రాజకీయ శౌరి...!

- September 18, 2024 , by Maagulf
రాజకీయ శౌరి...!

2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరుపున ఎంపీలుగా ఎన్నికైన ఇద్దరు నేతల్లో ఒకరు వల్లభనేని బాలశౌరి. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నికైన బాలశౌరికి, ఎంపీగా ఇది మూడో టర్మ్ ! జనసేన పార్లమెంటరీ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. నేడు బాలశౌరి జన్మదినం.

వల్లభనేనీ బాలశౌరి 1968, సెప్టెంబరు 18లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల వద్ద ఉన్న మోర్జంపాడు గ్రామంలోని కాపు కుటుంబంలో జన్మించారు. నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అనంతరం దూర విద్య ద్వారా డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బాలశౌరి రాజకీయాల్లోకి రాకముందు హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా, మైనింగ్, రియల్ ఎస్టేట్, పవర్ ప్లాంట్స్ నిర్మాణం వంటి పలు వ్యాపారాల్లో ఉన్నారు. ఇదే సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఏర్పడ్డ పరిచయం ఆయన్ని రాజకీయాల్లోకి నడిపించింది.

2004 లో తెనాలి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, అప్పటి టీడీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ను ఓడించి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో తెనాలి రద్దు కావడంతో వైఎస్ సలహా మేరకు నరసరావుపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013 లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2014లో గుంటూరు నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి రెండో సారి ఓటమి పాలయ్యారు. 2019లో జగన్ ఆదేశాల మేరకు మచిలీపట్నం నుంచి పోటీ చేసి రెండో సారి ఎంపీగా పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. 2019-24 మధ్యలో మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ లాడ్స్ ద్వారా నిధులు విడుదల చేయించారు. అయితే, వైసీపీ స్థానిక నేతలతో వచ్చిన విభేదాల కారణంగా 2024 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.

జనసేన ఉన్న ఎన్డీఏ కూటమి పొత్తుల్లో భాగంగా 2 లోక్ సభ స్థానాలు దక్కగా, అందులో బాలశౌరి ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నం ఒకటి. మచిలీపట్నం లోక్ సభ ఎన్నికల్లో జనసేన తరుపున మూడో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్లమెంట్ లో జనసేన పార్లమెంటరీ పార్టీ నేతగా బాలశౌరి ఉన్నారు.  ప్రస్తుతం సభార్డినెట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

బాలశౌరి వ్యకితగత జీవితానికి వస్తే ఆయన భార్య పేరు భానుమతి.వారికి ముగ్గురు కుమారులు. వల్లభనేని అనుదీప్, వల్లభనేని అరుణ్, వల్లభనేని అఖిల్.

బాలశౌరికి దేశంలోని అన్ని పార్టీల నేతలతో, వ్యాపారవేత్తలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సన్నిహితుడిగా మెలిగిన శౌరి చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని, తర్వాత కాలంలో ఆయనకు సన్నిహితుడయ్యారు. గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం నుండి బలమైన నేతలుగా ఎదిగిన మేడూరి నాగేశ్వరరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సరసన బాలశౌరి చేరారు. యాదృచ్చికంగా వీరు ముగ్గురు తెనాలి లోక్ సభ నుండి ఎంపీలుగా ఎన్నికవ్వడం విశేషం. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com