తెలుగు రాష్ట్రాలకు విరాళాన్ని ప్రకటించిన తొలి తమిళ హీరో ఆయనే
- September 10, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుంభవృష్టి తరహా పరిస్థితులు సంభవించాయి. మొన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి.
అనేక ప్రాంతాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- తెలంగాణలో ఖమ్మం, మహబూబాబాద్, ఏపీలో రాజధాని అమరావతి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. కొన్ని రోజులపాటు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగింది. ప్రస్తుతం దీని తీవ్రత భారీగా తగ్గింది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు కోలుకున్నాయి. సింగ్‌నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాల్లో వరదనీరు పూర్తిగా తగ్గింది.
అదే సమయంలో సహాయక, పునరావాస చర్యలు ముమ్మరం సాగుతున్నాయి ఆయా ప్రాంతాల్లో. అధికార యంత్రాంగం అక్కడే మకాం వేసింది. చిట్టచివరి వ్యక్తి వరకూ సహయక చర్యలు అందేలా చేస్తోంది. అధికార తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమవంతు సహాయక చర్యలను అందిస్తోన్నారు.
తెలంగాణలో మున్నేరు వాగు ఉప్పొంగింది. దీని తీవ్రతకు ఖమ్మం నీట మునిగింది. విజయవాడ తరహా పరిస్థితులే ఖమ్మంలోనూ నెలకొన్నాయి. పలుచోట్ల పట్టాలు ధ్వంసం కావడం వల్ల వందల సంఖ్యలో రైలు సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. రోడ్లూ దారుణంగా తయారయ్యాయి.
ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. కోట్ల రూపాయల మేర విరాళాలు అందుతున్నాయి. టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, చిత్ర నిర్మాణ సంస్థలు, టెక్నీషియన్లు సహాయ నిధికి విరాళాలను అందజేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ, విష్వక్‌సేన్, అనన్య నాగళ్ల, సిద్ధ జొన్నలగడ్డ, అశ్వనీదత్, త్రివిక్రమ్.. వంటి సినీ ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించిన వారిలో ఉన్నారు.
ఎస్బీఐ ఉద్యోగులు, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, హెరిటేజ్ ఫుడ్స్, ఎంఈఐఎల్, గ్రీన్‌కో వంటి పలు సంస్థలు భారీ విరాళాలను అందించాయి.
తాజాగా- తమిళ స్టార్ హీరో శిలంబరాసన్ టీఆర్ అలియాస్ శింబు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు కలిపి ఆరు లక్షల రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు విరాళాన్ని ప్రకటించిన తొలి తమిళ హీరో ఆయనే.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!