పౌరాణిక చిత్రాల బ్రహ్మ
- October 04, 2024
వెండితెర మీద మీద పౌరాణికాలను అద్బుతంగా తెరకెక్కించిన ఘనాపాటి కమలాకర కామేశ్వరరావు. మన భావాల్ని వ్యక్తపరచడానికి భాష వుంది. ఆ భాషను అందమైన క్రమ పద్ధతిలో పలకడానికి, రాయడానికి వ్యాకరణం వుంది. భాషకే కాదు కళలకు కూడా వ్యాకరణం ఉంటుంది. అందులోనూ సకల కళల సమాహారమైన చలనచిత్రం అందర్నీ ఆకట్టుకునేలా, చెప్పే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆ చలనచిత్ర రూపశిల్పికి ఈ వ్యాకరణం తెలిసి వుండడం చాలా అవసరం. అటువంటి చలనచిత్ర వ్యాకరణాన్ని ఔపోసన పట్టిన దర్శక అగస్త్యుడు కామేశ్వరరావు గారు. నేడు పౌరాణిక చిత్రాల బ్రహ్మగా ప్రసిద్ధి గాంచిన దిగ్గజ దర్శకులు కమలాకర కామేశ్వరరావు జయంతి.
కమలాకర కామేశ్వరరావు 1911, అక్టోబర్ 4న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ ప్రాంతంలో భాగమైన అవిభక్త కృష్ణా జిల్లాలోని బందరు(మచిలీపట్నం)లో జన్మించారు. బందరులోని ప్రముఖ నోబుల్ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. చిన్నతనంలోనే రామాయణం, భారత, భాగవతాలను ఔపోసన పట్టారు.ఆయనకు చిన్నతనం నుంచీ లలితకళలపట్ల ఎనలేని అభిమానం ఉండేది. ఇదే సమయంలో భారతదేశంలో ఊపందుకున్న సినిమా రంగం గురించి, అందులో ప్రవేశించేందుకు ఉన్న అవకాశాలను గురించి అనేక విషయాలను తెలుసుకుంటూ సినిమా రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
బందరులో ప్రదర్శించే మూకీలో విడుదలైన ప్రతి చిత్రాన్ని కామేశ్వరరావు గారు ఆసక్తిగా చూసేవారు. కామేశ్వరరావు గారి ఆసక్తిని గమనించిన ప్రముఖ పాత్రికేయుడు ముట్నూరి కృష్ణారావు పంతులు గారు, తన ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణా పత్రికలో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు రాసేందుకు అవకాశం కల్పించారు. బందరు, బెజవాడ(విజయవాడ)ల్లో సినిమాలు చూసొచ్చి ఆయా చిత్రాల్లో ఉన్న కథా కథనంలో ఉన్న లోటుపాట్లు గురించి, సాంకేతిక అంశాల గురించి కూలంకషంగా రాసేవారు. ఆయన సినిమాలపై ఇచ్చే నిస్పక్షపాతమైన సినీ రివ్యూల కోసమే చాలా మంది కృష్ణా పత్రికను కొనేవారు. 'బాగుంది' అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, లేదంటే ఆ చిత్రం వైపు చూసేవారు కాదు.
1936లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "ద్రౌపదీ వస్త్రాపహరణం", "ద్రౌపదీ మానసంరక్షణం" చిత్రాలను సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలోవరసగా నాలుగు సంచికల్లో రాసిన రివ్యూలు నాటి తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. వాస్తవానికి 'వస్త్రాపహరణం' చిత్రం ఆర్థికంగా విజయవంతమైంది, 'మానసంరక్షణం' చిత్రం దెబ్బతిన్నది. కానీ వీరు 'మానసంరక్షణం' చిత్రాన్ని 'వస్త్రాపహరణం' కంటే మంచి చిత్రమని ప్రశంసించారు. అందుకు సంబంధించి వీరు రాసిన వివరణ నాటి ప్రముఖులైన నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం గార్లు ప్రశంసించారు.
సినీ రివ్యూలు రాస్తున్నప్పటికి సినిమాల్లోకి వెళ్ళాలనే స్థిర నిశ్చయంతో కృష్ణారావు పంతులు గారి అనుమతి తీసుకొని మద్రాస్ బయలుదేరారు. రోహిణి సంస్థ అధినేత హెచ్.ఎం.రెడ్డి గారి ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1938 లో హెచ్.ఎం.రెడ్డి గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన గృహలక్ష్మి చిత్రానికి పనిచేశారు.రోహిణిలో పనిచేస్తున్న సమయంలోనే ఎ.కె.శేఖర్, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు పరిచయమయ్యారు. గృహలక్ష్మి సమయానికి కె.వి.రెడ్డి గారు సైతం రోహిణిలో క్యాషియర్ గా పనిచేసేవారు. ఆయనతో ఏర్పడ్డ సన్నిహిత పరిచయం కామేశ్వరరావు గారి జీవితంలో పెద్ద మలుపు.
గృహలక్ష్మి చిత్రం తర్వాత బి.ఎన్.రెడ్డి, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు గారు సహాయ దర్శకుడుగా చేరారు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు.ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియో గాపేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు వీరు కూడా ఉన్నారు. వాహినీ వారి అత్యధిక చిత్రాల్లో సహాయక దర్శకుడిగా పనిచేసిన ఘనత సైతం వీరికే దక్కుతుంది. కె. వి. రెడ్డి గారు దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వద్ద ‘పాతాళభైరవి’, ‘గుణసుందరి’ చిత్రాలకు స్క్రీన్ ప్లే వ్రాయడం, సహాయక దర్శకత్వ బాధ్యతలను ఎంతో సమర్ధంగా నెరవేర్చారు. తన దర్శకత్వ విధానంలో తనపై కె. వి. రెడ్డి గారి ప్రభావం ఉందని చెప్పేవారు.
కామేశ్వరరావు గారి ప్రతిభను గుర్తించిన విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణిలు "చంద్రహారం" చిత్రానికి దర్శకునిగా తొలి అవకాశం కల్పించారు. చంద్రహారం చిత్రం విజయవంతం కాకపోయినా దర్శకుడిగా వీరు పరిశ్రమలో స్థిరపడ్డారు. కామేశ్వరరావు గారికి దర్శకుడిగా తొలిసారి బ్రేక్‌నిచ్చిన చిత్రం ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించిన ‘పాండురంగ మహత్మ్యం’. ఈ చిత్రంతో తానేమిటో నిరూపించుకోవాలని ఆయన ఎంతో తపించారు. అలాగే ఎన్టీ రామారావు తాను ఆల్‌రౌండర్‌నని ఈ చిత్రం ద్వారానే నిరూపించుకున్నారు. ఎన్టీ రామారావు కూడా భక్తిరస పాత్రలను అద్భుతంగా పోషించగలరని పాండురంగ మహత్మ్యం నిరూపించింది. ఇందులో భక్తపుండరీకునిగా ఎన్టీఆర్ నటించారు. ఈ చిత్రం తరువాత కామేశ్వరరావు మరి వెనుతిరిగి చూడలేదు.
ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. రేచుక్క- పగటిచుక్క, మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, పాండవ వనవాసం, పాండురంగ మహాత్యం, నర్తనశాల, శ్రీ కృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం, బాల భారతం లాంటి ఎన్నో అపురూపమైన జానపద, పౌరాణిక, సాంఘీక చిత్రాలను తెరకెక్కించారు. అయితే, ఆయనకు పౌరాణిక చిత్రాల ద్వారా విశేషమైన కీర్తి లభించడంతో పాటుగా "పౌరాణిక చిత్రాల బ్రహ్మ" బిరుదును అందుకున్నారు.
కామేశ్వరరావు గారి దర్శకత్వంలో అత్యధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడు నటరత్న ఎన్టీఆర్. తెలుగు తెర మీద విజయవంతమైన కాంబినేషన్లలో వీరిది ప్రథమ స్థానంలో నిలుస్తుంది. మాయాబజార్ చిత్రంతో ఎన్టీఆర్ గారిని కృష్ణుడిగా కె.వి. రెడ్డి గారు చూపించి విజయవంతంగా కాగా, తెలుగునాట కృష్ణుడంటే ఎన్టీఆర్ అనేలా చేసింది మాత్రం కామేశ్వరరావు గారే! వీరి కాంబినేషన్లో వచ్చిన జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ స్వంత బ్యానర్ అయిన ఎన్.ఏ. టి పిక్చర్స్ ఆస్థాన దర్శకుడిగా సైతం చాలా కాలం కొనసాగారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో వెళ్ళినా తర్వాత వీరి స్నేహం కొనసాగింది.
కామేశ్వరరావు గారి దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నాయి. 'నర్తనశాల’ చిత్రానికి జాతీయస్థాయిలో రెండో ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. దక్షిణ భారత దేశంలో మొట్టమొదటిసారిగా ఒక చిత్రానికి దక్కిన గౌరవం అది. 1964లో ఇండోనేషియా దేశ రాజధాని జకార్తా నగరంలో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో సైతం ప్రదర్శించబడింది.
తెలుగు తెర మీద అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన కామేశ్వరరావు గారు అతి నిరాడంబరంగా ఉండేవారు. ఎన్నో హిట్ సినిమాలు తీసినా నిర్మాత ఎంత ఇస్తే అంతే తీసుకున్నారుగాని, ”ఇంత ఇస్తే గాని చెయ్యను” అని ఏనాడూ అనలేదు! అందుకే కాబోలు ఆ రోజుల్లో ఆయనతో పాటు ఉన్న దర్శకులందరికీ సొంతిల్లు, సొంత కారున్నా ఆయనకు మాత్రం లేవు. షూటింగ్స్ లేకపోతే, నిత్యం పుస్తక పఠనంలో మునిపోయేవారు. స్క్రిప్టు క్షుణ్ణంగా తయారుచేసుకుని షూటింగ్‌కి వచ్చేవారు. ఆరోజుల్లో ”కె.వి.రెడ్డి గారి తర్వాత, స్క్రీన్ ప్లే రూపొందించడంలో కామేశ్వరరావుగారే” అని చెప్పుకునేవారు. నటులు, ఇతర శాఖల వాళ్ళు కామేశ్వరరావు గారిని ఎంతో పూజ్యభావంతో చూసేవారు.
తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే పోయే ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందజేసిన కమలాకర కామేశ్వరరావుగారు 1998 జూన్ 29న మరణించారు. ఆయన రూపొందించిన అనేక పౌరాణిక చిత్రాలు నేటికీ పండగ పర్వదినాల సమయంలో బుల్లితెరపై ప్రత్యక్షమై మనకు కనుల విందు చేస్తుంటాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!