సంఘ్ పరివార్ సేనాని...!

- September 11, 2024 , by Maagulf
సంఘ్ పరివార్ సేనాని...!

దేశ సమైక్యత, సమగ్రతల కోసం ఎంతోమంది ప్రాణాల‌ర్పించారు. మరికొంత వివిధ రూపాల్లో దేశ సమైక్యత కోసం కృషి చేస్తున్నారు. అలాంటి వారిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రథమ వరుసలో నిలుస్తారు.ఇప్పటి యువతరానికి ఆర్ఎస్ఎస్ పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది.. మోహన్ భగవత్. సర్ సంఘ చాలక్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంఘాన్ని మరింత పటిష్ఠపరిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. హిందుత్వ సిద్ధాంతాలను దాటి అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని సంఘం చూరగొనేందుకు బాటలు వేశారు. నిర్భీతికి మారుపేరుగా నిలుస్తూ వస్తున్న సంఘ్ పరివార్ సేనాని మోహన్ భగవత్ జన్మదినం.

మోహన్ భగవత్ పూర్తి పేరు మోహన్ మధుకర్ రావ్ భగవత్. 1950, సెప్టెంబరు 11న ఒకప్పటి సెంట్రల్ బేరార్ రాష్ట్రంలోని చంద్రాపూర్ పట్టణంలో మరాఠీ కార్హడే బ్రాహ్మణ కుటుంబంలో భగవత్ జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు మధుకర్ రావ్ భగవత్, మాలతి. చంద్రపూర్‌లోని లోకమాన్య తిలక్ విద్యాలయంలో ప్రాథమిక విద్యను, జనతా కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ పశువైద్య కళాశాల నుంచి బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ పూర్తి చేశారు. అకోలా పట్టణంలోని డా.పంజాబ్ రావ్ దేశముఖ్ కృషి విద్యాపీఠంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సు చేస్తూ సంఘం కోసం పూర్తి స్థాయిలో పనిచేసేందుకు మధ్యలోనే ఆపేశారు.

మోహన్ భగవత్ కుటుంబ నేపథ్యంలోకి వెళ్తే, వీరి కుటుంబం తోలి నుంచి చంద్రాపూర్ ప్రాంతంలో ప్రముఖ కుటుంబం. వీరి తాతగారు నానాసాహెబ్ భగవత్ ప్రముఖ న్యాయవాది మరియు ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైన డాక్టర్ హెడ్గేవార్ సన్నిహితుడు. తండ్రి మధుకర్ రావ్ భగవత్ ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పనిచేశారు. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం మధుకర్ రావ్ గారికి గుజరాత్ రాష్ట్రంలో సహాయకుడిగా పనిచేశారు. సంఘ్ బాధ్యతల్లో మోడీకి కీలకమైన స్థానం దక్కడంలో మధుకర్ రావ్  పాత్ర కీలకం. తల్లి మాలతి భగవత్ సైతం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన రాష్ట్రీయ సేవికా సమితిలో కీలకంగా వ్యవహరించారు. తన సోదరుడు రవీంద్ర భగవత్ సైతం ఆర్ఎస్ఎస్ ప్రచారక్ బాధ్యతల్లో కొంత కాలం కొనసాగారు.

తండ్రి స్పూర్తితో చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ బాల స్వయంసేవక్ గా శాఖకు వెళ్లిన భగవత్, సంఘ్ పెద్దల ఆదేశాల మేరకు అకోలా పట్టణంలో  ప్రచారక్‌గా పనిచేశారు. ఎమెర్జెన్సీ ముగింపు నాటికి నాగ్‌పూర్‌ కేంద్రంగా విదర్భ ప్రాంత బాధ్యతలు చూశారు. 1977 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేశారు. అప్పటి సంఘం సర్ సంఘ చాలక్‌ దేవరస్ ఆదేశాల మేరకు బీహార్ రాష్ట్ర సంఘ్  ప్రచారక్‌ కార్యదర్శిగా, ఆ రాష్ట్రంలో సంఘ శాఖలను పెంచడమే కాకుండా ఉన్నవాటిని మరింత బలోపేతం చేశారు. బీహార్ రాష్ట్రంలో తన పనితీరు ద్వారా సంఘ పెద్దలను మెప్పించి గుజరాత్ ప్రాంత కార్యవహ్ గా బాధ్యతల్లో చేరారు.

గుజరాత్ సంఘ్ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్న మోడీ బీజేపీకి మారడంతో ఆయన స్థానంలో మోహన్ భగవత్ నియమితులయ్యారు. మోడీకి,  భగవత్ మధ్య చక్కటి అవగాహన ఉండటంలో భగవత్ తండ్రి మధుకర్ రావ్ ముఖ్య కారణం. అహ్మదాబాద్ మున్సిపాలిటీని భాజపా కైవసం చేసుకోవడంలో మోడీ వ్యూహాలు, భగవత్ అమలు చేసిన విధానం కీలక పాత్ర పోషించాయి. 1991 నుండి 1999 వరకు అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ బాధ్యతల్లో పనిచేశారు. ఆ తర్వాత సంఘం కార్యక్రమాలు మరియు స్వయం సేవక్ శిక్షణకు సంబంధించిన  నిర్వహణ విధానాల రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ బాధ్యతను చేపట్టారు. 2000లో సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2009లో ఆరోవ సర్ సంఘ చాలక్‌గా బాధ్యతలు చేపట్టారు.

సర్ సంఘ చాలక్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సంఘం విస్తరణకు భగవత్ నడుంబిగించారు. సంఘానికి కావాల్సిన ఆర్థిక & మానవ వనరులను సమకూర్చుకోవడంతో పాటుగా సంఘ కార్యక్రమాలకు మీడియాలో విస్తృతమైన ప్రచారం కల్పించేందుకు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయించారు. శాఖా కార్యక్రమాల్లో పాల్గొనలేని వారి కోసం చింతన శిబిరాలను ఏర్పాటు చేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని సంఘం కార్యకలాపాల గురించి అందరికి అందుబాటులోకి తెచ్చారు.దీనికి తోడు భగవత్ హయాంలోనే తమ రాజకీయ విభాగంగా పేర్కొనే భాజపా 2014,2019,2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం సంఘ్ పరివార్ శిబిరానికి పెద్ద విజయంగా భావించొచ్చు.

2014 నుండి దేశంలో భాజపా నేతృత్వంలోని కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంఘ్ అధినేతగా భగవత్ ఆమోదముద్ర ఉండేది. ఆర్టికల్ 371 రద్దు, అయోధ్య రామాయలయ నిర్మాణం, 44 ఏళ్లుగా అమల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఎత్తివేత వంటివి కీలకం. మోడీ ప్రధానిగా సంఘం వైపు నుండి ఎటువంటి ఒత్తిడులు లేకుండా చూడటంలో భగవత్ తన వంతు పాత్ర పోషిస్తునే వస్తున్నారు. ఆర్ఎస్ఎస్ విస్తరణ, 2025లో సంఘం శత జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటుగా ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు రూపకల్పనలో తీరికలేకుండా గడుపుతున్నారు.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com