నేషనల్ చిల్డ్రన్స్ డే....!

- November 14, 2024 , by Maagulf
నేషనల్ చిల్డ్రన్స్ డే....!

ప్రపంచంలో చాలా దేశాలు నవంబర్ 20వ తేదీన చిల్డ్రన్స్ డే చేసుకుంటాయి. ఒక్క భారతదేశంలో మాత్రమే నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం నిర్వహించుకుంటారు.దీనికి కారణం భారత దేశానికి మొట్ట మొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు ఈరోజు కావడం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాక దేశానికి ప్రగతి బాటలు వేయడంలో కీలక పాత్ర పోషించిన జవహర్ లాల్ నెహ్రూ గుర్తుగా ఈరోజును పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతే కాదు ఆయనకు చిన్నపిల్లలు అంటే కూడా చాలా ఇష్టం. దేశ పురోగతికి నేటి బాలలే పాటుపడతారని ఆయన బలంగా నమ్మారు. తెల్లని శాంతి కపోతంలా ఉండే నెహ్రూ కల్మషం లేని పిల్లలకు ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని భావించారు. అందుకే ఆయన తర్వాత ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నవంబర్ 14, 1889న జన్మించారు. భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా నాయకత్వం వహించిన మొదటి ప్రధానమంత్రి. ఆయన పుట్టినరోజును భారతదేశంలో ఒక పండుగలా జరుపుకుంటారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన రాజకీయ జీవితానికి మాత్రమే కాకుండా, పిల్లలలో తన జీవితం ముడిపడిఉంది. భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను పిల్లలు చాచా నెహ్రూ అని ముద్దుగా పిలిచేవారు, ఎందుకంటే వారు ఆయనను గౌరవిస్తారు, ప్రేమిస్తారు. చాచా నెహ్రూకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ వారి మధ్య ఉండేందుకు ఇష్టపడేవారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, పండిట్ నెహ్రూ బాలలు, యువత కోసం చాలా మంచి పనులు చేశారు.

జవహర్ లాల్ నెహ్రూకి ఉన్న మరోపేరు చాచా (Chacha). పిల్లల పట్ల ఆయనకు ఉన్న అమితమైన ఇష్టం కారణంగా దేశానికి ప్రధానిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినా పిల్లలను ఆప్యాయంగా పలకరించేవారు. వారిని దగ్గరకు తీసుకునే వారు. దీంతో పిల్లలంతా ఆయనను చాచా నెహ్రు అని పిలిచేవారు. అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం.అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు అని నెహ్రూ అనేవారు. భారతదేశంలో ఇంకే స్వాతంత్ర యోధుడికి కానీ...రాజకీయనాయకుడికి కానీ దక్కని గౌరవం ఇది. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.

నవంబర్ 14...ఇది భారతదేశంలో ముఖ్యమైన తేదీల్లో ఒకటి. కులం, మతం, ఆర్థిక లేదా రాజకీయ హోదాతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు విద్య, వైద్యం, స్వేచ్ఛ వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే హక్కు ఉందని ఈ రోజు గుర్తుచేస్తుంది. 1925లో మొట్టమొదటిసారిగా బాలల సంక్షేమం పై ప్రపంచ సదస్సు సందర్భంగా జెనీవాలో అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రకటించారు. 1950 తర్వాత యచాలా దేశాల్లో జూన్ 1న బాలల దినోత్సవం జరుపుకునేవారు. అది మళ్ళీ మార్పు చెంది 1959 నుంచి UN జనరల్ అసెంబ్లీ (UN General Assembly) ద్వారా బాలల హక్కుల ప్రకటన జ్ఞాపకార్థం నవంబర్ 20న ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాలా దేశాలు ఇదే రోజు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మెరికా మాత్రం జూన్ రెండో ఆదివారాన్ని చిల్డ్రన్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటుంది.  

బాలల దినోత్సవం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పిల్లల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య, శ్రేయస్సుకి పాటుపడటంతో పాటు, పోషకాహారం, ఇంట్లో సురక్షితమైన వాతావరణం అందించడం వంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది.పేదరికం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, బాల కార్మికులుగా మారడం వంటి పిల్లలు ఎదర్కుంటున్న సవాళ్లపై అవగాహన పెంచుతుంది. బాలల శారీరక, మానసిక వికాసం పెంపొందేలా వ్యక్తులు, సంఘాలు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ఈరోజు సరైన సందర్భంగా చెప్పాలి.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com