ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు రిలీఫ్

- September 20, 2024 , by Maagulf
ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు రిలీఫ్

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ కేవలం అపోహల మీద ఆధారపడి దాఖలైందని సుప్రీం కోర్టు పేర్కొంది. విచారణను ప్రభావితం చేశారనడానికి సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు, ఈ దశలో పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయడం లేదని వెల్లడించింది. రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారన్న అపోహ తప్ప, ఆధారాలు లేవని పేర్కొంది. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చునని తీర్పునిచ్చింది.

అలాగే, ఈ కేసు ప్రాసిక్యూషన్‌లో సీఎం రేవంత్ జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఏసీబీ కూడా ఈ కేసు, ప్రాసిక్యూషన్‌కి సంబంధించి రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని స్పష్టం చేసింది. స్పెషల్ ప్రాసిక్యూటర్‌కి ఏసీబీ పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపింది.

సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రాసిక్యూటర్ పనిచేయాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని, ఏసీబీ నేరుగా ఆయన పరిధిలోనే ఉంటుందన్న వాదనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఊరట పొందారు. ఈ కేసు విచారణలో మరింత స్పష్టత రావాలని ఆశిస్తున్నారు.

--వేణు పెరుమాళ్ళ(మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com