మాండలిక బ్రహ్మ - నామిని
- October 16, 2024
నామిని సుబ్రమణ్యం నాయుడు … తెలుగు గ్రామీణ సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఒక సెంటరాఫ్ అట్రాక్షన్. ఆయన కలం నుండి జాలువారిన పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కథలు, మిట్టూరోడి కథలు – ఇలా ఒకటా, రెండా ఆయన రాసినవన్నీ జనం గుండెలోతుల్లోకి వెళ్ళిపోయాయి. సగటు మనుషుల ఆశల్ని, చిన్నచిన్న సంతోషాల్ని, డబ్బు యావల్ని, కోరికల్ని, గుట్లనీ, గుంభనల్నీ ఏమాత్రం ఫిల్టర్ చేయకుండా రాయడమంటే అది కత్తి మీద నిలబడి నెత్తురొలకబోదని చెప్పడమే. నామిని ఆ సాహసం చేశారు, గెలిచాడు, గెలుస్తూనే వున్నాడు. నేడు సుప్రసిద్ధ తెలుగు రచయిత మాండలిక బ్రహ్మ నామిని సుబ్రమణ్యం నాయుడు గారి జన్మదినం.
నామినిగా సుప్రసిద్దులైన నామిని సుబ్రమణ్యం నాయుడు గారు 1948,అక్టోబర్ 16న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా కమ్మకండ్రిగ పంచాయితీ పరిధిలోని మిట్టూరు గ్రామంలో జన్మించారు. చంద్రగిరి, తిరుపతిలలో చదువుకున్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచే వివిధ సాహిత్య కారుల పుస్తకాలు చదువుతూ తనకు తోచిన విధంగా ఊహాజనితమైన కథలు రాసుకునే వారు నామిని.
రచనల పట్ల ఉన్న ఆసక్తే ఆయన్ని జర్నలిజం వైపు నడిపించింది. తిరుపతి ఈనాడు పత్రిక సంచిక మొదలైన సమయంలో అక్కడ చేరిన నామిని, అనతి కాలంలోనే సబ్ ఎడిటర్ బాధ్యతలు చేపట్టి ఒకటిన్నర సంవత్సరం పనిచేశారు. ఈ సమయంలోనే నాడు ఈనాడులో పనిచేస్తున్న ప్రసిద్ధ పాత్రికేయులు దివంగత కె.వై.ఎన్.పతంజలి గారితో పరిచయం ఏర్పడింది. పతంజలి గారి సిఫారస్సుతో ఉదయం దినపత్రిక అనుబంధ ఆదివారం వారపత్రికలో ఉద్యోగం లభించింది. ఉదయంలో ఉండగానే ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఆహ్వానంతో పాటుగా త్వరలోనే తిరుపతి సంచిక ప్రారంభం కాగానే అక్కడ పనిచేసేందుకు అవకాశం ఉంటుందనే ఒప్పందంతో జ్యోతి హైదరాబాద్ కార్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత తిరుపతి జ్యోతి సంచిక ప్రారంభం కాగానే అక్కడికి వెళ్లిపోయారు. 2001లో జ్యోతి మూతబడిన తర్వాత పలు పత్రికలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు.
చిన్నతనంలోనే మొదలైన నామిని వారి రచనా వ్యాసంగం, తిరుపతిలో చదువుకుంటున్న సమయంలోనే బస్సులో ప్రయాణం చేస్తుండగా జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ ద్వారా రచన పట్ల పూర్తి స్థాయి మక్కువ ఏర్పడింది. చిత్తూరు యాసలో ఆయన రాసిన కథలను నాటి ప్రముఖ దినపత్రికలకు పంపిస్తే వెనక్కి తిరిగొచ్చేవి. అలా, ఆయన రచనా ప్రస్థానం మొదలైంది. అలా దినపత్రికల్లో పనిచేస్తున్న సమయంలోనే 1981లో మళ్ళీ జన్మించు, మహాత్మా,1982లో చిగురు, 1984లో రైతు కథ, 1985లో సుకన్య,1986లో నా కుశాల నా మనేద మరియు సుందరమ్మ కొడుకులు వంటి కథలు పాఠకుల ఆదరణ పొందాయి.
పతంజలి గారి ప్రేరణతో తొలిసారిగా 1986లో రాసిన "పచ్చనాకు సాక్షిగా" పుస్తకం నాటి తెలుగు సాహిత్య రంగంలో సంచనలం సృష్టించింది. చిత్తూరు గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ రాసిన ఈ పుస్తకాన్ని సుప్రసిద్ధ దర్శక ద్వయం బాపు- రమణల మెప్పు పొందింది. ఒకానొక సందర్భంలో తన అభిమాన రచయిత నామిని అని స్వయంగా బాపు గారే కొనియాడారు. నాటి నుంచి నామిని పుస్తకాలకు ఆయనే స్వయంగా బొమ్మలు వేస్తూ వచ్చారు. పచ్చనాకు సాక్షి తర్వాత 1989లో "సినబ్బ కతలు", 1994లో తన స్వీయ బాల్య జీవితాన్ని తెలియజేస్తూ "మిట్టూరోడి కతలు" , 1996లో రైతుల జీవితాల మీద "మునికన్నడి సేద్యం" రాశారు. వీటితో పాటుగా ఆయన పాలపొదుగు, మూలింటామె రచనలతో పాటుగా "మిట్టూరోడి సమగ్ర సాహిత్యం" పేరిట తన గ్రామీణ సాహిత్యాన్ని మొత్తాన్ని కలిపి 827పేజీల మహాగ్రంథాన్ని ముద్రించారు. 2016లో ఈనాడు వార పత్రికకు రాసిన "రాతి మిద్దాయన చిన్న కుమార్తె" కథ చదువరులను విశేషంగా ఆకట్టుకుంది.
చదువుల పేరిట చిన్నారులు పడుతున్న ఒత్తిడిని గమనించిన నామిని 1999లో విద్యార్థులు స్కూలు జీవితాల ఆధారంగా "ఇస్కూలు పిలకాయల కత", 2000లో ఆల్జీబ్రా లెక్కల మీద "పిల్లల భాషలో Algebra", 2001లో విద్యార్థులపై చదువుల భారం మీద పుస్తకం రాసి దానికి పేరు సూచించమని తనకు తెలిసిన విద్యార్థులను కోరగా ఎక్కువ మంది ‘చదువులా?.. చావులా?’ అని సూచించారంట. అదే పేరుతో ఆయన పుస్తకాన్ని ప్రచురించారు. 2002లో పిల్లల పెంపకంలో తల్లి పాత్రను ప్రధానంగా చేసుకొని "మా అమ్మ చెప్పిన కథలు", 2010లో "పిల్లలతో మాట్లాడాల్సిన మాటలు" పుస్తకాలను రాయడమే కాకుండా తన టామ్ సాయర్ బుక్స్ సంస్థ ద్వారా ప్రచురించి, విద్యార్థులకు ఉచితంగా పంచిపెట్టారు. రెండు దశాబ్దాల క్రిత్రం ఆయన రచనల్లో పేర్కొన్న అనేక విషయాలు నేడు విద్యార్థులు జీవితాల్లో జరగడం బట్టి చుస్తే భవిష్యత్తును ఉహించి రచనలు చేయడం ఆయన ముందుచూపుకు నిదర్శనం.
నామిని రాసేవి కేవలం అక్షరాలు కావు. అవి మేలు రకం విత్తనాలు. వాక్యాలు కావవి, రాగులూ, సజ్జలూ, జొన్న రాశులు. తాటాకు గుడిసె ముందు చింకి చాప పరిచి, నిండు జీవితాన్ని ఎండబెడతాడు. నిరాశ నిండిన బతుకు నీడల మీద నుంచి నడిచి వెళిపోతుంటారు. పల్లెటూరి పేదరికాన్ని,తిండి గింజలు లేని వేదనని దయతో, ప్రేమతో,అపేక్షతో చూస్తాడు. ఆ నిత్యజీవన వేదనలోని విషాద సంగీతాన్ని చెవివొగ్గి మరీ వింటారు. ఆ చీకటిని కూడా వెలిగించగలిగే చిరునవ్వు వెనుక దాగిన హాస్యాన్నీ ఒడిసి పట్టుకుంటారు.వాటిని కథలుగా రాస్తాడు. గోగాకు వూరు బిండితో సద్ది తాగినట్టు , ఆదివారం మాంసం కూరతో ఆబగా తిన్నట్టు నులక మంచమ్మీద నాన్న పక్కన సుఖంగా నిద్ర పోతున్నట్టు….. అలవోకగా రాసుకుంటూ పోతారు.
నామిని రాసే చిత్తూరు జిల్లా భాష నుడికారంలో ఒక సౌందర్యం, జీవసుగంధం ఉంటాయి. కథ చెప్పడంలో నామినిది ఒక ప్రత్యేకమైన నేరేటివ్ టెక్నిక్ .దూరం నుంచి చూస్తున్న ప్రేక్షకుడి లాగానే నిరపేక్షగా కథ నడిపిస్తారు. ఆ శిల్పచాతుర్యం మనల్ని చకితుల్ని చేస్తుంది. ఎక్కడా తొణకడు. మెలోడ్రామాకు పాల్పడరు. పాఠకుణ్ణి మెప్పించే వేషాలు వేయరు.కేవలం వాక్యనిర్మాణ నైపుణ్యం మాత్రమే కాదు, నిస్సoకోచంగా భయమూ బెరుకూ లేకుండా చెపుతాడు.అతని చూపుతో, అభివ్యక్తితో అనంతమైన వూహా శక్తితో ఒక అపూర్వమైన అనుభవానికి ద్వారాలు తెరుస్తాడు.ఉత్తమాభిరుచికి కొత్త దారులు పరుస్తారు. వడపోసిన జీవితానుభవసారాన్ని తేలిక మాటలతో సులభంగా,సూటిగా చెప్పడం అంత తేలికేమి కాదు.పైగా, పరిమళభరితమైన ఒక ప్రాంతీయ మాండలికానికి ఉత్తమ సాహిత్య గౌరవం యిచ్చి, తాను ముందుండి ఆ మహోద్యమాన్ని నడిపించిన లీటరరీ విజనరీ నామిని.
రాయలసీమ మాండలికం అనే కల్తీ లేని వెన్నెల విత్తనాలను రాష్ట్రమంతటా వెదజల్లితే, అవి మన పెరట్లో రంగురంగుల సీతాకోకచిలుకలై ఎగిరి,యాస పువ్వులై విరబూశాయి. సువాసనలు పంచి యిచ్చాయి. ఆ యాసకు వుండే సొగసునీ, తూగునీ, మాధుర్యాన్ని మనలో నింపుతూనే, ఆ వ్యక్తీకరణలోని శక్తితో గుండెను చీల్చి వేయడం అనే రహస్య విద్యలో ఆరితేరిన వాడు నామిని.అక్షరాలను ఆవిర్లు ఎగజిమ్మే అన్నం మెతుకులుగా మార్చగలిగిన వ్యక్తి నామిని. పూట గడవని సామాన్య జనం యాసలోని రసపారవశ్యాన్ని అనుభవించి, ఆ పలుకుబడి మాధుర్యంతో మన దోసిలి నింపినవారు …సహజసుందరమైన యాసలోని ఆత్మసౌందర్యాన్ని తెలుగు పాఠకుల గుండెల్లోకి వొంపినవారు. అందుకే ఆయన్ని ‘మాండలిక బ్రహ్మ’గా పిలుచుకుంటారు.
ఆధునిక తెలుగు సాహితీ లోకానికి ఇచ్చిన అమూల్యమైన,అమృతతుల్యమైన కానుక నామిని సుబ్రహ్మణ్యం నాయుడు. చిత్తూరు జిల్లాల్లో అనేకమంది రచయితలు మాండలికాన్ని పండించినా, ఆ ప్రాంతపు మాటల్ని నామిని పదునుగా, ఇంత చురుగ్గా, ఇంత లాఘవంగా రికార్డు చేసి, పాత్రల చేత పలికించినవారు లేరు. ఎండలో, వానలో, వెన్నెల్లో తడిచిన నాణ్యమైన మిట్టూరు మట్టిని తెలుగు సాహిత్యాకాశం అంచులదాకా విసిరినవాడు, జాను తెలుగుయాసను త్రికరణశుద్ధిగా జాతికి అంకితం చేసినవాడు నామిని ఒక్కడే! ఒక పాప, ఒక బాబు- నిద్రపోతున్న ఇద్దరు చిన్న పిల్లలు, ఆడ చందమామలా, మగ చందమామలా వున్నారని రాయడం తెలుగులో మరో రచయితకు సాధ్యం అయ్యే పనేనా? అనుపమానమైన వాక్య నిర్మాణ శిల్పిగా, ఎప్పుడో నూరేళ్ళకొకసారి పూసే పువ్వులాంటి అపురూపమైన సాహితీవేత్తగా నామిని నిస్సందేహంగా విశ్వమానవుడు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి