హైదరాబాద్ శివారు నుంచి దసరాకు ప్రత్యేక బస్సులు
- September 30, 2024
హైదరాబాద్: ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్,ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ,తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది.
దసరా పండుగకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తమ క్షేత్ర స్థాయి అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు.ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, గతంలో మాదిరిగానే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ పండుగలకు 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు.
అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున..9,10,11 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్నీ ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. రద్దీ రోజుల్లో ఎన్‌హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దసరాకు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించుకోవాలన్నారు.
“గత దసరాతో పోల్చితే ఈసారి మహాలక్ష్మి పథకం అమలుతో పాటు అక్టోబర్ నెలలో 11 శుభముహుర్తాలు కూడా ఉన్నాయి. ఆ రద్దీకి తగ్గట్టు బస్సులను నడపాలని సంస్థ ముందుగానే ప్లాన్ చేసింది. ఈ సారి అందుకే బతుకమ్మ, దసరా పండుగలకు 6 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతున్నాం.” అని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ అన్నారు.
పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.ఈ టీజీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtbus.inలో చేసుకోవాలని సూచించారు.దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం తమ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







