నవీన యుగపు మహాకవి....!

- September 21, 2024 , by Maagulf
నవీన యుగపు మహాకవి....!

‘దేశమంటే మట్టి కాదోయ్ .. దేశమంటే మనుషులోయ్’ అంటూ శతాబ్దం కిందట చాటిచెప్పిన కవి శేఖరుడు, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు. మనిషిని ప్రేమించడమే తన మతంగా చెప్పుకున్న మానవతామూర్తి గురజాడ అప్పారావు. ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం స్త్రీ కన్నీటి గాధలకు హేతువులు అంటూ 140 ఏళ్ల క్రితమే స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించిన దార్శనికుడు. నాటి సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలన్నిటినీ పారద్రోలేందుకు విప్లవాత్మక భావాలతో, సమాజ పునర్నిర్మాణానికి ఆకాంక్షిస్తూ కవిత్వాన్ని వినిపించిన మహాకవి గురజాడ. నేడు ఆయన జయంతి.

ప్రజాకవి గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న విజయనగరం సంస్థానం ఏలుబడిలోని ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో గురజాడ అప్పారావు జన్మించారు.గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా, గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. అప్పారావు తండ్రి విజయనగరం సంస్థానంలో పేష్కారుగా, రెవెన్యూ సూపర్వైజరు గాను, ఖిలేదారు గానూ పనిచేసారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామముర్తి పంతులు గురజాడకు సహ విద్యార్థి, మంచి మిత్రుడు.1882 - 84లో గురజాడ యఫ్. ఏ. పూర్తి చేసారు. అదే ఏడాది విజయనగరం మహారాజా వారి హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తి నుంచి1886లో మహారాజా కళశాల ఇంగ్లీషు లెక్చరర్‌గా చేరి కొద్ది కాలంలోనే మహారాజవారికి అంతరంగీకుడిగా మారారు.

విజయనగర సంస్థాన పాలకులైన పూసపాటి గజపతి రాజులతో గురజాడ వారికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.1887లో అప్పటి విజయనగరం పాలకుడైన మహారాజ సాహెబ్ మీర్జా రాజా శ్రీశ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు మన్నే సుల్తాన్ బహద్దూర్ గారి ప్రోద్బలంతో ఏర్పాటైన  విజయనగరం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో గురజాడ వారు మొదట ప్రసంగించారు. 1889లో విజయనగరంలో స్థాపించిన ఆనంద గజపతి డిబేటింగ్ క్లబ్బుకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.1891లో విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకునిగా గురజాడ వారిని రాజావారు నియమించారు. తర్వాతి కాలంలో ఆనంద గజపతి మహారాజా వారి ఆహ్వానం మేరకు సంస్థాన దివానుగా బాధ్యతలు చేపట్టారు.

విజయనగరం దివానుగా పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించారు.నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, బాల్యవివాహాలు, వర్ణవివక్ష, మూఢనమ్మకాల వంటి సామాజిక రుగ్మతలు సమాజాన్ని పీడిస్తున్న కాలం అది. సమాజ పునర్నిర్మాణాన్ని ఆకాంక్షించి రాజావారి మద్దతుతో విజయనగర సంస్థానంలో సంఘ సంస్కరణోద్యమాన్ని చేపట్టారు.1897లో రాజావారి హఠన్మరణంతో మనోవ్యధ చెందిన గురజాడ దివాను పదవికి రాజీనామా చేశారు. మద్రాస్ వెళ్లాలనుకుంటున్న సమయంలోనే రాజావారి సోదరి మహారాణి అప్పల కొండమాంబ అభ్యర్థన మేరకు వారికి వ్యక్తిగత కార్యదర్శిగా కొంత కాలం పనిచేశారు. గురజాడ వారి చివరి శ్వాస వరకు పూసపాటి రాజులతో సన్నిహితంగా మెలిగారు.

ప్రజలందరికీ అర్థమయ్యే జీవ భాషలో రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అతిగొప్ప సాహితీకారుడుగా పేరుగాంచారు. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను జొప్పించేందుకు కృషి చేసినవారిలో ముఖ్యునిగా పేరొందారు. ‘తిండి కలిగితే కండ కలదోయ్ .. కండ కలవాడె మనిషోయ్’ అంటూ ఆనాటి సమాజ పరిస్థితులను , ప్రజల కర్తవ్యాన్ని గుర్తుచేసిన అభ్యుదయవాది గురజాడ అప్పారావు.

1883లోనే గురజాడ సారంగధర అనే ఇంగ్లీషు కావ్యాన్ని రచించారు.1897లో కన్యాశుల్కం నాటకం ముద్రించి తనకు ఆత్మీయుడైన విజయనగరం పాలకుడు స్వర్గీయ మహారాజ సాహెబ్ మీర్జా రాజా శ్రీశ్రీ పూసపాటి ఆనంద గజపతిరాజు మన్నే సుల్తాన్ బహద్దూర్ కి అంకితమిచ్చారు. 1906లో కొండుభట్టీయం నాటకం, 1907లో నీలగిరి పాటలు,1909లో కన్యాశుల్కం రెండవ కూర్పు,1910లో ముత్యాలసరాలు,1911లో లవణరాజుకల,1912లో కన్యక రచించి ప్రచురించారు.1913లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫెలో పదవిని చేపట్టి విశ్వవిద్యాలయాలు - సంస్కృత మాతృభాషలు అనే నివేదిక సమర్పించారు.

ఆయన రచనలన్నీ వేటికవే ఆణిముత్యాలు. గురజాడ రచనలన్నీ నష్టమైపోయి ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలు, అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించదగిన మహాకవి అని రుజువు కావడానికి అన్నారు శ్రీశ్రీ. ఒక్కో రచన ఒక్కో సమస్యను చర్చిస్తుంది. ముత్యాలసరాల ఛందస్సులో ఉన్న లవణరాజుకల వర్ణవ్యవస్థను ప్రశ్నిస్తుంది. కాసులు, కన్యక, పూర్ణమ్మ, దేశభక్తి మొదలైన గేయాలు చిరస్మరణీయాలు.

బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చునో - వాడె ధన్యుడు అంటూ మానవత్వాన్ని వినిపించినా, కలిసి మెసగిన యంత మాత్రనె, కలుగబోదీ యైకమత్యము; మాల మాదిగ కన్నె నెవతెనొ మరులుకొన రాదో అంటూ కులాంతర సమాజాన్ని ఆకాంక్షించినా, మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును అంటూ అభ్యుదయాన్ని కలగన్నా, మలిన దేహుల మాలలనుచును, మలిన చిత్తుల కధిక కులముల అంటూ వర్ణ ధర్మాన్ని నిరసించినా, అవన్నీ గురజాడ అప్పారావు అభ్యుదయ దృక్పథానికి, తాత్విక ధోరణికి నిదర్శనాలు.

ఆంధ్రదేశాన ఎందరో అభ్యుదయ కవులకు, రచయితలకు స్ఫూర్తిగా నిలిచిన గురజాడ వారు 1915 నవంబర్ 30 న అనారోగ్యం కారణంగా 53 సంవత్సరాల వయసులో మరణించారు.ప్రాచీన కవుల్లో వేమన అటువంటివారు.. మళ్లీ ఈనాడు గురజాడ అప్పారావు అలాంటివారు అన్నారు శ్రీశ్రీ.. తెలుగు ప్రజల స్ఫూర్తి పథంలో అప్పారావు ఎల్లప్పుడూ జీవిస్తారు. చనిపోయినప్పటికీ అతను జీవిస్తున్నాడు అని గిడుగు రామమూర్తి అన్నట్టుగా ప్రజల నాలుకలపై గురజాడ సదా జీవిస్తూనే ఉంటారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com