం జరిగింది.

1955-63 మధ్య భారతీయ భాషలలో వెలుబడిన సృజనాత్మక సాహిత్యరచనలలో సర్వోత్యష్టరచనగా ఎంపికైనది. 1970 సం. ప్రధానం చేయబడింది. ఈ సభ 1971 నవంబర్ 16 మంగళవారంనాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతులమీదుగా జ్ఞాన్ పీర్ పురస్కారం జరిగింది. వారి అధ్యయనం ఎంత విస్తృతమో, ఆలోచన అన్నది ఎంత సునిశితమో, ఎంతటి వినూత్న కోణాల నుండి ఆ వెలుగు ప్రసరిస్తుంటుందో ఆయన రచనలన్నిటా అది పరచుకొని ఉంటుంది. తెలుగు సాహిత్యం మీదనే కాక, తెలుగు సాహిత్య విమర్శపై కూడా మంచి పట్టు సాధించినవారు సంస్కృత సాహితీ విమర్శకు కొత్త దారులు తెరిచారు. సంస్కృత రూపకాల గురించీ, కాళిదాసు, భవభూతి సాహిత్యం గురించి విలువైన వ్యాసాలు అందించారు.

1923లో విశ్వనాథ వారు తన తండ్రి వెంట భద్రాచల ప్రాంతానికి వచ్చినపుడు గోదావరి ఉపనది కిన్నెరసాని వారు చూసి ఆయనలో కవితా హృదయం పొంగి పొరలింది. దీంతో రసమయ కావ్యంగా “కిన్నెరసాని పాటలు” రూపుదాల్చాయి. “ముద్దు ముద్దుగా నడిచి ప్రోడవోలిక నాది మురిపెమ్ముగా పాది ముగుద కిన్నెర సాని ఎడదలో ఎదురైన కలగాంచెనో కన్నీటి కడవలై ప్రవహించెనో అంటూ కిన్నెర కావ్య స్రవంతిని ఎనిమిది కండాలుగా కిన్నెర పుట్టుక, కిన్నెర నడకలు; కిన్నెర నృత్యం, కిన్నెర సంగీతం; కడలిపొంగు; కిన్నెర దు:ఖం; గోదావరి సంగమం; కిన్నెర వైభవం పేర్లలో కావ్య స్రవంతిని ముందుకు నడిపాడు. ఇంకా ఎన్నో నాటికలు, నాటకాలు రచించారు విమర్శ గ్రంథాలు రచించారు.

విశ్వనాథ వారు తమ జీవితకాలంలో ప్రపంచంలోనూ, దేశంలోనూ, తన రాష్ట్రంలోనూ సాగుతున్న సాంఘిక, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య, మత, నైతిక రంగాల ఉద్యమాలన్నింటినీ అధ్యయనం చేసి వాటికి తన స్పందనలను, ప్రతి స్పందనలను తన సాహిత్యంలో రికార్డు చేసిన వివేకజ్ఞులు.‘‘నేను ఏమి రాస్తానో తెలిసే రాస్తాను’’ అని చెప్పుకున్న జ్ఞాతశిల్పి. స్వాతంత్రోద్యమం, రష్యన్ విప్లవం, కమ్యూనిస్టు ఉద్యమం, ఆంధ్రోద్యమం, చరిత్రాధ్యయనోద్యమం, తాత్త్విక ఆధ్యాత్మికోద్యమం, పునరుజ్జీవనోద్యమం, సంస్కరణోద్యమం, భాషోద్యమం, నాస్తికవాదం, జానపద చైతన్యోద్యమం, పర్యావరణ పరిరక్షణోద్యమం ఇలా ఎన్నో ఉద్యమ చైతన్యాలపై విశ్వనాథ వారు స్పందించారు. సమకాలీనోద్యమాలకు సమగ్రంగా స్పందించి తన దృక్పథాన్ని నిర్భయంగా నిజాయితీతో చెప్పిన ‌ఋజువర్తనులు.

విశ్వనాథ వారు అందుకున్న పురస్కారాలకు కొదవేలేదు.1936లో “కవిసమ్రాట్” బిరుదు అందుకున్నారు. విశ్వనాథవారు పొరుగు రాష్ట్రాలలో కూడా ఘన సన్మానాలు అందుకన్నారు. కలకత్తాలో వంగీయ సాహిత్య పరిషత్ సన్మానాన్ని 1967లో అందుకున్నారు. నాగపూర్ 1975లో పొందిన సన్మానం, వారణాసిలో జరిగిన సన్మానాలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.1957లో రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్ష పదవిని; 1958లో రాష్ట్ర శాసన మండలి సభ్యత్వం పొందారు. 1971లో విశ్వనాథవారు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి పదవిని అలంకరించారు. గుడివాడ ప్రజలు 1942లో “గజారోహణం”లో ఊరేగించారు.1965లో ఆంధ్రవిశ్వవిద్యాలయం “కళాప్రపూర్ణ” బిరుదుతో సత్కరించారు.

 కవిగా పండితునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, విమర్శకుడుగా, గాయకుడిగా రాణించిన విశ్వనాథ వారు 1976 అక్టోబరు 18న తనువు చాలించారు. దూషణ, భూషణాలు రెంటిని పొందారు. పురస్కారాలు, తిరస్కారాలను చవిచూశారు. ఆయనను కరడుకట్టిన సంప్రదాయవాదిగా లోకం చూసింది. కానీ ఆయన ఆధ్యాత్మికతతో కలగలసిన సామ్యవాదాన్ని కోరుకున్నారు. తెలుగుజాతి మనుగడ సాగించినంతవరకు తెలుగువారి గుండెల్లో విశ్వనాథవారు సజీవంగా వెలుగులు ప్రసరిస్తూనే ఉంటారు. 

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com