ఇండియన్ సెల్యూలాయిడ్ సైంటిస్ట్....!
- September 21, 2024
ఆయన సినిమాలు నవజీవన బృందావనాలు.. ఆ చలనచిత్రాలు చిట్టి కోయిలల కుహు కుహూ గానాలు. ఆశల రెక్కలతో పైకి ఎగసే పుష్పక విమానాలు. జాబిల్లిని అందించే జానపదాలు.కాలాన్ని కట్టేసి, లోకాలు చుట్టేసి.. ఊహాజగత్తు.. గమ్మత్తులు ఆవిష్కరించిన ఆధునికుడు, సినీ ప్రేక్షక లోకాన్ని త్రికాల యంత్రంతో మంత్రముగ్ధుల్ని చేసిన కాలజ్ఞాని. దశాబ్దాల తెలుగు సినిమా పరిణామ క్రమానికి ప్రత్యక్ష సాక్షి. టాకీ యుగంలో మూకీ సినిమా తీసిన సాహసి. ఆధునిక సాంకేతికతకు సహవాసి. నవ్యతను శ్వాసించి, ప్రయోగాలను ప్రేమించి, అద్భుతాలు ఆవిష్కరించిన సినీ తపస్వి. కళా యశస్వి. వెండితెర దరహాసం సింగీతం శ్రీనివాసరావు. నేడు ఇండియన్ సెల్యూలాయిడ్ సైంటిస్ట్ సింగీతం శ్రీనివాసరావు గా జన్మదినం.
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు.ఆయన తండ్రి ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయులు. తల్లి వయోలిన్ లో ప్రవీణురాలు. ఆ ఇంట సంగీత, సాహిత్య, సాంస్కృతిక స్పర్శతో సింగీతం... తను చదివే స్కూల్లో లవకుశ నాటకంలో లవ పాత్ర వేశారు. అదే సమయంలో టూరింగ్ టాకీస్ లో చూసిన 'సీతాకల్యాణం', 'శ్రీకృష్ణ లీలలు' సినిమాలు ప్రగాఢ ముద్రవేశాయి. అప్పుడే ఆకాశవాణిలో సాలూరి రాజేశ్వరరావు పాడిన లలితగీతం చల్లగా మనసు తాకింది. ఆ తీయని మధుర భావనలను సింగీతం హృదయంలో భద్రపర్చుకున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్ చదువుకున్నారు.
డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలం సూళ్లూరు పేట ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేశారు. ఆ సమయంలో తన విద్యార్థులతో తాను రాసిన నాటకాలు వేయించేవారు. అలా దర్శకత్వంపై మక్కువ పెరిగింది. కొంతకాలం ‘తెలుగు స్వతంత్ర’లో రచనలు చేశారు. ఆ తరువాత పట్టుదలతో చిత్రసీమలో అడుగుపెట్టారు. దర్శకబ్రహ్మ కేవీ రెడ్డి ని ఆశ్రయించారు. సింగీతంలోని చురుకుతనం చూసిన కేవీ రెడ్డి తన అసోసియేటుగా అవకాశం కల్పించారు.
ఈ నాటికీ మేటి చిత్రంగా నిలచిన కేవీ రెడ్డి తెరకెక్కించిన ‘మాయాబజార్’ చిత్రానికి సింగీతం తొలిసారి పనిచేశారు. పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర చిత్రాల్లో పనిచేస్తూ దర్శకత్వ నైపుణ్యాలు నేర్చారు. ప్రముఖ కవి పఠాభి కన్నడలో ‘సంస్కార’ చిత్రాన్ని రూపొందించే సమయంలో సింగీతం శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అలా కన్నడ చిత్రసీమతోనూ అప్పుడే అనుబంధం ఏర్పడింది. ఒకానొక సమయంలో సింగీతం కన్నడ చిత్రాలకే అంకితమయ్యారు అనిపించింది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారితో ఆయన అత్యధిక చిత్రాలను తెరకెక్కించారు.సింగీతం శ్రీనివాసరావు రాజ్ కుమార్ ముగ్గురు కుమారులు పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ రాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ లతో సినిమాలు చేశారు. ఈ సినిమాలన్నీ రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ నిర్మించడం విశేషం!
దర్శకుడికి స్క్రీన్ప్లే కూడా తెలిసి ఉంటే చేసే కృషి వెండితెరపై ప్రతిఫలిస్తుందని ప్రపంచ సినీ దిగ్గజం అకిరా కురసోవా నేర్చిన పాఠం సింగీతానికి స్ఫూర్తినిచ్చింది. తన దర్శకత్వ ప్రతిభను ప్రేక్షకలోకానికి చాటాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్న సమయం అది. కేవీ వద్ద పనిచేసే రోజుల్లో సింగీతం శ్రీనివాసరావును ఎన్టీఆర్ ‘చిన్న గురూ’ అంటూ ఉండేవారు. సింగీతంను దర్శకునిగా చేయాలని ఎన్టీఆర్ కూడా ప్రయత్నించారు. కానీ, ఎందువల్లో ఆ ప్రయత్నాలు కలసి రాలేదు.1972లో కృష్ణంరాజు-కాంచన కాంబినేషన్లో నీతి-నిజాయతీ చిత్రంతో సింగీతం దర్శకునిగా పరిచయం అయ్యారు.
‘నీతి-నిజాయితీ’కి మంచి పేరు వచ్చిందే కానీ, ఆర్థికంగా లాభాలు చూడలేకపోయింది. రెండవ చిత్రంగా తమిళంలో ‘ధిక్కట్ర పార్వతి’ రూపొందించారు. ఈ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది. అయితే బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం సింగీతంతో దోబూచులాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రంగనాథ్, శారద జంటగా ‘జమీందార్ గారి అమ్మాయి’ చిత్రం రూపొందించారు సింగీతం. ఈ సినిమా ఫరవాలేదనిపించింది. తరువాత వచ్చిన ‘ఒక దీపం వెలిగింది’ కూడా ఆకట్టుకోలేకపోయింది.
సింగీతం దర్శకత్వంలో రూపొందిన ఐదవ చిత్రం ‘అమెరికా అమ్మాయి’. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత సింగీతం తెరకెక్కించిన “తరం మారింది, పంతులమ్మ, అందమె ఆనందం, సొమ్మొకడిది సోకొకడిది!” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలయినా, ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. సింగీతం అంటే ప్రయోగాలు చేస్తారనే ముద్ర అప్పుడే పడింది. ఈ నేపథ్యంలోనే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ఆయన దర్శకత్వంలో ‘మయూరి’ రూపొందించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు సింగీతంకు మంచి పేరూ సంపాదించి పెట్టింది.
‘మయూరి’ విజయంతో సింగీతంకు మరిన్ని ప్రయోగాలు చేయాలన్న అభిలాష అధికమయింది. 1988లో టాప్ హీరోస్ అందరూ ఫార్ములా మూవీస్ తో రంగురంగుల దుస్తులు ధరించి పాటల హోరులో సాగిపోతున్నారు. తమిళ స్టార్ కమల్ హాసన్ హీరోగా సింగీతం మాత్రం ‘పుష్పక విమాన’ అనే మూకీ చిత్రాన్ని రూపొందించారు. కమల్ హాసన్ సైతం ప్రయోగాలంటే ఆసక్తి చూపించేవారే కాబట్టి, సింగీతం ఆలోచనకు సై అన్నారు అలా ‘పుష్పకవిమానం’ ఎక్కి అన్ని భాషల వారినీ విజయవంతంగా పలకరించారు.ఇందులో కమలహాసన్ నటన నభూతో నభవిష్యతి. నిరుద్యోగి చిత్త ప్రవృత్తికి చిత్రం. నిరుద్యోగి కంటే యాచకుడి బ్రతుకే నయం అన్న అర్ధంలో తీసిన ఈ దృశ్యంలో కమలహాసన్, సీనియర్ నటుడు పీఎల్ నారాయణ అపూర్వంగా నటించారు. అదే నిరుద్యోగి అతడికి జవాబివ్వటం దర్శక ప్రతిభకు నిదర్శనం. సింగీతం, కమల్ కాంబోలో “విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు కథ” వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో కమల్ పలు పాత్రలు పోషించడం విశేషం. బాక్సాఫీసు వద్ద కూడా ఈ చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి.
తమిళంలో కమల్ తో ప్రయోగాలు చేసిన సింగీతం శ్రీనివాసరావుకు తెలుగులో అలా సాగడానికి బాలకృష్ణ దొరికారు. మాస్ హీరోగా సాగుతున్న బాలకృష్ణతో సింగీతం తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ మంచి విజయం సాధించడమే కాదు, ఈ నాటికీ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో భూతభవిష్యత్వర్తమాన కాలాల్లో టైమిషన్ లో పయనించి వినోదం పంచేలా చేశారు. ఇందులోనే బాలకృష్ణతో శ్రీకృష్ణదేవరాయలు వంటి చారిత్రక పాత్ర పోషింపచేశారు. ఆ తరువాత బాలకృష్ణతో ‘భైరవద్వీపం’ వంటి భారీ జానపదం తీసి ఘనవిజయం సాధించారు. ఆపై ‘శ్రీకృష్ణార్జున విజయం’లో బాలయ్యను శ్రీకృష్ణ, అర్జున పాత్రల్లో చూపించి మురిపించారు. ఇలా మూడు సినిమాలతోనే బాలకృష్ణతో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలు చేసిన ఘనత కూడా సింగీతం సొంతమయింది.
సింగీతానికి, సంగీతానికి సంబంధం ఏమిటి? కొత్తవాళ్లు వింటే ఇంటిపేరు తప్పు పలికారేమో అన్పిస్తుంది. అమర గాయకుడు పీబీ శ్రీనివాస్ మాటల్లో చెప్పాలంటే సంగీతమంతా రాశిగా పోస్తే 'సింగీతం'. అందుకే కాబోలు ఆయన సినిమాల్లో కుదిరితే ఒక వీణపాట. వీలయితే వేణుగానం. లేదంటే వాయులీనం. సాలూరి వారి సాహచర్యం వల్ల కావచ్చు.. వీణలు వేణువుల సరిగమలు, నారద వీణలతోనో, శారద వీణలతోనో స్వరమధురిమలు, సయ్యాటలు..యాంత్రిక జీవన శైలి నుంచి.. కాసేపు సేదతీరుస్తాయి.
సింగీతం..సంగీతం. అవినాభావసంబంధం. సంగీత సంగతులు, భాషలు, మేళకర్తల రాగాలన్నీ గుదిగుచ్చి, సమ్మేళనం మార్చి, సింఫనీలుగా ఘోషపలికిస్తే... ఆయన సింగీతం శ్రీనివాసరావు. అందుకే ఆయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలలో వీణ వేణువుల సమ్మేళనాలు, వాయులీనాలు..గంగా,యమునా, సరస్వతుల్లా, ..స్వర..స్వతుల్లా.. మంద్రంగా, మధురంగా, సుమధురంగా ప్రవహిస్తాయి. చిట్టి కోయిలలు శృతి చేసుకొని శృతిపక్వగీతం కోసమో, సంగీతం కోసమో ఎదురు చూస్తాయి.
‘భైరవద్వీపం’ చిత్రంలో “విరిసినదీ వసంతగానం…” పాటతో గీతరచయిత అయ్యారు. కన్నడలో రాజ్ కుమార్ నటించిన ‘భాగ్యాద లక్ష్మీ బారమ్మా’ చిత్రానికి దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించారు. రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ హీరోగా రూపొందిన ‘సంయుక్త’ చిత్రానికి దర్శకత్వం చేయకపోయినా పాటలకు స్వరకల్పన చేశారు సింగీతం. ‘మైఖేల్ మదన కామరాజు కథ’లో ఆరంభంలోనే “కథ చెబుతా… కథ చెబుతా…” అంటూ బైస్కోప్ చూపించే మనిషిగా పాట పాడుతూ నటించారు సింగీతం. “మయూరి, భైరవద్వీపం” చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారాయన. అలాగే “మయూరి, బృందావనం” చిత్రాల ద్వారా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గానూ ఆయనకు నంది అవార్డులు లభించాయి.
2012 బి.యన్.రెడ్డి నేషనల్ అవార్డు అందుకున్నారు. సింగీతం తెరకెక్కించిన అనేక చిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితమయ్యాయి.ఎనభై మూడేళ్ల వయసులో యానిమేషన్ నేర్చుకుని ఘటోత్కచ్ సినిమా తీశారు. మాయాబజారులోని వివాహభోజనంబు పాటను అవే బాణీలలో ఎస్పీ బాలు వీనులవిందు చేస్తే సింగీతం శ్రీనివాసరావు కనువిందు చేశారు. ఇప్పటికీ తన ఆలోచనలకు అక్షరరూపం ఇస్తూ ఉంటారు సింగీతం. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ రూపొందించబోయే చిత్రానికి సింగీతం దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే ‘ఆదిత్య 369’ సీక్వెల్ గా రూపొందబోయే ‘ఆదిత్య 999’కు కూడా సింగీతం స్క్రిప్ట్ విషయాల్లో బాలయ్య ఆహ్వానం మేరకు పాలు పంచుకున్నారు.
ఫ్యాషను, ప్యాషను కలగలిపిన సింగీతం 90 వసంతాల నవయువకుడు. వయసు శరీరానికే. మనసుకు కాదు. ఇప్పటికీ కళ్లలో అదే మెరుపు. సినిమానే ఈయన భాష. శ్వాస. రేడియోలు, ఆడియోలు, వీడియోలు, ఇంటర్ నెట్ యుగంలో సీడీలు, పెన్ డ్రైవుల కాలం వరకు ఎన్నో మార్పులను చూసిన ప్రత్యక్షసాక్షి. తొలి టాకీ రూపశిల్పి హెచ్ ఎం రెడ్డి తర్వాత, మూకీలకు టాకీలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక్క దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన జీవితం భారతీయ సినిమా పరిణామక్రమాలకు ఒక రిఫరెన్సు పుస్తకం. టాకీ యుగంలో మూకీ యుగం సినిమా తీసినా, మూడు కాలాలలో ఏడేడు లోకాలు చుట్టి వచ్చే కాలయంత్రంతో చిత్రం తీసినా సింగీతానికి సింగీతమే సాటి. ఆయన భారతీయ సినీరంగ ఖ్యాతి.సింగీతం మరిన్ని వసంతాలు చూస్తూ మరింత హాయిగా సాగాలని ఆశిద్దాం.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..