డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన రజిత

- October 18, 2024 , by Maagulf
డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన రజిత

పాతికేళ్ల క్రితం వెండి తెర మీద వెలగాలంటే...సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆల్బమ్‌లు పట్టుకొని ఆడిషన్లకు వెళ్లాలి.ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాలి. కానీ, నటి రజిత అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు.అవకాశాలే తనని వెతుక్కుంటూ వచ్చాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సినీ పరిశ్రమలో నటిగా నిలబడ్డారు. నటిగా కొన్ని వందల సినిమాల్లో నటించిన అనుభవం ఆమె సొంతం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, అక్క, వదిన, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన రజిత ఒరియా, కన్నడ , మలయాళం లో హీరోయిన్ గా చేసారు. నేడు సీనియర్ మూవీ క్యారెక్టర్ ఆర్టిస్టు రజిత పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..

రజిత పూర్తి పేరు మల్లెల రజిత చౌదరి. 1972,అక్టోబర్ 18న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణంలో మల్లెల రామారావు, విజయలక్ష్మి దంపతులకు ఆఖరి సంతానంగా జన్మించారు. వీరి స్వస్థలం మాత్రం పామర్రు మండలంలోని కూళ్ళ గ్రామం. రజిత చిన్నతనంలోనే ఆమె తండ్రి కాలం చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు.అయితే, రజిత చదువుల్లో చాలా ముందుండేవారు.కాకినాడలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు.డాక్టర్ అవ్వాలనేది ఆమె చిరకాల కోరిక.కానీ, పై చదువులకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే ఆమె పిన్ని ప్రముఖ సహాయక నటి కృష్ణవేణి అండతో చెన్నై వెళ్లి ఇంటర్ చదివింది. కృష్ణవేణి ద్వారా సినిమా అవకాశాలు రావడంతో ఇంటర్ తర్వాత సినిమాల్లోకి వచ్చింది.

రజితకు సినిమాల్లో నటించడం మొదట్లో ఇష్టం లేకపోయినా, తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అక్కలకు పెళ్లి చేసేందుకు సినిమాల్లోకి వచ్చారు.1987లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన నాగార్జున హీరోగా నటించిన అగ్నిపుత్రుడు ఆమె మొదటి సినిమా.ఈ సినిమాలో నాగార్జున, ఏయన్నార్ లతో కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి నటన మీద దృష్టి పెట్టారు. 'సాహసం సేయరా డింభకా', 'వివాహ భోజనంబు', 'చినరాయుడు'.. వంటి హిట్ సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఇదే సమయంలో తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.    

1995 నుంచి ఒరియా, మలయాళం చిత్రాల్లో సైతం నటిస్తూ వచ్చారు. 1998లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి చిత్రంతో రజితకు మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ సినిమాకు ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ సినిమా తర్వాత తెలుగులో బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. హాస్య చిత్రాల్లో రజిత పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండేలా దర్శక రచయితలు శ్రద్ద తీసుకునేవారు. పర భాషా చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పట్టికి తన తెలుగులో బిజీగా ఉండటం మూలాన నటించలేకపోయారు. ఇప్పటి వరకు దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఉన్న అగ్రహీరోలతో నటించారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలతో అత్యధిక చిత్రాల్లో రజిత నటించారు.  

సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే బుల్లితెర మీద తళుక్కున మెరిశారు. సీరియళ్ల ట్రెండ్ మొదలవుతున్న ప్రారంభంలో రెండు మూడు బుల్లితెర ధారావాహికల్లో నటించి మెప్పించారు. సినిమాల్లో చలాకీగా ఉండే రజిత నిజ జీవితంలో చాలా సౌమ్యురాలు. పుస్తక పఠనం ఆమెకు ముఖ్య హాబీ, షూటింగ్‌ సమయంలో కాస్త ఖాళీ దొరికితే పుస్తకాలు చదువుతూ గడుపుతారు. అప్పుడప్పుడు బుక్ ఫెయిర్లలో పాల్గొంటూ తనకు నచ్చిన పుస్తకాలను కొనుక్కుంటారు. కుటుంబ బాధ్యతల వల్ల ఇప్పటికి అవివాహితగా ఉండిపోయారు. ప్రస్తుతం తన తల్లితో కలిసి భాగ్యనగరంలోనే ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం సినిమాల్లోకి వచ్చిన రజిత, అనతి కాలంలోనే ప్రముఖ నటిగా చిత్ర పరిశ్రమలో ఎదిగారు. రాబోయే రోజుల్లో మరిన్ని చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తారని ఆశిస్తూ, మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు రజిత.   

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com