రతన్ టాటా (Ratan Tata)..
- October 10, 2024
రతన్ టాటా (Ratan Tata).. ఈ పేరంటే సగటు భారతీయుడికి చాలా ఇష్టం. ఒక వ్యాపారవేత్తగానో.. లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానో కాదు.. మానవతామూర్తిగా.సోషల్ మీడియాలో టాటాకు పెద్ద ఫ్యాన్‌బేసే ఉంది. ఆయన చేసే ప్రతి చిన్న పనిలోను సమాజం పట్ల బాధ్యత కనిపిస్తుంది. నానో ఆవిష్కరణ.. తాజ్ హోటల్.. సోషల్ మీడియా.. ఇలా చెప్పుకొంటూపోతే ఆ జాబితా చాలా ఉంటుంది. ముఖ్యంగా సమాజాన్ని సరైన దిశలో నడిపేందుకు ఆయన చివరి రోజుల వరకు తనకు చేతనైనంత ప్రయత్నం చేశారు.
ఆ యువతికి రక్షణగా ఏకంగా ఛోటూనే..!
రతన్ టాటాకు ఇన్‌స్టాలో ఖాతా ఉంది. దానికి ఫాలోవర్ల సంఖ్య మిలియన్ దాటిన సందర్భంగా ధన్యవాదాలు చెబుతూ ఆయన ఒక ఫొటో పోస్టు చేశారు. వినయంగా నేలపై కూర్చొని నవ్వుతున్న ఫొటోను పోస్టు చేశారు. ‘అనుకోకుండా దొరికిన అద్భుతమైన కుటుంబం’ అని ఆ మైలురాయిని అభివర్ణించారు. దీనికి ఓ యువతి స్పందిస్తూ.. ‘కంగ్రాట్చ్యూలేషన్స్ ఛోటూ’ అని ఓ హార్ట్ ఎమోజీని జత చేసింది. దీంతో రతన్ టాటాతో అమర్యాదగా వ్యవహరిస్తావా.. ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో భయపడిపోయిన ఆ యువతి కామెంట్‌ను డిలీట్ చేసింది. ఇది టాటా వరకు వెళ్లింది. దీంతో ఆయన ఆమె రక్షణకు స్వయంగా రంగంలోకి దిగారు. ఓ సుదీర్ఘ ఇన్‌స్టా స్టోరీని షేర్ చేశారు. ‘‘నిన్న ఒక అమాయక యువతి తన మనోభావాలను హృదయపూర్వకంగా వ్యక్తం చేసింది. నన్ను ‘కిడ్’గా సంబోధించింది. ఈ కారణంగా ఆమెను వేధించారు. దీంతో సదరు యువతి ఆ కామెంట్‌ను తొలగించింది. కానీ, ఆమె చేసిన కామెంట్‌ను గౌరవిస్తాను, అభినందిస్తాను. ఆమె భవిష్యత్తులో కూడా నిర్భయంగా పోస్టింగ్‌లు చేయవచ్చు’’ అని అండగా నిలిచారు.
పసిప్రాణాల అవస్థలు చూసి నానో..
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నానో కారు ఆవిష్కరణ వెనక కూడా టాటా సేవాదృక్పథం దాగి ఉంది. ఒక సందర్భంలో ఆయన తన ఇన్‌స్టా పోస్టులో ఆ కారు తయారీ వెనక ఉన్న ఆలోచనను పంచుకొన్నారు. ‘‘నానో లాంటి వాహనాలను తయారుచేయాలన్న కోరిక వెనక నాకు ప్రేరణ ఏంటంటే.. చాలా కుటుంబాలు తరచూ తమ పిల్లలతో కలిసి స్కూటర్లపై వెళ్లడాన్ని నేను చూస్తుండేవాడిని. తల్లీతండ్రి మధ్యలో కూర్చున్న పిల్లలు నలిగిపోతున్నారేమో అని నా మనసుకు అనిపించింది. గుంతలుగా ఉండే రోడ్లపైనా వారు అలాగే ప్రయాణించడం చూసి నాకో ఆలోచన తట్టింది. ముందు మేం ద్విచక్ర వాహనాలను ఎలా భద్రంగా మార్చాలనే దానిపై దృష్టిపెట్టాం. ఆ తర్వాత నాలుగు చక్రాలు ఉండి.. కిటికీలు, డోర్లు లేకుండా కేవలం బగ్గీల్లాంటి వాహనాలను రూపొందించాలనుకున్నాం. కానీ చివరకు కారునే తయారుచేయాలని నేను నిర్ణయించుకున్నా. ‘నానో’ ఎప్పటికీ మన ప్రజల కోసమే’’ అని రతన్ టాటా రాసుకొచ్చారు.
లగ్జరీ హోటల్‌నే మూగజీవాలకు ఆశ్రయంగా మార్చి..
వీవీఐపీలు, సెలబ్రిటీలు నిత్యం వచ్చే తాజ్‌మహల్ హోటల్ ప్రవేశ ద్వారం వద్ద వీధి శునకం నిద్రిస్తుండటాన్ని కొన్నాళ్ల క్రితం ప్రముఖ హెచ్‌ఆర్ నిపుణురాలు రుబీఖాన్ గమనించారు. నాడు హోటల్ సిబ్బందిని అడగ్గా.. ‘‘ఆ శునకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగింది. హోటల్‌లో ఓ భాగమైపోయింది. అక్కడికి వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్‌టాటా నుంచి విస్పష్టమైన ఆదేశాలున్నాయి’’ అని వెల్లడించినట్లు రాసుకొచ్చారు. చాలామంది అతిథులు అసలు దానిని గమనించి ఉండరన్నారు. ఇంత గందరగోళం మధ్య కూడా ఆ ప్రదేశాన్ని అది సొంతదిగా భావించిందని ముచ్చటపడ్డారు. ఈ విషయాన్ని నాడు లింక్డ్‌ఇన్‌లో పంచుకొన్నారు.
టాటాల వ్యాపార సామ్రాజ్య రాజధానిగా భావించే బాంబే హౌస్‌లోనే వీధి శునకాలకు ఆయన ప్రత్యేకంగా ఉండేందుకు గదులను ఏర్పాటు చేశారు. ఏదైనా శునకం కష్టాల్లో ఉంటే.. దానిని ఎవరైనా దత్తత తీసుకోవాలని ఆయన తన సామాజిక మాధ్యమ ఖాతాల నుంచి విజ్ఞప్తి చేస్తుంటారు.
కొవిడ్ వేళ ఉద్యోగుల తరఫున గళం విప్పిన రతన్..
కొవిడ్‌ను సాకుగా చూపి కంపెనీలు కష్టకాలంలో ఉద్యోగులను వదిలించుకొనే విధానంపై ఆయన గళం విప్పారు. ఓ ఆంగ్ల పత్రికతో నాడు మాట్లాడుతూ.. ఇది నష్టాలు వస్తున్నందుకు కంపెనీలు చేస్తున్నది కాదు.. వారిని రోడ్డున పడేస్తే కంపెనీల సమస్యలు తీరతాయా అని ప్రశ్నించారు. ఉద్యోగులను తొలగించకుండా సరైన దిశలో ఆలోచించి చర్యలు తీసుకొంటే ఈ కష్టం నుంచి బయటపడొచ్చని పేర్కొన్నారు. కొవిడ్‌తో పోరాడేందుకు ఆయన ఏకంగా రూ.500 కోట్ల నిధులను కేటాయించారు.
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా..
26/11 ముంబయి ఉగ్రదాడిలో తాజ్‌మహాల్ హోటల్ సిబ్బంది 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నాడు స్వయంగా రతన్‌టాటా గాయపడిన, చనిపోయిన వారి కుటుంబాలను సందర్శించి.. వారి పిల్లల చదువు బాధ్యతలను టాటా గ్రూప్ చూసుకొంటుందని భరోసా ఇచ్చారు. చనిపోయిన వారికి మిగిలిన జీవిత కాలంలో ఉద్యోగంలో వచ్చే జీతాన్ని ఆ కుటుబాలకు చెల్లించారు. తాజ్ పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ గ్రూపును ప్రారంభించారు.
మాజీ ఉద్యోగి ఇంటికి వెళ్లి మరీ..
రతన్ టాటా తన వద్ద పనిచేసి మానేసిన ఓ ఉద్యోగికి అనారోగ్యంగా ఉందని తెలుసుకొన్నాడు. ఆయనే స్వయంగా ముంబయి నుంచి పుణెకు వెళ్లి ఆ వ్యక్తిని కలిశారు. ఈ విషయం మూడో కంటికి తెలియనీయలేదు. చివరికి లింక్డ్‌ఇన్ పోస్టు ద్వారా వెలుగులోకి వచ్చింది.
డ్రైవర్ పక్కసీటే ఫేవరెట్..
సాధారణంగా సంపన్నులు, బిజినెస్ టైకూన్లు కార్లలో వెనక సీట్లలో కూర్చొంటారు. కానీ, రతన్‌టాటా మాత్రం డ్రైవర్ పక్కనే కూర్చొని ప్రయాణాలను ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి డ్రైవర్ లేకపోతే ఆయనే స్టీరింగ్ వీల్‌ను అందుకొంటారు. విమానాల్లో తరచూ ఆయన ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణిస్తుంటారు. ఆయనతో ప్రయాణికులు కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిస్తుంటాయి.
సమాజంలో సానుకూలతను పంచండి..
ఆన్‌లైన్‌లో విద్వేషం వ్యాప్తిపై రతన్ టాటా గతంలోనే గళం విప్పారు. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టి తన ఫాలోవర్లు వర్చ్యువల్ బుల్లియింగ్‌కు పాల్పడొద్దని పేర్కొన్నారు. ఇతరులపై అనవసరంగా తీర్పులు ఇవ్వొద్దని యువతకు సూచించారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి