విలక్షణ నటుడు-రాజా రవీంద్ర

- September 19, 2024 , by Maagulf
విలక్షణ నటుడు-రాజా రవీంద్ర

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తి రాజా రవీంద్ర. తొలుత హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన నాటి నుంచి నేటి వరకు తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూనే ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన రాజా రవీంద్ర గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. సినిమాలే కాదు.. బుల్లితెరపైనా నటించి ఇంటిల్లిపాదిని అలరించారు. విలక్షణమైన నటనకు పెట్టింది పేరుగా నిలుస్తున్న సీనియర్ యాక్టర్ రాజా రవీంద్ర జన్మదినం నేడు.

 రాజా రవీంద్ర అసలు పేరు దంతులూరి రమేష్ రాజు. 1970,సెప్టెంబర్ 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జన్మించారు.రవీంద్ర పెదనాన్న భూపతిరాజు విజయకుమార రాజు ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ నాయకులు. బీమవరం నుండి రెండు సార్లు ఎమ్యెల్యేగా, నరసాపురం లోక్ సభ నుంచి హ్యాట్రిక్ ఎంపీగా విజయం సాధించారు. డెల్టా పేపర్ మిల్స్ మరియు అనేక వ్యాపారాలు కూడా ఉండేవి. రవీంద్ర ప్రాథమిక విద్యాభ్యాసం నుండి ఇంటర్మీడియట్ వరకు భీమవరంలోని సాగింది.  

రవీంద్ర సినిమాల్లోకి రాకముందు పెదనాన్న పేపరు మిల్లు వ్యవహారాల పట్ల చిన్నతనంలోనే ఆసక్తి ఏర్పడటంతో ఇంటర్‌ పూర్తయిన వెంటనే పేపరు మిల్లు మార్కెటింగ్‌ విభాగంలో ఉద్యోగిగా చేరాడు.పగలు ఉద్యోగం చేస్తూనే, రాత్రి నైట్‌ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు.చిన్నతనంలోనే కూచిపూడి డ్యాన్స్‌ నేర్చుకున్నారు. డిగ్రీ చదివే రోజుల్లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ యువజన పోటీల్లో ఆంధ్రా యూనివర్సిటీ తరపున ఫైనల్స్ లో పాల్గొని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ సమక్షంలో ప్రదర్శన ఇచ్చారు. రవీంద్రలోని ప్రతిభను గుర్తించిన ఆయన పెదనాన్న, చెన్నై వెళ్లేందుకు ప్రోత్సహించారు.

మద్రాసుకు షిఫ్ట్‌ అయ్యిన తర్వాత కూచిపూడి గురువైన వెంపటి చినసత్యం గారి దగ్గర శిక్షణ పొందారు. ప్రముఖ నటి ప్రభ కూడా వీరితో పాటే శిక్షణ తీసుకున్నారు. ‘ఈనాడు’ చిత్రాన్ని తీసిన ప్రముఖ దర్శకుడు సాంబశివరావు దర్శకత్వంలో ‘మృగతృష్ణ’ అనే సినిమాలో నూతన నటీనటుల కోసం చూస్తున్నారన్న విషయాన్ని సన్నిహితులు చెప్పడంతో ప్రయత్నించగా స్క్రీన్ టెస్ట్ చేసి హీరోగా తీసుకున్నారు. దర్శకుడే రాజా రవీంద్ర అని పేరు పెట్టారు. అలా ఆయన పేరు రాజా రవీంద్రగా స్థిరపడిపోయింది. ఎన్‌ఎఫ్‌డీసీ సహకారంతో తీసిన ‘మృగతృష్ణ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. కానీ థియేటర్లలో మాత్రం విడుదల కాలేదు. అయినా ఈ సినిమా ద్వారా రాజా రవీంద్ర ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన యముడికి మొగుడు, నేటి చరిత్ర చిత్రాల్లో చిన్న పాత్రలో నటించారు.‘మృగతృష్ణ’ సినిమా చూసి నిర్మాత  రామానాయుడు గారు శోభన్ బాబు హీరోగా నటించిన ‘సర్పయాగం’ చిత్రంలో కీలకమైన పాత్ర ఇచ్చారు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో రవీంద్రకు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అప్పటి నుంచి వరస ఆఫర్లతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిసుగా నటిస్తూ వచ్చారు. ఒక వైపు తెలుగులో చేస్తూనే తమిళ సినిమాలు చేస్తూ కోలీవుడ్ అగ్ర నటుల సరసన కీ రోల్స్ చేశారు. ఒకానొక దశలో తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ బిజీగా ఉండేవారు.

1995లో వచ్చిన పెద్దరాయుడు చిత్రం రవీంద్ర కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో కూడా అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే చిన్న సినిమాల్లో హీరోగా నటించారు. 2000వ సంవత్సరం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరింత బిజీగా మారడంతో హీరో రోల్స్ తగ్గించుకుంటూ వచ్చారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా నటించి ఇంటిల్లిపాదిని అలరించారు. తెలుగు, తమిళ సీరియల్స్ ప్రారంభ రోజుల్లో రవీంద్ర బుల్లితెర స్టార్ గా రాణించారు. సినిమాల్లో బిజీగా ఉండటంతో సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఇటీవల "సారంగదరియా" చిత్రంలో లీడ్ రోల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.  

రవీంద్ర సినిమాల్లో బిజీగా ఉంటూనే పలు హీరోలకు డేట్స్ చూస్తూ ఉంటారు. రవితేజతో మొదలైన ఈ సరికొత్త ప్రయాణం, తర్వాత కాలంలో ఇండస్ట్రీలోని పలువురు హీరో, హీరోయిన్లకు పర్సనల్ మేనేజర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం యువ హీరోలైన నిఖిల్, రాజ్ తరుణ్, మంచు విష్ణులతో పాటుగా పలువురికి పర్సనల్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

రాజా రవీంద్ర వ్యక్తిగత జీవితానికి వస్తే, సినిమాల్లోకి అడుగుపెట్టక ముందే తమ బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు వెంకట రమాదేవి. వారికి ఇద్దరమ్మాయిలు ప్రణతి, వాగ్దేవి. నటభూషణ్ శోభన్ బాబు గారిని ఆదర్శంగా తీసుకోని వ్యక్తిగత జీవితంలో ప్రశాంతంగా బతకాలని తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు. ఇండస్ట్రీలో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రమణ మహర్షి ఆధ్యాత్మిక బోధనలను రవీంద్ర బాగా ఇష్టపడతారు.

రాజా రవీంద్ర డొంక తిరుగుడు లేకుండా సూటిగా నిక్కచ్చిగా మాట్లాడారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ ‘‘ఒక పెద్ద హీరో కావటానికి అవసరమైన లక్షణాలన్నీ నీకున్నాయి.. అయినా కమర్షియల్‌ హీరో ఎందుకు కాలేకపోయావు’’ అని కొందరు అడుగుతూ ఉంటారు. బహుశా నేను నా కెరీర్‌ను అంత సీరియస్‌గా తీసుకోకపోవటం ఒక కారణం కావచ్చు. అయినా నాకు ఈ విషయంలో ఎటువంటి రిగ్రెట్స్‌ లేవు. తాను అనుకోకుండానే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తర్వాత రోజుల్లో నటన పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా విభిన్న పాత్రల్లో నటించడానికి అవకాశాలు దొరికాయన్నారు. ఈ తరం యంగ్‌ హీరోలకు సినిమా మీద ఉన్న ప్రేమ  చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్లందరు సినిమానే జీవితంగా బ్రతుకుతున్నారు అని అన్నారు.

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com