నీళ్ళసారు-ఆర్.విద్యాసాగర్ రావు

- November 14, 2024 , by Maagulf
నీళ్ళసారు-ఆర్.విద్యాసాగర్ రావు

తెలంగాణ ఉద్యమంలో నీళ్ల లెక్కలతో చైతన్యం చేసిన నిపుణుడిగా విద్యాసాగర్ రావు. ప్రాజెక్టులు నిర్మించాలని, తెలంగాణ రైతులకు సాగునీరు, తాగునీరు అందించాలని ఆయన ఎన్నో కలలు కన్నారు. తెలంగాణ ప్రజలకు నీటి సమస్యలను సులువుగా వారికర్థమయ్యే విధంగా చెప్పి వారిని తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా పురికొల్పడంలో విద్యాసాగ‌ర్‌రావు గారు కీలకపాత్ర పోషించారు. తెలంగాణ జనహృదయాల్లో ఒక జలవిజ్ఞాన నిధిగా, నీళ్ళసారుగా నిలిచిపోయారు. నేడు ఆయన జయంతి.

 నీటిపారుదల రంగంపై అపార పరిజ్ఞానం ఆర్.విద్యాసాగర్ రావు గారు 1939 నవంబర్ 14న నైజాం రాష్ట్రంలోని సూర్యాపేట తాలూకా జాజిరెడ్డిగూడెం గ్రామంలో జన్మించారు. 960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు. కొన్నాళ్లు రాష్ట్ర ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీరుగా పనిచేసి, ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖలో చేరారు. ఇంజనీరుగా పనిచేస్తూనే.. 1979లో రూర్కీ యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం పూర్తి చేశారు. 1983లో అమెరికాలోని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్సెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో డిప్లమా పొందారు.

ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి కొంతకాలం సలహాదారుగా వ్యవహరించారు. 1997లో చీఫ్ ఇంజనీర్‌గా కేంద్ర జలవనరుల శాఖలో ఉద్యోగ విరమణ చేశారు.  కొంతకాలం ప్రణాళికా సంఘం 12వ పంచవర్ష ప్రణాళిక వర్కింగ్ గ్రూప్ లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, ఆయకట్టు అభివృద్ధి ప్రాజెక్టు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. నాబార్డుకు, ప్రపంచ బ్యాంకు సంబంధిత ప్రాజెక్టుకు, కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సలహాదారుగా సేవలందించారు.

విద్యాసాగర్ రావు రాసిన నీళ్లు-నిజాలు మొదటి సంకలనం 2006లో వెలువడింది. 2006 నుండి 2013 వరకు రాసిన వ్యాసాల సంకలనం నీళ్ళు-నిజాలు 2గా ప్రచురితమైంది. ఇంజనీరింగ్ రంగానికి విశేష సేవలు అందించినందుకు 2014లో ఆయనకు పురస్కారం లభించింది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే విద్యాసాగర్ రావు జీవితంలో ఒక విషాద సంఘటన జరిగింది. కేంద్ర జల వనరుల సంఘంలో సభ్యుడిగా పని చేస్తూనే.. తెలుగు ప్రజలకు నీటి పారుదల రంగంలో సేవలు అందించాలన్న తపనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఆయన బదిలీపై వచ్చారు. అయితే ఆ సమయంలోనే కారు ప్రమాదంలో ఆయన కుమారుడు చనిపోయాడు. ఆ సంఘటన విద్యాసాగర్ రావు జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ బాధను తట్టుకోలేక ట్రాన్స్ ఫర్ చేయించుకొని మళ్లీ ఢిల్లీ వెళ్లిపోయారు.

నీటిపారుదల రంగంపై అపార పరిజ్ఞానం ఆర్.విద్యాసాగర్ రావు సొంతం. అబ్బురపరిచే ప్రతిభాపాటవాలతో నీటి లెక్కలను నోటితో గడగడా చెప్పడం ఆయనకే చెల్లింది. దేశంలోని నదులు, నీటి వనరుల వివరాల్లో ఆయనకు తెలియనవి లేవంటే అతిశయోక్తి కాదు. సాగు నీటిరంగ సమస్యలపై, ముఖ్యంగా తెలంగాణకు సాగునీటి రంగంలో జరిగిన, జరుగుతున్న అన్యాయాలను, వివక్షను నిశితంగా విశ్లేషిస్తూ పత్రికల్లో వందలాది వ్యాసాలు రాశారు. కేంద్ర జలసంఘంలో వివిధ స్థాయిల్లో పనిచేసిన విస్తృత అనుభవంతో ఆయన చేసిన విశ్లేషణలు పాఠకులను విశేషంగా ఆకర్షించాయి. ఒక్క రాయడమే కాదు తెలంగాణ అంతటా వందలాది సభల్లో ప్రసంగాలు చేసి తెలంగాణ ఉద్యమానికి ఊతమయ్యారు. నీటి దోపిడి రాజకీయాలను ప్రజలకు చేరవేసి.. జనాన్ని చైతన్యవంతులను చేయడంలో విద్యాసాగర రావు కృషి అనితరసాధ్యం.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com