సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

- September 12, 2024 , by Maagulf
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

న్యూ ఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు సీతారాం ఏచూరి. గత నెల 19 నుంచి శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యతో ఏచూరి చికిత్స పొందుతున్నారు.

గత రెండు రోజులుగా ఆరోగ్యం విషమించింది, ఈనెల 9వ తేదీ నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. సీతారాం ఏచూరి శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ అవడంతో పాటు మందులకు ఆ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడంతో వైద్యులు విదేశాల నుంచి మెడిసిన్‌ తెప్పించినట్లు తెలిసింది. పలు విభాగాలకు చెందిన స్పెషలిస్టు వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.

ఏచూరి విద్యార్థి నాయకుడిగా దాదాపు 50 ఏళ్ల క్రితం సీపీఎంలో చేరారు. 2005 నుంచి 2015 వరకు వరుసగా మూడు సార్లు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2018లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు.

ఏచూరీ చెన్నైలో తెలుగు కుటుంబంలో 1952 ఆగస్టు 12న జన్మించారు. ఏచూరి హైదరాబాద్‌లో విద్యాభ్యాసం మొదలు పెట్టి, ఢిల్లీలో పూర్తి చేశారు. జేఎన్‌యూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రం చదివారు. 1975లో భారత్‌లో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు.

ఏచూరి మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్‌. ఆయన జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో పెళ్లి చేసుకున్నారు. ఏచూరికి ముగ్గురు సంతానం. సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్‌ ఏచూరి 2021లో మరణించారు. ఏచూరి మృతికి కమ్యూనిస్టు నేతలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com