ఆంధ్ర విశారద...!

- September 19, 2024 , by Maagulf
ఆంధ్ర విశారద...!

చూడక నమ్మినవారు ధన్యులు అంటారు. కానీ, చూస్తేనే కదా అసలు విషయం తెలిసేదని వాదించేవారూ ఘనులే.హేతువును అన్వేషించడంలోనే ఆనందించేవారు ఇలాంటి ఘనులు. ఆ కోవకు చెందినవారు ఆంధ్ర విశారద తాపీ ధర్మారావు.తెలుగు సాహిత్యానికి తన రచనల ద్వారా ఉత్తేజాన్ని కలిగించిన గొప్ప దార్శనికుడు ఆయన. తెలుగు భాషలో కొత్త పదాలెన్నింటినో సృష్టించి ఖ్యాతి పొందిన వారిలో తాపీ తొలి పంక్తిలో ఉంటారు. తెలుగునేలపై హేతువాదులుగా పేరొందిన రచయితల్లో ధర్మారావు స్థానం ప్రత్యేకమైనది. నేడు సుప్రసిద్ధ రచయిత తాపీ ధర్మారావు గారి జయంతి.

తాపీ ధర్మారావు గారి పూర్తి పేరు తాపీ ధర్మారావు నాయుడు.1887 సెప్టెంబర్ 19న ఒరిస్సాలోని బర్హంపురం పట్టణంలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. శ్రీకాకుళం, పర్లాకిమిడి, విజయవాడలో ధర్మారావు విద్యాభ్యాసం సాగింది. పర్లాకిమిడిలో చదివే రోజుల్లో వ్యావహారిక భాషావేత్త గిడుగు రామమూర్తి పంతులు శిష్యరికం చేశారు. గురువు బాటలోనే పయనిస్తూ జనం భాషలోనే రచనలు సాగించారు ధర్మారావు. కల్లికోట రాజావారి కళాశాలలో ధర్మారావు గణితం బోధించారు ధర్మారావు. మిత్రులతో కలసి ‘వేగుచుక్క గ్రంథమాల’ను స్థాపించారు. 1911లో ధర్మారావు ‘ఆంధ్రులకొక మనవి’ పేరుతో ఓ రచన చేశారు. అదే ఆయన తొలి రచన. పలు పత్రికలను కూడా నిర్వహించారు.  

 “కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా” వంటివి తాపీవారి సంపాదకత్వంలోనే వెలుగు చూశాయి. రంగస్థలంలోనూ తాపీ ధర్మారావుకు మంచి ప్రవేశం ఉంది. ఆయన రచనలతో పలు నాటకాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు చిత్రపు నరసింహారావు పిలుపు మేరకు చిత్రసీమలో అడుగు పెట్టారు ధర్మారావు. ఆయన రచన చేసిన తొలి చిత్రం చిత్రపు నరసింహారావు దర్శకునిగా 1937లో రూపొందిన ‘మోహినీ రుక్మాంగద’. ఏకాదశీ వ్రత విశిష్టతను తెలిపే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తొలి సినిమాలోనే ధర్మారావు బాణీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వాన 1938లో రూపొందిన సంచలన చిత్రం ‘మాలపిల్ల’లో తాపీ ధర్మారావు రాసిన సంభాషణలు ఆ రోజుల్లో ప్రజల నాలుకలపై నాట్యం చేశాయి. గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో సంచలన చిత్రం ‘రైతుబిడ్డ’లోనూ తాపీ వారి మాటలు జనాన్ని మైమరిపించాయి. 1940లో వచ్చిన ‘ఇల్లాలు’ చిత్రం మంచి విజయం సాధించింది. అందులో తాపీవారు మాటలతో పాటు కొన్ని పాటలూ పలికించారు.

1943లో రూపొందిన ‘కృష్ణప్రేమ’లో నాటి మేటి నటి టంగుటూరి సూర్యకుమారి నారద పాత్ర పోషించడం విశేషం! అందులో ఆమె నోట తాపీ వారి పాట పలికి పరవశింప చేసింది. “గోపాలుడే…వేణుగోపాలుడే…”, “జేజేలయ్యా జోహారు కృష్ణా…”, “నీ మహిమలెన్న తరమా…”- వంటి కృష్ణభక్తిని చాటే పాటలు ధర్మారావు కలం పలికించగా, సూర్యకుమారి గానం చేశారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో కె.ఎస్.ప్రకాశరావు నిర్మించిన ‘ద్రోహి’లోనూ తాపీ వారి పలుకు, పాట రెండూ మురిపించాయి. ఇందులోని “చక్కలి గింతలు లేవా… చక్కని ఊహలు రావా…”, “ఎందుకీ బ్రతుకు…”, “ఇదేనా నీ న్యాయం…” వంటి పాటలు తాపీవారి కలం నుండి జాలువారినవే!

ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘కీలుగుర్రం’ చిత్రానికి తాపీ ధర్మారావు మాటలు-పాటలు సమకూర్చారు. “కాదు సుమా కలకాదు సుమా…”, “ఆహా అహో ఆనందమూ…”, “ఎంత కృపామతివే…”, “తెలియవశమా… పలుక తరమా…” వంటి పాటలు ఈ నాటికీ జనాన్ని పులకింప చేస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’కు కూడా తాపీ ధర్మారావు మాటలు రాశారు. తరువాత ఏయన్నార్ ‘పరమానందయ్య శిష్యుల కథ’, ‘రోజులు మారాయి’ చిత్రాలకు కూడా తాపీ ధర్మారావు రచన చేశారు.

‘రోజులు మారాయి’ చిత్రంలో ఆయన రాసిన “ఇదియే హాయి కలుపుము…”, “మారాజు వినవయ్యా…”, “చిరునవ్వులు విరిసే…”, “ఎల్లిపోతుంది ఎల్లి…” పాటలు కూడా ఆకట్టుకున్నాయి.‘రోజులు మారాయి’ చిత్రానికి దర్శకత్వం వహించిన తాపీ చాణక్య, ధర్మారావు గారి  తనయుడే. తెలుగు,తమిళం, హిందీలో చాణక్య తీసిన పలు చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. 1926లో తెలుగు భాషకు వారు చేసిన సేవలను గుర్తించి శృంగేరి పీఠాధిపతి ‘ఆంధ్ర విశారద’ బిరుదును ప్రదానం చేశారు. చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

ధర్మారావు స్వేచ్ఛప్రియుడు. స్వతంత్ర భావాలుగల వ్యక్తి. అందుకే తన జీవితంలో ఎన్నో ఇక్కట్లకు గురయ్యారు. తన సాహిత్యాభిలాషకు మరింత చేరువయిన పత్రికారంగాన్ని ఎంచుకున్నారు. ‘జనవాణి’ పత్రిక ద్వారా వ్యవహారిక భాషోద్యమానికి ఎనలేని సేవలందించారు. సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టే విధంగా ఈ పత్రికను తీర్చిదిద్దారు.‘కాగడా’ పత్రికను స్వయంగా స్థాపించారు. ఆరోజుల్లో వేలాదిమంది పాఠకులు ఈ పత్రికకోసం ఆసక్తిగా ఎదురుచూసేవారు. విశాలాంధ్ర దినపత్రిక వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. సంపాదకుల సంపాదకుడిగా తాపీ వారిని కీర్తించారు. వీరి కింద పనిచేసిన నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, పి.శ్రీరాములు వంటి వారు తర్వాతి కాలంలో ప్రముఖ పాత్రికేయులుగా ఆంధ్రనాట గుర్తింపు పొందారు.

తాపీ వారి  ముక్కుసూటి తనం చాలామందికి నచ్చక పోవచ్చు. కానీ, ఆయన కలం బలం తెలిసినవారు మాత్రం వారిని  అభిమానించకుండా ఉండలేరు.  ఆయన రాసిన ప్రతి పుస్తకం పెనుసంచలనమే. ఆ కాలంలో పలుకు రాళ్ల వంటి భాషతో రచనలు సాగేవి. పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంలో కుప్పలుగా కథలు, కథానికలు వచ్చేవి. యువత సైతం అదే మత్తులో కొట్టుకుపోతున్న సమయంలో తాపీ ధర్మారావు సరికొత్త సాహితీ సంచలనాలకు తెరతీశారు.

రోజూ చూస్తున్నా అంతగా పట్టించుకోని దేవాలయ శిల్ప రహస్యంపై ఆయన రచించిన ‘దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు’ నవల ఒక ప్రభంజనాన్నే సృష్టించింది. ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి, పరిశోధించి దాని లోతుపాతులను వెలికితీసి సమాజం ముందుంచారాయన. ఆ రోజుల్లో ఆలయాలపై వ్యాఖ్యానాలు చేయడమంటే అదో సాహసమే. అయినప్పటికీ గోపురాలపై ఉండే బొమ్మల లోగుట్టును విప్పి ప్రజలను చైతన్య పరచడంలో తాపీ ధర్మారావు విజయం సాధించారు. హేతువాదాన్ని, కార్యకారణ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో విజయం సాధించారు.

సమాజంలో పేరుకుపోయిన మూఢాచారాలపై పదునైన కలం బాణాలను విసిరి, చీకట్లను తొలగించి, హేతువాద భావాలకు విస్తృత ప్రాధాన్యం కల్పించారు. సాహితీవేత్తగా, చరిత్ర పరిశోధకునిగా, ఉపాధ్యాయునిగా, తెలుగు చలనచిత్రాల సంభాషణల రచయితగా ఆయన సేవలు వెలకట్టలేనివి.  తాపీ ధర్మారావు 1973 మే 8న భౌతికంగా వీడిపోయినా... సైద్ధాంతికంగా ఆయన చిరస్మరణీయుడు. తెలుగు భాషకు వారు చేసిన సేవలకు గుర్తుగా ఆనాటి నుండి వారి జయంతిని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
 
 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com